
సాక్షి, అమ్రాబాద్/పాలమూరు: కాన్పు విషయంలో కుటుంబ సభ్యులు చేసిన జాప్యం, సకాలంలో వైద్యులు అందుబాటులో లేకపోవడం రెండు నిండుప్రాణాలను బలితీసుకున్నాయి. పురిటినొప్పుల తో బాధపడుతూ రెండు పీహెచ్‌సీలు, రెండు ఆస్పత్రుల పరిధిలో 180 కి.మీ. దూరంపాటు ప్రయా ణించినా తల్లీబిడ్డ ప్రాణాలు దక్కలేదు. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో సోమ వారం అర్ధరాత్రి ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.
మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం వంకేశ్వరానికి చెందిన స్వర్ణ(23)కు రెండేళ్ల క్రితం అమ్రాబాద్ మండలం ఎల్మపల్లికి చెందిన చారగొండ ప్రసాద్‌తో వివాహమైంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. స్వర్ణ గర్భం దాల్చడంతో కాన్పు కోసం 2 నెలల క్రితం పుట్టింటికి వచ్చింది. సోమవారం రాత్రి 8:30 గంటల సమయంలో నొప్పులు రావడంతో ప్రైవేటు వాహనంలో ఆమెను పదర పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ కిందిస్థాయి సిబ్బందే ఉండటంతో భయపడిన కుటుంబ సభ్యులు... అమ్రాబాద్ పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ కూడా వైద్యుడు లేకపోవడంతో అచ్చంపేటకు తీసుకెళ్లారు.
అప్పటికే చాలా దూరం ప్రయాణించడంతో స్వర్ణకు ఫిట్స్ వచ్చాయి. అచ్చంపేట ఆస్పత్రి వైద్యులు నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రికి సిఫార్సు చేయడంతో అంబులెన్స్‌లో బయల్దేరారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు ప్రాథమికంగా ఇంజక్షన్లు ఇచ్చి మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేయగా సోమవారం అర్ధరాత్రి 2:30గం. సమయం లో అక్కడికి చేరుకున్నారు. చివరకు సోమవారం అర్ధరాత్రి దాటాక 3:30 గంటలకు వైద్యులు సాధారణ ప్రసవం చేశారు. కానీ ప్రసవించిన కాసేపటికే ఊపిరి తీసుకోలేక శిశువు మృతి చెందింది. అరగంట తర్వాత బాలింత కూడా మరణించింది. పదర, అమ్రాబాద్ పీహెచ్‌సీల్లో వైద్యులు అందుబాటులో ఉండి ప్రసవం చేసుంటే తమ బిడ్డ బతికేదని కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
గుండెపోటుతో మృతి చెందింది...
స్వర్ణకు బీపీ సమస్య ఉంది. ప్రసవ సమయం కంటే ముందే ఆస్పత్రిలో ఆడ్మిట్ కావాలని స్థానిక వైద్యులు సూచించినా కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం చేసి నొప్పులు మొదలయ్యాకే అమ్రాబాద్ తీసుకెళ్లారు. అప్పటికే ఆమెకు ఒకసారి ఫిట్స్ వచ్చాయి. అక్కడి నుంచి అచ్చంపేట, నాగర్‌కర్నూల్ ఆ తర్వాత మహబూబ్‌నగర్‌కు వచ్చేసారికి నాలుగుసార్లు ఫిట్స్ వచ్చాయి. మేం సాధారణ ప్రసవం చేశాక మరోసారి ఫిట్స్, ఆపై గుండెపోటు రావడంతో స్వర్ణ మృతి చెందింది.
– మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ జీవన్
చదవండి: చేర్యాల జెడ్పీటీసీ హత్య: భూముల అమ్మకాలా.. బీరప్పగుడి వ్యవహారమా?
Comments
Please login to add a commentAdd a comment