mother and child died
-
180 కిలో మీటర్లు.. 5 ఆస్పత్రులు.. సకాలంలో వైద్యం అందక తల్లీబిడ్డ మృతి
సాక్షి, అమ్రాబాద్/పాలమూరు: కాన్పు విషయంలో కుటుంబ సభ్యులు చేసిన జాప్యం, సకాలంలో వైద్యులు అందుబాటులో లేకపోవడం రెండు నిండుప్రాణాలను బలితీసుకున్నాయి. పురిటినొప్పుల తో బాధపడుతూ రెండు పీహెచ్‌సీలు, రెండు ఆస్పత్రుల పరిధిలో 180 కి.మీ. దూరంపాటు ప్రయా ణించినా తల్లీబిడ్డ ప్రాణాలు దక్కలేదు. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో సోమ వారం అర్ధరాత్రి ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం వంకేశ్వరానికి చెందిన స్వర్ణ(23)కు రెండేళ్ల క్రితం అమ్రాబాద్ మండలం ఎల్మపల్లికి చెందిన చారగొండ ప్రసాద్‌తో వివాహమైంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. స్వర్ణ గర్భం దాల్చడంతో కాన్పు కోసం 2 నెలల క్రితం పుట్టింటికి వచ్చింది. సోమవారం రాత్రి 8:30 గంటల సమయంలో నొప్పులు రావడంతో ప్రైవేటు వాహనంలో ఆమెను పదర పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ కిందిస్థాయి సిబ్బందే ఉండటంతో భయపడిన కుటుంబ సభ్యులు... అమ్రాబాద్ పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ కూడా వైద్యుడు లేకపోవడంతో అచ్చంపేటకు తీసుకెళ్లారు. అప్పటికే చాలా దూరం ప్రయాణించడంతో స్వర్ణకు ఫిట్స్ వచ్చాయి. అచ్చంపేట ఆస్పత్రి వైద్యులు నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రికి సిఫార్సు చేయడంతో అంబులెన్స్‌లో బయల్దేరారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు ప్రాథమికంగా ఇంజక్షన్లు ఇచ్చి మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేయగా సోమవారం అర్ధరాత్రి 2:30గం. సమయం లో అక్కడికి చేరుకున్నారు. చివరకు సోమవారం అర్ధరాత్రి దాటాక 3:30 గంటలకు వైద్యులు సాధారణ ప్రసవం చేశారు. కానీ ప్రసవించిన కాసేపటికే ఊపిరి తీసుకోలేక శిశువు మృతి చెందింది. అరగంట తర్వాత బాలింత కూడా మరణించింది. పదర, అమ్రాబాద్ పీహెచ్‌సీల్లో వైద్యులు అందుబాటులో ఉండి ప్రసవం చేసుంటే తమ బిడ్డ బతికేదని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. గుండెపోటుతో మృతి చెందింది... స్వర్ణకు బీపీ సమస్య ఉంది. ప్రసవ సమయం కంటే ముందే ఆస్పత్రిలో ఆడ్మిట్ కావాలని స్థానిక వైద్యులు సూచించినా కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం చేసి నొప్పులు మొదలయ్యాకే అమ్రాబాద్ తీసుకెళ్లారు. అప్పటికే ఆమెకు ఒకసారి ఫిట్స్ వచ్చాయి. అక్కడి నుంచి అచ్చంపేట, నాగర్‌కర్నూల్ ఆ తర్వాత మహబూబ్‌నగర్‌కు వచ్చేసారికి నాలుగుసార్లు ఫిట్స్ వచ్చాయి. మేం సాధారణ ప్రసవం చేశాక మరోసారి ఫిట్స్, ఆపై గుండెపోటు రావడంతో స్వర్ణ మృతి చెందింది. – మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ జీవన్ చదవండి: చేర్యాల జెడ్పీటీసీ హత్య: భూముల అమ్మకాలా.. బీరప్పగుడి వ్యవహారమా? -
కన్నపేగును తెంచుకుని..
కల్హేర్(నారాయణఖేడ్): కుటుంబానికి భారంగా మారొద్దని భావించిన అంధురాలైన ఓ తల్లి, దివ్యాంగుడైన కొడుకు బలవన్మర ణానికి పాల్పడ్డారు. ఈ హృదయ విదారక ఘటన సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మాసాన్‌పల్లి చౌరస్తాలో ఆదివారం చోటుచేసుకుంది. మాసాన్‌పల్లికి చెందిన కమ్మరి గంగామణి(55), చంద్రయ్య దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. గంగామణి అంధురాలు కాగా, కొడుకు సంగమేశ్వర్(35) శారీరక వైకల్యంతో బాధపడుతున్నాడు. ఆమె కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతోంది. కొడుకుతోపాటు తన ఆరోగ్యం కూడా సరిగ్గా లేకపోవడంతో కుటుంబానికి భారంగా మారామని మథనపడుతోంది. ఈ నేపథ్యంలో జీవితంపై విరక్తి చెంది కొడుకుతోసహా బలవన్మరణానికి పాల్పడాలని నిర్ణయించుకుంది. ఇటీవల చంద్రయ్య కొత్తగా నిర్మించిన ఇంటి ఆవరణలోని సంపులోకి సంగమేశ్వర్‌ను తోసేసింది. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్నాక ఆమె కూడా అందులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని కల్హేర్ ఎస్ఐ ప్రశాంత్‌కుమార్ తెలిపారు. -
ప్రకాశం జిల్లాలో రెండు విషాద ఘటనలు.. ఏడుగురు మృతి
సాక్షి, ప్రకాశం జిల్లా: జిల్లాలో ఒకేరోజు రెండు విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. బెస్తవారిపేట మండలం పెంచకలపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ ఆటోను డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో నాలుగు ఆవులు కూడా చనిపోయాయి. చదవండి: పుట్టింటికి పంపలేదని భర్తపై అలిగి.. ఇంట్లో ఎవరూలేని సమయంలో.. ఇదిలా ఉండగా, జిల్లాలోని చినగంజాం మండలం సోపిరాల రైల్వే గేటు సమీపంలో విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి.. ఇద్దరు పిల్లలతో సహా రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. మృతుల వివరాలు తెలియాల్సి వుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నన్ను క్షమించండి..
హాలియా: మూగ కుమారుడితో కలసి ఓ తల్లి హాలియా వద్ద సాగర్ ఎడమ కాల్వలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పంది. ‘నన్ను క్షమించండి..ఎలా బతకాలో అర్థం కావడం లేదు’అని ఓ సూసైడ్ నోట్ రాసి ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ ఘటనలో ఆమె కొడుకు విశాల్ శివ (5) మృతి చెందగా తల్లిని స్థానికులు రక్షించారు. ఆదివారం నల్లగొండ జిల్లా హాలియా పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ శివకుమార్ కథనం ప్రకారం.. అనుముల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పోలేపల్లి బక్కయ్య, అచ్చమ్మ దంపతుల కుమార్తె హేమలతని నిడమనూరు మండలం బంకాపురం గ్రామానికి చెందిన బొడ్డుపల్లి చిన వెంకట లింగయ్యకు ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు. పెద్ద కుమారుడైన విశాల్ శివ (5) పుట్టుకతో మూగ. కాగా, లింగయ్య పీహెచ్డీ చదువు నిమిత్తం కుటుంబంతో కలసి హైదరాబాద్‌లోని తార్నాకలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. విశాల్ శివ పుట్టుమూగ కావడంతో తల్లి హేమలత ప్రతి రోజు కొడుకు పరిస్థితిని తలుచుకుంటూ కుమిలిపోయేది. ఈ నెల 15న దసరా పండుగకు హేమలత పిల్లలతో కలసి తల్లిగారి ఊరు కొత్తపల్లికి వచ్చింది. భర్త లింగయ్య స్వగ్రామైన బంకా పురానికి వెళ్లాడు. కాగా, విశాల్ శివకు ఈ నెల 20న ఆపరేషన్ చేయాల్సి ఉంది. దీంతో తన కుమారుడి పరిస్థితిపై మనస్తాపం చెందిన హేమలత షాపింగ్ పేరుతో విశాల్‌ను తీసు కుని హాలియాకు వచ్చింది. అక్కడ సాగర్ కాల్వ వద్దకు వచ్చి కుమారుడిని చీరకొంగు తో నడుముకు కట్టుకొని కాల్వలోకి దూకింది. హేమలతను కాపాడిన స్థానికులు.. తల్లి, కుమారుడు కాల్వలో కొట్టుకుపోతున్న విషయాన్ని గమనించిన స్థానికులు తాళ్ల సహాయంతో వారిని ఒడ్డుకు చేర్చారు. తర్వాత చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి విశాల్ శివ మృతి చెందగా, హేమలతను మెరుగైన చికిత్స కోసం నల్లగొండలోని ఓ ఆస్పత్రికి తరలించారు. భర్త లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
నా చావుని త్వరగా మర్చిపోయి.. పెళ్లి చేసుకో
సాక్షి, ఒంగోలు: స్థానిక రంగారాయుడు చెరువులో దూకి ఓ తల్లి తన బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో రంగారాయుడు చెరువు సమీపంలో ఓ తల్లి తన బిడ్డను ఆడిస్తూ స్థానికులకు కనిపించింది. జనం పూర్తిగా పలచబడిన తర్వాత ఆమె తన 11 నెలల బిడ్డను పొట్టకు చున్నీతో కట్టుకుని నీటిలోకి దూకింది. ఎదురుగా ఉండే అపార్టుమెంట్‌లోని ఓ మహిళ చూసి సమీపంలో వాకింగ్ చేస్తున్న యువకుడికి పెద్దగా కేకలు వేసి చెప్పింది. ఆ యువకుడు తాను నీటిలోకి దూకలేనని, పోలీసులను తీసుకొస్తానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. చివరకు విషయం పోలీసులకు తెలిసి 2.10 గంటలకు సంఘటన స్థలానికి వచ్చారు. అప్పటికే తల్లి, బిడ్డ మృతదేహాలు నీటిపై తేలుతూ కనిపించాయి. సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా విషయాన్ని పోలీసులు ప్రజల్లోకి తీసుకెళ్లారు. గంట వ్యవధిలోనే మృతురాలి సోదరుడు, తల్లి సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: నిజమే.. ముగ్గురు కాదు ..ఒక్కడే! మెట్టినింట వివాదమే కారణం సుమారు రెండేళ్ల క్రితం ఒంగోలు గోపాల్‌నగర్ మొదటి లైనుకు చెందిన ఉలిచి విజయమ్మ కుమార్తె కమలను నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం వరిగొండకు చెందిన చిల్లకూరు అఖిలేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఏడో నెలలోనే బాబు జన్మించాడు. వీరితోపాటు అఖిలేష్ తల్లి, అమ్మమ్మ కూడా అక్కడే ఉంటారు. ఈ నేపథ్యంలో కమలకు వారితో మనస్పర్థలు వచ్చాయి. భర్త అఖిలేష్‌తో వేరు కాపురం పెట్టాలంటూ ఒత్తిడి తెచ్చింది. ఇందుకు అతడు ససేమిరా అన్నాడు. చివరకు ఆమె అలిగి పుట్టింటికి వస్తుంటే కన్న బిడ్డను కూడా వారి వద్దే ఉంచుకునే ప్రయత్నం చేశారు. చివరకు అక్కడి పోలీసులు జోక్యం చేసుకుని బిడ్డను తల్లికి అప్పగించారు. అనంతరం దంపతుల మధ్య ఏర్పడిన వివాదానికి సంబంధించి పలు పర్యాయాలు పెద్ద మనుషులు, పోలీసుల ద్వారా పుట్టింటి వారు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. 40 రోజులుగా పుట్టింటి వద్ద ఉంటున్న ఆమెకు భర్త వైపు నుంచి వేరు కాపు రానికి సంబంధించి ఎటువంటి హామీ లభించలేదు. తీవ్ర మనస్తాపం చెంది కమల అఘాయిత్యానికి పాల్పడింది. చదవండి: బాగా చదువుకో.. వెళ్తున్నా ! డైరీలో అన్నకు సూచనలు కమల తన ఆవేదనను ఆత్మహత్యకు ముందు డైరీలో రాసింది. తల్లి విజయమ్మ, అన్న సిద్ధార్థలు తనను ఎంత ప్రేమగా చూసుకునేవారో పేర్కొంది. నా మరణాన్ని త్వరగా మర్చిపోవాలని, పెళ్లి చేసుకుని వదినను నాకంటే బాగా చూసుకోవాలని కోరింది. అమ్మా.. నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాల్సిందని, అత్తింటికి వెళ్లి అక్కడ నరకయాతనను ఊహించుకోవాలంటేనే కన్నీళ్లు ఆగడం లేదంటూ బాధను వ్యక్త పరిచింది. నా బిడ్డను నేను చంపుకోవాలంటే బాధగానే ఉందని, వదిలేస్తే పెద్దయ్యాక నేను ఒంటరిని చేసి వెళ్లాననే బాధ నా బిడ్డకు ఉండకూడదని, అందుకే ధైర్యం చాలకున్నా నా బిడ్డను నాతోటే తీసుకెళ్తున్నా.. అంటూ పేర్కొంది. నా మరణాన్ని అవమానకరంగా చూడొద్దని, మనం ఇచ్చిన కట్నకానుకలు తీసుకుని వారిని వదిలేయాలని అత్తింటి వారిని ఉద్దేశించి తన తల్లిని, అన్నను కమల డైరీలో కోరింది. అంతేకాకుండా తన అంత్యక్రియలు అన్న సిద్దు చేతుల మీదుగానే జరగాలని. తన పేరును కూడా ఉలిచి (పుట్టింటి పేరు) కమలగానే చూడాలంటూ కోరింది. ఒన్‌టౌన్ సీఐ సీహెచ్ సీతారాం మాట్లాడుతూ కమల ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసిందని తెలిసిందని, డైరీని సీజ్ చేస్తున్నామని, పూర్తి విషయాలు తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
తల్లీబిడ్డను మింగిన డెంగీ
సాక్షి, విజయనగరం : ఆ తల్లి నవమాసాలూ మోసింది. తొలిచూలు బిడ్డపై గంపెడాశలు పెట్టుకుంది. ఆ బిడ్డను అందరికంటే మిన్నగా పెంచాలని... చక్కగా తీర్చిదిద్దాలని... ఎన్నో కలలు కన్నది. మాయదారి డెంగీ మృత్యువుగా మారుతుందనుకోలేదు. ప్రసవానికి వారం రోజులముందే ఆమెకు జ్వరం సోకింది. అదికాస్తా డెంగీకి దారితీసింది. చికిత్స చేయించి... నిండు గర్భిణి అయిన ఆమెను ఎలాగైనా కాపాడుకోవాలని ఆ తల్లిదండ్రులు చేసిన ప్రయత్నం విఫలమైంది. విశాఖ కేజీహెచ్‌లో మగబిడ్డకు జన్మనిచ్చిన ఆమె కన్నుమూసింది. కన్నులైనా తెరవని ఆ శిశువు ఈ లోకాన్ని చూడకుండానే... తన తల్లిలేని లోకంలో తానెందుకుండాలనుకున్నాడో ఏమో... ప్రాణాలు కోల్పోయాడు. ఇదీ గరివిడి మండలం బొండపల్లి గ్రామానికి చెందిన వలిగింటి జానకి(23) విషాద గాథ. భర్త వలిగింటి జనార్దన రాజాంలో చిన్నపాటి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మూడేళ్లక్రితం వారికి వివాహం జరిగింది. జానకి ప్రస్తుతం నిండు గర్భిణి. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతుంటే రాజాంలోని ఓ డాక్టర్‌కు చూపించారు. వారు డెంగీ సోకిందని తల్లిబిడ్డను రక్షించుకోవాలంటే వెంటనే కేజీహెచ్‌కు తరలించాలని చెప్పారు. గత సోమవారమే కేజీహెచ్‌లో చేర్చారు. కానీ విధి వక్రీకరించింది. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఓ బిడ్డకు జన్మనిచ్చి ఆమె కన్నుమూయగా... పుట్టిన బిడ్డ సైతం మృత్యువాతపడింది. మృతదేహాలను సోమవారం స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. -
తల్లీ బిడ్డ మృతి
– వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న బాధితులు – అన్నివిధాలా ప్రయత్నించామంటున్న వైద్యులు పలమనేరు: డెలివరీ కోసం ఆస్పత్రికొచ్చిన ఓ మహిళ ప్రసవం జరిగాక మృతి చెందింది. నవశిశువు పరిస్థితి విషమంగా మారడంతో తిరుపతి స్విమ్స్‌కు తీసుకెళ్లగా బిడ్డ అక్కడ చనిపోయాడు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గంగవరం మండలం ఏడూరుకు చెందిన తిమ్మారెడ్డి కుమార్తె అనసూయ(22)కు అదే మండలం సామరాజుపల్లెకు చెందిన సుబ్బారెడ్డితో ఏడాదిక్రితం వివాహమైంది. అనసూయ గర్భం దాల్సి కాన్పుకోసం పుట్టింటికి వెళ్లింది. ఆదివారం రాత్రి ప్రసవనొప్పులు రావడంతో పలమనేరు ఆస్పత్రికి తరలించారు. ఆదివారం రాత్రి 9.57 గంటలకు ఆమెకు సుఖప్రసవం జరిగింది. విపరీతంగా రక్తస్రావం కావడంతో ఆమె భర్త డ్యూటీ డాక్టర్ విశ్వనాథ్‌కు సమాచారం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సూపరిండెంట్ వీణాకుమారి, పలువురు డాక్టర్లు అక్కడికి చేరుకుని ఆమెకు రక్తం ఎక్కించేందుకు ఏర్పాట్లు చేసేలోపు అనసూయ మృతిచెందింది. వైద్యులు సరైన సేవలు అందించకపోవడం వల్లే తన భార్య చనిపోయిందనీ.. చనిపోయిన తర్వాత తన భార్య శవానికే వైద్యం చేసినట్టు డాక్టర్లు డ్రామా ఆడారని ఆరోపించారు. ఇలా ఉండగా శిశువు పరిస్థితి కూడా విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో వారు వెంటనే బిడ్డను కుప్పం పీఈఎస్‌కు తీసుకెళ్లారు. అక్కడ వారు కుదర దని చెప్పడంతో తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బిడ్డ చనిపోయింది. తల్లి, బిడ్డ మృతితో ఆ కుటుంబం తీవ్రంగా విలపించింది. ఈ విషయంపై ఆస్పత్రి సూపరిండెంట్ వీణాకుమారిని వివరణ కోరగా అనసూయ డెలివరీ అయిన అరగంటేకే విపరీతమైన రక్తస్రావంతో చనిపోయిందన్నారు. ఆమె ప్రాణాలు కాపాడేందుకు తాము తీవ్రంగా కృషిచేస్తామన్నారు. అవసరమైన రక్తం తెప్పించి క్రాసింగ్ చేసేలోపే ఆమె కన్నుమూసిందని తెలిపారు. దీన్ని వైద్య భాషలో పోస్ట్‌పార్టమ్ హెమరేజ్ అంటారని ఇలాంటి కేసులు అరుదుగా సంభవిస్తాయని తెలిపారు. -
తల్లీకూతుళ్లను బలి తీసుకున్న క్వారీ
నాగులుప్పలపాడు, న్యూస్‌లైన్ : క్రిస్మస్ను పురస్కరించుకుని ఇంట్లోని దుస్తులను శుభ్రం చేసేందుకు వెళ్లిన తల్లీకూతుళ్లను క్వారీ బలి తీసుకుంది. ఈ సంఘటన మండలంలోని ఉప్పుగుండూరులో శనివారం జరిగింది. వివరాలు.. గ్రామంలోని దిన్నె మీద నివసించే కొలకలూరి వరప్రపాదరావు స్థానికంగా బజాజ్ షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. భార్య ప్రభావతి(35) ఉప్పుగుండూరులోనే అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. క్రిస్మస్ సమీపిస్తుండటంతో ఇంట్లోని దుప్పట్లు శుభ్రం చేసేందుకు చిన్న కుమార్తె సోఫియా(13)ను వెంట తీసుకొని దగ్గరలోని క్వారీకి వెళ్లింది. ఉదయం 9 గంటలకు క్వారీకి వెళ్లిన తల్లీకూతుళ్లు ఎంతకీ తిరిగి ఇంటికి రాలేదు. అంతేకాకుండా క్వారీ ఒడ్డున దుప్పట్లు తీసుకెళ్లిన గిన్నె, చెప్పులు ఉండటం గమనించిన స్థానికులు వెంటనే వరప్రసాదరావుకు సమాచారం అందించారు. ఆయన హుటాహుటిన వచ్చి క్వారీ ఒడ్డున ఉన్న దుప్పట్లు తమవేనని నిర్ధారించాడు. అనుమానం వచ్చి స్థానికులతో కలిసి గాలాలతో క్వారీలో గాలింపు చర్యలు చేపట్టగా తొలుత ప్రభావతి మృతదేహం కనిపించింది. ఆ తర్వాత కొద్ది దూరంలో సోఫియా మృతదేహాన్ని గుర్తించారు. దుస్తులు ఉతుకుతూ తొలుత కుమార్తె ప్రమాదవశాత్తు క్వారీలో పడి ఉంటుందని, రక్షించేందుకు వెళ్లి తల్లి కూడా నీటిలో మునిగి ఉంటుందని, ఎవరూ గమనించక పోవడంతో ఇద్దరూ మృతి చెంది ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. సోఫియా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. మృతురాలి పెద్ద కుమార్తె ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా కుమారుడు చీరాల కళాశాలలో పాల్టెక్నిక్ చదువుతున్నాడు. మృతదేహాలపై పడి కుటుంబ సభ్యులు రోదించిన తీరు స్థానికులకు కంటతడి పెట్టించింది. సంఘటన స్థలాన్ని ఒంగోలు రూరల్ సీఐ వి.భూషణం పరిశీలించారు. ప్రమాదం వివరాలను స్థానికులనడిగి తెలుసుకున్నారు. సీఐతో పాటు పీఎస్సై టి.త్యాగరాజు, ఎస్సై చంద్రశేఖర్ ఉన్నారు.