మృతి చెందిన జానకి, ఆమెకు జన్మించిన మగబిడ్డ
సాక్షి, విజయనగరం : ఆ తల్లి నవమాసాలూ మోసింది. తొలిచూలు బిడ్డపై గంపెడాశలు పెట్టుకుంది. ఆ బిడ్డను అందరికంటే మిన్నగా పెంచాలని... చక్కగా తీర్చిదిద్దాలని... ఎన్నో కలలు కన్నది. మాయదారి డెంగీ మృత్యువుగా మారుతుందనుకోలేదు. ప్రసవానికి వారం రోజులముందే ఆమెకు జ్వరం సోకింది. అదికాస్తా డెంగీకి దారితీసింది. చికిత్స చేయించి... నిండు గర్భిణి అయిన ఆమెను ఎలాగైనా కాపాడుకోవాలని ఆ తల్లిదండ్రులు చేసిన ప్రయత్నం విఫలమైంది.
విశాఖ కేజీహెచ్‌లో మగబిడ్డకు జన్మనిచ్చిన ఆమె కన్నుమూసింది. కన్నులైనా తెరవని ఆ శిశువు ఈ లోకాన్ని చూడకుండానే... తన తల్లిలేని లోకంలో తానెందుకుండాలనుకున్నాడో ఏమో... ప్రాణాలు కోల్పోయాడు. ఇదీ గరివిడి మండలం బొండపల్లి గ్రామానికి చెందిన వలిగింటి జానకి(23) విషాద గాథ. భర్త వలిగింటి జనార్దన రాజాంలో చిన్నపాటి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
మూడేళ్లక్రితం వారికి వివాహం జరిగింది. జానకి ప్రస్తుతం నిండు గర్భిణి. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతుంటే రాజాంలోని ఓ డాక్టర్‌కు చూపించారు. వారు డెంగీ సోకిందని తల్లిబిడ్డను రక్షించుకోవాలంటే వెంటనే కేజీహెచ్‌కు తరలించాలని చెప్పారు. గత సోమవారమే కేజీహెచ్‌లో చేర్చారు. కానీ విధి వక్రీకరించింది. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఓ బిడ్డకు జన్మనిచ్చి ఆమె కన్నుమూయగా... పుట్టిన బిడ్డ సైతం మృత్యువాతపడింది. మృతదేహాలను సోమవారం స్వగ్రామానికి తీసుకువచ్చి
అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment