mother and child
-
తల్లిపాల వారోత్సవాలు : బాధ్యత మనందరిదీ!
నవమాసాలు మోసి బిడ్డను కనిపెంచడంలో తల్లి పాత్ర చాలా కీలకమైంది. అలాగే తల్లి పాలల్లో మహత్తర శక్తి ఉంది. పుట్టిన వెంటనే బిడ్డకు స్తన్యమివ్వడం చాలా అవసరం. దీనిపై అవగాహన కల్పించేందుకే ఆగస్టు 1 నుండి ఆగస్టు 7 వరకు 120కి పైగా దేశాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవం జరుపుకుంటారు. పిల్లల సక్రమమైన అభివృద్ధికి తల్లిపాలు చాలా అవసరం. బిడ్డకు పోషకాహారాన్ని ఇవ్వడం మాత్రమేకాదు, తల్లీబిడ్డల బాంధవ్యాన్ని పెంచుతుంది. పసివయస్సులో తీవ్రమైన వ్యాధుల బారిన పడకుండా భద్రతనిస్తుంది. మొదటి టీకాగా పనిచేస్తాయి తల్లిపాలు. 1992లో మొట్టమొదటిసారిగా ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ప్రతిపాదను ఆమోదం లభించింది.1990లో ఆగస్టులో ప్రభుత్వ అధికారులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్ , ఇతర సంస్థలచే తల్లిపాలను రక్షించడానికి, ప్రోత్సహించడానికి , మద్దతు ఇచ్చేలా ఇన్నోసెంటి డిక్లరేషన్‌పై సంతకాలు జరిగాయి. తల్లిపాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన పెంచడం, దానికి మద్దతు ఇవ్వడం , ప్రోత్సహించడంతో పాటు ప్రతిచోటా తల్లులు శిశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం దీని ప్రధాన లక్ష్యాలు.World Breastfeeding Week...1st to 7th August 2024@OfficeOfLGJandK @SyedAbidShah @DrRakesh183 pic.twitter.com/QmgPtjLWWh— DIRECTORATE OF HEALTH SERVICES JAMMU (@dhs_jammu) August 1, 2024ప్రతీ ఏడాది, ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ డేని వరల్డ్ అలయన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్ (WABA) ఎంపిక చేసిన కొత్త థీమ్‌తో జరుపుకోవడం ఆనవాయితీ. “అంతరాలు లేకుండా అందరికీ తల్లిపాల మద్దతు” (Closing the gap: Breastfeeding support for all) అనే థీమ్‌తో ఈ ఏడాది ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తల్లిపాలు ప్రాముఖ్యత , ప్రయోజనాలునవజాత శిశువులకు తల్లి పాలు బలవర్ధకమైన పోషకాహారం. అనేక రకాల సాధారణ వ్యాధులనుంచి రక్షించే రోగనిరోధక శక్తిని అందించడంలో తల్లిపాలు ముఖ్య పాత్ర వహిస్తాయి. తల్లిపాలలోని పోషకాలు, యాంటీబాడీస్,ఎంజైమ్‌లు పిల్లల్ని అనారోగ్యాలు ,ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి.తల్లి-పిల్లల బంధాన్ని బలోపేతం చేయడం, ప్రసవానంతరం బాలింతలు వేగంగా కోలుకోవడానికి, రొమ్ము, అండాశయ కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో తల్లి పాలు ఏంతో మేలు చేస్తాయి. ఒక కొత్త జీవిని ఈ సమాజంలోకి తీసుకొచ్చే ఈ ప్రయాణంలో అమ్మకు మనం అందరంఅండగా నిలబడాల్సిన అవసరం ఎంతో ఉంది. బిడ్డకు జన్మనిచ్చిన తల్లి మానసిక, శారీరక స్థితిని అర్థం చేసుకొని అటు భర్త, ఇటు ఇరు కుటుంబ సభ్యులు ఆమె తోడుగా నిలవాలి. అలాగే కమ్యూనిటీ స్థాయిలో రాష్ట్ర, జిల్లా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ఆరోగ్య సంస్థలు అధికారులు ఇందుకు మద్దతుగా నిలబడాలి. ఈ అవగాహన పెంచేందుకు,తల్లులు ఎదుర్కొంటున్ ఇబ్బందులను పరిష్కరించడానికి, ప్రపంచవ్యాప్తంగా ఈవెంట్లు, సెమినార్లు, వర్క్‌షాప్‌ల ద్వారా కృషి చేస్తారు. -
మదర్స్ డే 2024 : బీటౌన్ మామ్స్పై ఒక లుక్కేసుకోండి! (ఫోటోలు)
-
180 కిలో మీటర్లు.. 5 ఆస్పత్రులు.. సకాలంలో వైద్యం అందక తల్లీబిడ్డ మృతి
సాక్షి, అమ్రాబాద్/పాలమూరు: కాన్పు విషయంలో కుటుంబ సభ్యులు చేసిన జాప్యం, సకాలంలో వైద్యులు అందుబాటులో లేకపోవడం రెండు నిండుప్రాణాలను బలితీసుకున్నాయి. పురిటినొప్పుల తో బాధపడుతూ రెండు పీహెచ్‌సీలు, రెండు ఆస్పత్రుల పరిధిలో 180 కి.మీ. దూరంపాటు ప్రయా ణించినా తల్లీబిడ్డ ప్రాణాలు దక్కలేదు. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో సోమ వారం అర్ధరాత్రి ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం వంకేశ్వరానికి చెందిన స్వర్ణ(23)కు రెండేళ్ల క్రితం అమ్రాబాద్ మండలం ఎల్మపల్లికి చెందిన చారగొండ ప్రసాద్‌తో వివాహమైంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. స్వర్ణ గర్భం దాల్చడంతో కాన్పు కోసం 2 నెలల క్రితం పుట్టింటికి వచ్చింది. సోమవారం రాత్రి 8:30 గంటల సమయంలో నొప్పులు రావడంతో ప్రైవేటు వాహనంలో ఆమెను పదర పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ కిందిస్థాయి సిబ్బందే ఉండటంతో భయపడిన కుటుంబ సభ్యులు... అమ్రాబాద్ పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ కూడా వైద్యుడు లేకపోవడంతో అచ్చంపేటకు తీసుకెళ్లారు. అప్పటికే చాలా దూరం ప్రయాణించడంతో స్వర్ణకు ఫిట్స్ వచ్చాయి. అచ్చంపేట ఆస్పత్రి వైద్యులు నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రికి సిఫార్సు చేయడంతో అంబులెన్స్‌లో బయల్దేరారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు ప్రాథమికంగా ఇంజక్షన్లు ఇచ్చి మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేయగా సోమవారం అర్ధరాత్రి 2:30గం. సమయం లో అక్కడికి చేరుకున్నారు. చివరకు సోమవారం అర్ధరాత్రి దాటాక 3:30 గంటలకు వైద్యులు సాధారణ ప్రసవం చేశారు. కానీ ప్రసవించిన కాసేపటికే ఊపిరి తీసుకోలేక శిశువు మృతి చెందింది. అరగంట తర్వాత బాలింత కూడా మరణించింది. పదర, అమ్రాబాద్ పీహెచ్‌సీల్లో వైద్యులు అందుబాటులో ఉండి ప్రసవం చేసుంటే తమ బిడ్డ బతికేదని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. గుండెపోటుతో మృతి చెందింది... స్వర్ణకు బీపీ సమస్య ఉంది. ప్రసవ సమయం కంటే ముందే ఆస్పత్రిలో ఆడ్మిట్ కావాలని స్థానిక వైద్యులు సూచించినా కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం చేసి నొప్పులు మొదలయ్యాకే అమ్రాబాద్ తీసుకెళ్లారు. అప్పటికే ఆమెకు ఒకసారి ఫిట్స్ వచ్చాయి. అక్కడి నుంచి అచ్చంపేట, నాగర్‌కర్నూల్ ఆ తర్వాత మహబూబ్‌నగర్‌కు వచ్చేసారికి నాలుగుసార్లు ఫిట్స్ వచ్చాయి. మేం సాధారణ ప్రసవం చేశాక మరోసారి ఫిట్స్, ఆపై గుండెపోటు రావడంతో స్వర్ణ మృతి చెందింది. – మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ జీవన్ చదవండి: చేర్యాల జెడ్పీటీసీ హత్య: భూముల అమ్మకాలా.. బీరప్పగుడి వ్యవహారమా? -
టీడీపీ నేత దాష్టీకం
కుప్పం: చీటీ డబ్బులు సకాలంలో చెల్లించలేదనే కారణంతో ఏడేళ్ల బిడ్డతో సహా తల్లిని గృహనిర్బంధం చేసిన ఓ టీడీపీనేత నిర్వాకం వెలుగుచూసింది. శాంతిపురం మండలంలోని ఎం.కె.పురం పంచాయతీ కృష్ణాపురంలో మంగళవారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణాపురానికి చెందిన టీడీపీ బూత్ కమిటీ నాయకుడు ప్రకాష్ గ్రామంలో చీటీలు నడుపుతున్నాడు. అదే గ్రామానికి చెందిన పాండురంగ ఇతని వద్ద చీటీ వేసి పాడుకున్నాడు. ఇందుకు సంబంధించిన డబ్బులు సకాలంలో ఇవ్వలేదని మంగళవారం రాత్రి పాండురంగ ఇంటి వద్దకు వెళ్లిన ప్రకాష్ గొడవకు దిగాడు. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న పాండురంగ గుడిలో ఉన్నాడని భార్య భవాని (26) చెప్పినా వినిపించుకోకుండా వీధిలో నిలబడి నానా బూతులు తిట్టాడు. భవాని, తన కూతురు చిద్విలాసిని (7) వెంటనే ఇల్లు విడిచిపోవాలని హుకుం జారీ చేశాడు. ఎలాగోలా అప్పు తీర్చేస్తామని ఆమె వేడుకున్నా కనికరించకుండా తల్లీబిడ్డలు ఇంట్లో ఉండగానే ఇంటి బయట తాళం వేసుకుని వెళ్లిపోయాడు. దిక్కుతోచని స్థితిలో బాధితులు పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారం ఇచ్చారు. రాళ్లబూదుగూరు పోలీసులు తాళాలు తెరిపించి తల్లీబిడ్డలకు గృహనిర్బంధం నుంచి విముక్తి కలిగించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ మునిస్వామి తెలిపారు. -
కుమారుడు, భార్య తన కళ్లెదుటే.. ఎంత శిక్ష వేశావు దేవుడా..
అవనిగడ్డ(కృష్ణా జిల్లా): ఆ దంపతుల అన్యోన్యతను చూసి విధికి కన్ను కుట్టిందో.. లేక తల్లీబిడ్డల ప్రేమను చూసి మృత్యువు పగబట్టిందో ఏమో.. రోడ్డు ప్రమాదం తల్లీబిడ్డల జీవితాలను నిర్ధాక్షిణ్యంగా చిదిమేసింది. భార్యాబిడ్డలను దూరం చేసి ఆ యువకుడిని ఒంటరిని చేసింది. ఎంత శిక్ష వేశావు దేవుడా.. అంటూ అతను కన్నీరుమున్నీరుగా విలపించాడు. చదవండి: దొంగలను ఎదిరించిన మహిళ.. కత్తులతో పొడిచినా.. అవనిగడ్డ పంచాయతీ పరిధిలోని లంకమ్మ మాన్యం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీబిడ్డలు మృత్యువాత పడ్డారు. పోలీసుల కథనం మేరకు.. స్థానిక రెండో వార్డుకు చెందిన తోట చలమేశ్వరరావు, శ్రీవల్లి (32) దంపతులు. శ్రీవల్లి నడకుదురు సచివాలయంలో ఉద్యోగి. చలమేశ్వరరావు స్థానికంగా ఒక ప్రైవేటు స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. వారికి ఏడేళ్ల క్రితం వివాహమైంది. 14 నెలల క్రితం కుమారుడు ప్రహాస్ జన్మించాడు. రెండు నెలల క్రితం ప్రహాస్ తొలి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వ హించారు. చలమేశ్వరరావు, శ్రీవల్లి దంపతులు తమ కుమారుడు ప్రహాస్తో కలిసి బుధవారం అశ్వారావుపాలెంలోని తమ బంధువుల ఇంట జరిగే వేడుకకు బైక్‌పై బయలుదేరారు. లంకమ్మ మాన్యం మలుపు వద్ద ముందు వెళ్తున్న సెప్టిక్ ట్యాంకు ట్రాక్టర్ సైడ్ ఇవ్వడంతో చలమేశ్వరరావు ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఇంతలో డ్రైవర్ ట్రాక్టర్‌ను కుడివైపునకు తిప్పడంతో ట్రక్కు బైక్‌కు తగిలి ముగ్గురూ కింద పడిపోయారు. ప్రహాస్, శ్రీవల్లికి రోడ్డు దెబ్బలు బలంగా తగిలాయి. తీవ్రంగా గాయపడిన వారిని హుటాహు టిన అవనిగడ్డలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే ప్రహాస్ మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. శ్రీవల్లి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలిస్తుండగా మార్గంమధ్యలో మరణించింది. ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్న కుమారుడు, భార్య ఇద్దరూ తన కళ్లెదుటే మరణించడంతో చలమేశ్వరరావు విలపిస్తున్న తీరు చూపరులను కలచి వేసింది. ఈ ఘటనతో అవనిగడ్డ రెండో వార్డులో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. -
వనపర్తి జిల్లా పెబ్బేరులో విషాదం
-
వనపర్తిలో విషాదం.. బిడ్డలతో తల్లి ఆత్మహత్య
సాక్షి, మహబూబ్‌నగర్: వనపర్తి జిల్లాలోని పెబ్బేరులో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో జూరాల కాలువలో దూకింది. ఇది గమనించిన స్థానికులు ఒకరిని రక్షించగా.. తల్లి, ఇద్దరు కూతుళ్లు మృతి చెందారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
కనురెప్పకు ఏ కష్టమొచ్చిందో..!?
సాక్షి, విజయవాడ: కట్టుకున్నవాడు లేడు.. జన్మనిచ్చిన తల్లిదండ్రులు లేరు.. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు... ఇద్దరు ఆడపిల్లలు మరోవైపు.. ఎలా పెంచాలో తెలియదు.. ఏమి చేయాలో అర్థం కాదు.. దీనికి చావు ఒక్కటే పరిష్కారం అనుకుని.. కన్న తల్లే కర్కశంగా తన ఇరువురు ఆడపిల్లలకు విషమిచ్చి తాను విషం తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటనలో ఏడేళ్ల చిన్నకుమార్తె మృతిచెందగా, పెద్దకుమార్తె, తల్లి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి.. తిరువూరుకు చెందిన దైద నాగలక్ష్మి(35)కు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చండ్రుపట్లకు చెందిన తుంగా సురేష్‌తో 10ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కర్ణిక(9), కావ్య(7) కుమార్తెలు. భార్యభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకు సురేష్ చనిపోయాడు. ఈ పరిస్థితుల్లో నాగలక్ష్మి నూజివీడు మున్సిపాలిటీలోని గొడుగువారిగూడెంలో అద్దెకుంటూ ఇళ్లల్లో పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏమైందో ఏమో గాని, శుక్రవారం ఉదయం 9గంటల సమయంలో టిఫిన్ చేసిన తర్వాత ఇరువురు పిల్లలతో గుళికలు తినిపించి, తానూ తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంటి చుట్టుపక్కల వారు గమనించి ముగ్గురిని 108 లో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్న కుమార్తె కావ్య మృతిచెందింది. తల్లి నాగలక్ష్మి, పెద్దకుమార్తె కర్ణికలకు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీఐ ఎం. వెంకటనారాయణ ఏరియా ఆస్పత్రికి వచ్చి సంఘటనపై విచారించారు. ఎస్ఐ తలారి రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కనీసం మా బిడ్డల్ని అయినా కాపాడండి! బావురుమంటున్న అఫ్గన్లు వైరల్ వీడియో
కాబూల్ : అఫ్గనిస్తాన్ తాలిబన్ల వశం అయినప్పటినుంచీ బాధాకరమైన వీడియోలు, హృదయవిదారక దృశ్యాలు వెలుగు చూస్తున్నాయి. తాలిబన్లకు వ్యతిరేకంగా ఆందోళన దిగుతున్న ప్రజలు, వారిని అణచి వేసేందుకు తాలిబన్ల కాల్పుల ఘటనలకు తోడు, తాలిబన్ల చెరనుంచి తప్పించుకునేందుకు అఫ్గన్ వాసులు నరకాన్ని అనుభవిస్తున్నారు. ప్రాణాలను కాపాడుకునే క్రమంలో తనువు చాలిస్తున్నారు. దేశం విడిచిపెట్టి ఎలాగైనా ప్రాణాలను దక్కించుకోవాలన్న వారి ఆరాటానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తాజాగా తమ బిడ్డల్ని కాపాడమంటూ అఫ్గాన్ తల్లుల ఆవేదన పలువురిని కంటపడి పెట్టిస్తోంది. (Afghanistan: అశ్రఫ్ ఘనీ స్పందన, ఫేస్బుక్లో వీడియో) కాబూల్ విమానాశ్రయంలో ఒక వైపు అమెరికన్ దళాలు, మరోవైపు విమానాశ్రయం వెలుపల తాలిబన్ల దాడులుతో అఫ్గన్ పౌరులు అల్లాడిపోతున్నారు. వెళ్లిపోనివ్వండి.. గేట్లుతీయండి,లేదంటే తాలిబన్లు తమ తలను నరికి వేస్తారంటూ బుధవారం ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. ఈసందర్భంగా వేలాదిగా తరలివస్తున్న వారిని నిలువరించేందుకు తాలిబన్లు ఇనుప కంచెలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో తమ పిల్లలతోసహా సరిహద్దులను దాటే ప్రయత్నాలు చేస్తున్న తల్లులు ఇక గత్యంతరం లేక పిల్లల్ని ఎలాగైనా రక్షించుకోవాలని నిర్ణయించారు. అందుకే కనీసం తమ బిడ్డల్నైనా రక్షించమంటూ బ్రిటీష్ సైన్యం వైపునకు పిల్లల్ని విసిరేస్తున్న దృశ్యాలు కలవరం రేపుతున్నాయి. బోరుమని విలపిస్తూ కాపాడండి అంటూ బ్రిటిష్ అధికారులను వేడుకుంటున్న దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి. మరోవైపు ఈ ఘటనపై బ్రిటీష్ ఆర్మీ సీనియర్ అధికారి ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. (Afghanistan: అశ్రఫ్ ఘనీ ఎక్కడున్నారో తెలిసిపోయింది) చదవండి: Afghanistan: ఆమె భయపడినంతా అయింది! Afghanistan: తాలిబన్ల సంచలన ప్రకటన -
అమ్మా .. ఎందుకిలా చేశావ్..
అల్లవరం: ఆ తల్లికి చెప్పుకోలేని కష్టం ఏమోచ్చిందో పాపం. తొమ్మిది నెలలు కనిపెంచిన పిల్లలతో సహ తనువు చాలించాలనుకుంది. తనతో పాటు బిడ్డలకు చావే పరిష్కారం అనుకున్నదేమో అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలకు పాలలో పురుగు మందు కలిపి ఇచ్చింది. తర్వాత తానూ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన అల్లవరం మండలం ఓడలరేవులో బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఓడలరేవు గ్రామానికి చెందిన పెచ్చెట్టి సతీష్ మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం ప్రాంతానికి చెందిన మాధవిని పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి మొదటి సంతానం బాబు, రెండో సంతానంగా పాపు పుట్టారు. సతీష్ ఓడలరేవు ఓఎన్జీసీలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల కొంత కాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. వివాదాలు పడుతున్నట్లు తెలిసింది. ఈ కలహాల నేపథ్యంలో బుధవారం సాయంత్రం భర్త, అత్త, మామ ఇంటిలో లేని సమయంలో మాధవి (31), కుమారుడు పెచ్చెట్టి రోహిత్(7), పెచ్చెట్టి హరిణితో పాలలో పురుగు మందు కలిపి తాగించింది. తర్వాత ఆమె కూడా తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురినీ ఇరుగు పొరుగు వారు గుర్తించారు. వెంటనే 108 వాహనంలో అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వచ్చే సరికి హరిణి చనిపోయింది. మాధవి, రోహిత్‌లకు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తల్లి, కుమారుడు పరిస్థితి విషమంగా ఉందని కుటుంబీకులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి ఎందుకు పాల్పడ్డారో పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. చదవండి: మీ సాయం.. నిలుపుతుంది ప్రాణం ఎవరికీ అనుమానం రాదు.. ఈ దొంగ ప్రత్యేకత ఇదే.. -
ఇదో దురదృష్టకర సంఘటన...
ముంబై : మూడు గంటల అంబులెన్స్ ఆలస్యం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. సరైన సమయానికి ఆసుప్రతికి చేరుకోలేకపోవటంతో గర్భిణితోపాటు కడుపులో ఉన్న బిడ్డ కూడా మృత్యువాత పడింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. నాసిక్ జిల్లాలోని ఖొదాలా గ్రామానికి చెందిన మనీష అనే మహిళ ఏడవ నెల గర్బంతో ఉంది. ఈ నెల 17వ తేదీన ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. రక్తస్రావం అవసాగింది. ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యులు, నర్సులు రక్తస్రావాన్ని ఆపటానికి ఎంత ప్రయత్నించినా వారి వల్ల కాలేదు. దీంతో జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లటం మంచిదని కుటుంబసభ్యులకు తెలిపారు. అనంతరం అంబులెన్స్‌కు ఫోన్ చేయగా.. స్పందన లభించలేదు. ఇతర వాహనాల సదుపాయం లేకపోవటంతో వెంటనే మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రహదారి వద్దకు ఆమెను తరలించారు.( వారే జీవితంలో విజయం సాధిస్తారు: మోదీ) దాదాపు 3 గంటల నిరీక్షణ తర్వాత అంబులెన్స్ అక్కడకు చేరుకుని, గర్భిణిని నాసిక్ జిల్లా ఆసుపత్రికి తరలించింది. అయితే అప్పటికే కడుపులోని బిడ్డ చనిపోయింది. రెండు రోజుల చికిత్స తర్వాత అధిక రక్తస్రావం కారణంగా మనీష కూడా కన్నుమూసింది. ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారి దయానంద్ సూర్యవంశీ మాట్లాడుతూ.. ‘‘ఇదో దురదృష్టకర సంఘటన. ఆమె ఓ హై రిస్క్ పేషంట్. బరువు తక్కువగా ఉంది.. పైగా హైపోటెన్షివ్(లో బీపీ) కూడా. ఆసుపత్రి నుంచి వెళ్లవద్దని వైద్యులు చెప్పారు. కానీ, దీపావళి కోసం ఆమె ఇంటికి వెళ్లింది. ఆమెకు నొప్పులు మొదలైన సమయంలో అంబులెన్స్ వేరే ఊరికి వెళ్లింది. ఆ ఊరికి చేరుకోవటానికి దాదాపు 3 గంటలు పట్టింద’ని తెలిపారు. -
మూడు ప్రాణాలు బలిగొన్న ఫోన్ వివాదం
సాక్షి, మైసూరు : ఫోన్ విషయంలో ఏర్పడిన కలహాలు మూడు ప్రాణాలను బలిగొన్నాయి. ఇద్దరు పసికందులకు ఉరి బిగించిన తల్లి ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన మైసూరు గాయత్రిపురలో చోటు చేసుకుంది. ఉదయగిరి పోలీసుల కథనం మేరకు గాయత్రి పురలో ముజామిల్, సోఫియా(24) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి మునేజా(3), ఇనయ అనే ఏడాది కుమారుడు ఉన్నాడు. సోఫియా ఓ ప్రైవేటు కంపెనీలో ఇంజనీరుగా పనిచేస్తోంది. సోఫియా స్మార్ట్ ఫోన్లో ఎక్కువగా మాట్లాడేది. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. (పరువుహత్య: ప్రేమించి పరువు తీసిందని..) పిల్లలకు ఉరివేసి.. శుక్రవారం రాత్రి కూడా గొడవ పడ్డారు. మనో వేదనకు గురైన సోఫియా తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి అనంతరం తానూ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం పోలీసులు వచ్చి మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
చంటిబిడ్డతో రాత్రంతా జాగారం
-
చంటిబిడ్డతో రాత్రంతా జాగారం
వాల్మీకిపురం : ఓ యువతిని అత్తింటివారు ఇంట్లోకి రానీయలేదు. ఫలితంగా ఆమె రాత్రంతా చంటిబిడ్డతో కలిసి గుడిలో జాగారం చేసింది. తెల్లారాక మరోమారు వేడుకున్నా అత్తింటివారు కరుణించలేదు. అయినా “నా భర్త కావాలి.. నాకు న్యాయం చేయండి’ అంటూ చివరకు పోలీసులను ఆశ్రయించింది. వాల్మీకిపురం మండలంలో ఆదివారం జరిగిన హృదయ విదారక సంఘటన ఇదీ. చౌడేపల్లె మండలం చిట్టిరెడ్డిపల్లెకు చెందిన రెడ్డెప్ప కుమార్తె తేజస్విని(25)కి వాల్మీకిపురం మండలం ఓబుళంపల్లెకు చెందిన కృష్ణప్ప కుమారుడు బాలాజీ(30)తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. కొంతకాలం వారి కాపురం సజావుగా సాగింది. ఏడాదిగా రెండు కుటుంబాల మధ్య చిన్నచిన్న తగాదాలు ప్రారంభయ్యాయి. పెద్దలు జోక్యం చేసుకుని సర్దుబాటు చేశారు. కొంత కాలంగా అమ్మగారింట్లో ఉన్న తేజస్విని ఐదు నెలల చంటిబిడ్డతో శనివారం సాయంత్రం అత్తవారింటికి వెళ్లింది. అత్తింటివారు ఇంట్లోకి అనుమతించలేదు. ఇంటి ముందే ఎంతసేపు నిరీక్షించినా ఎవరూ కనికరించలేదు. చివరకు బిడ్డను ఒడిలో ఉంచుకుని ఇంటికి ఎదురుగా ఉన్న ఆలయంలోనే రాత్రంతా తలదాచుకుంది. ఆదివారం ఉదయం కూడా ఎంత బతిమాలినా అత్తింటివారు ఇంట్లోకి రానీయలేదు. చివరకు వాల్మీకిపురం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు తన భర్త కావాలని, తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. విచారణ జరిపి న్యాయం చేస్తామని సీఐ శివభాస్కర్‌రెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వరులు తెలిపారు. -
భర్త కళ్లెదుటే భార్య, కన్నబిడ్డ మృతి
పండంటి కూతురుకు జన్మనిచ్చిన భార్య, 28 రోజుల శిశువును సొంతింటికి ఆనందంగా తీసుకువెళుతున్న అతడి కళ్లెదుటే.. వారిద్దరినీ ట్రాక్టర్ ఉసురు తీసుకుంది. కట్టలు తెచ్చుకున్న దుఃఖంతో తల్లిడిల్లిపోయిన అతడిని ఎవరూ ఓదార్చలేకపోయారు. ఇంటికి అర కిలోమీటరు దూరం ఈ ఘటన సంభవించడంతో.. అతడి బంధువులు, గ్రామస్తుల ఆర్తనాదాలతో పరుగున అక్కడికి చేరుకున్నారు. రోదనలతో సంఘటన స్థలం దద్ధరిల్లింది. బాలింత, శిశువు మృతదేహాలను చూసి ఎన్ఎస్వీ నగరం ఘోల్లుమంది. తుని రూరల్: భర్త కళ్లెదుటే కట్టుకున్న భార్య, కన్నబిడ్డ మృత్యువాత పడడం ఎన్ఎస్వీ నగరం గ్రామంలో అందరినీ కలచివేసింది. మృత్యు శకటంగా దూసుకొచ్చిన ట్రాక్టర్ తల్లీబిడ్డలను పొట్టన పెట్టుకుంది. పుట్టింటి నుంచి వరసకు సోదరుడితో 28 రోజుల వయసు ఉన్న కుమార్తెతో బయలుదేరిన బాలింత.. అత్తింటి సమీపానికి చేరుకుంది. అంతలో ట్రాక్టర్ వారి ఉసురు తీసింది. ఈ హృదయ విదారక ఘటన తుని మండలం ఎన్ఎస్వీ నగరంలో సోమవారం జరిగింది. ఎన్ఎస్వీ నగరానికి చెందిన ఎంటికండ సత్తిబాబు, అతని భార్య వరలక్ష్మి (28), బిడ్డను తీసుకుని ఈ నెల 13న విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం చిడిక గ్రామంలో అత్తివారింటికి వెళ్లాడు. ఈ ముగ్గురు సోమవారం అతడి సొంత గ్రామం ఎన్ఎస్వీ నగరానికి తిరుగు ప్రయాణమయ్యారు. 28 రోజుల వయసు ఉన్న శిశువును ఒళ్లో పెట్టుకుని వరలక్ష్మి వరసకు సోదరుడైన నేతాజీతో బైక్ ఎక్కింది. మరో బైక్‌పై ఆమె భర్త వెనుక వస్తున్నాడు. 30 కిలోమీటర్లు దూరం ప్రయాణించిన వారు స్వగ్రామానికి చేరుకున్నారు. మరో అర కిలోమీటరు ప్రయాణిస్తే వారి ఇంటికి వెళ్లిపోతారు. ఆ సమయంలో కూటయ్యపాలెం నుంచి ఎన్.సూరవరం గ్రామానికి గ్రావెల్ లోడ్‌తో ట్రాక్టర్ వేగంగా వస్తోంది. ఈ ట్రాక్టర్‌ను గమనించిన నేతాజీ బైక్‌ను రోడ్డు పక్క నిలిపాడు. ట్రాక్టర్ బైక్‌ను ఢీకొట్టి పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకుపోయింది. ట్రాక్టర్ ఢీకొనడంతో నేతాజీ బైక్‌కు రోడ్డుకు ఎడమ వైపున పడి ప్రాణాలను దక్కించుకున్నాడు. శిశువుతోపాటు తల్లి కుడివైపున రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దృశ్యాన్ని కళ్లారా చూసిన అతడు భార్యా బిడ్డను పట్టుకుని కన్నీరుమున్నీరుగా విలపించడం స్థానికలను కలిచివేసింది. గ్రామంలోనే ప్రమాదం జరగడంతో పెద్ద సంఖ్యలోగ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యుల రోదనలతో ఎన్ఎస్వీ నగరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలికి మరో కుమార్తె కూడా ఉంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడని, ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై వై.గణేష్ కుమార్ తెలిపారు. -
తల్లి.. బిడ్డలు.. మధ్య కరోనా!
వారిద్దరూ కవలలు.. పైగా ఏడు నెలల పసికందులు.. అమ్మ ఒడే లోకంగా బోసి నవ్వులు చిందించా. తల్లి పరిష్వంగంలో పరవశించిపోవాలి్సన ఆ బిడ్డలు కొన్ని రోజులుగా అమ్మ స్పర్శకే నోచుకోక అల్లాడిపోతున్నారు. బిడ్డలను పొత్తిళ్లలో పొదువుకొని తన్మయం చెందాల్సిన ఆ తల్లేమో దేశం కాని దేశంలో బిడ్డల దరి చేరే మార్గం కానరాక తల్లడిల్లుతోంది. ఈ తల్లీబిడ్డల ఎడబాటుకు కారణం.. కరోనా! వీసా రెన్యూవల్ కోసం మలేషియా వెళ్లిన ఆమె.. కరోనా నియంత్రణలో భాగంగా ఆ దేశం విధించిన ట్రావెల్ బ్యాన్‌తో అక్కడే చిక్కుకుపోయి.. తనను స్వదేశం పంపించేయాలని కోరుతూ భారత ఎంబసీ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. అక్కడివారెవరూ తన గోడు వినిపించుకోకపోవడంతో ఫోన్లో ‘సాక్షి’ తన పరిస్థితిని వివరించింది. కన్నబిడ్డల కోసం పరితపిస్తున్న ఆ తల్లి విశాఖకు చెందిన సింధూష. విశాఖపట్నం: నగరంలోని శివాజీపాలెం ప్రాంతానికి చెందిన సింధూషకు, విజయ్‌చంద్రతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. విజయ్ మలేషియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. వివాహమైన తరువాత దంపతులిద్దరూ అక్కడే ఉంటున్నారు. గత ఏడాది సింధూష డెలివరీ కోసం విశాఖలో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. ఏడు నెలల క్రితం ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. ఇటీవల ఆమె వీసా గడువు దగ్గరపడింది. అదే సమయంలో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తోంది. వీసా రెన్యూవల్ చేయించుకోకపోతే భర్త దగ్గరకు వెళ్లడానికి కుదరదు. పైగా విమాన సర్వీసులకు ఎటువంటి అంతరాయం లేకపోవడంతో సింధూష ధైర్యం చేసి రెండు వారాల క్రితం మలేషియా వెళ్లింది. వీసా రెన్యూవల్ చేయించుకుంది. పని పూర్తి చేసుకొని విశాఖకు తిరుగు ప్రయాణమయ్యే సమయానికి పరిస్థితి మారిపోయింది. కరోనా వైరస్ మరింత విజృంభించడంతో మలేషియా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా ట్రావెల్ బ్యాన్ విధించి.. మలేషియా నుంచి విదేశాలకు విమాన సర్వీసులు రద్దు చేసింది. దీంతో సింధూష అక్కడే చిక్కుకుపోయింది. ఏడు నెలల పసికందులైన తన పిల్లలను చూడాలని పరితపిస్తూ అక్కడ భారత ఎంబసీ చుట్టూ తిరుగుతుంటే.. ఇక్కడ పిల్లలు తల్లి ప్రేమకు నోచుకోలేకపోతున్నారు. సింధూష కౌలాలంపూర్‌లోని ఇండియన్ హైకమిషన్ కార్యాలయానికి వెళ్లి తన పరిస్థితి వివరించినప్పటికీ.. అక్కడ ఎవరూ స్పందించకపోవడంతో ఆమె తన గోడును అక్కడ నుంచి “సాక్షి’కి వివరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తన బాధను అర్థం చేసుకొని మలేషియా నుంచి తనను విశాఖకు తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరుతోంది -
ఢిల్లీ అల్లర్లు: భవనం మీద నుంచి దూకి..
సాక్షి, న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా చేపట్టిన అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ఢిల్లీలో జరుగుతున్న ఘటనలతో ఏ క్షణం ఏ జరుగుతుందో అన్న భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. సీఏఏకు అనుకూలంగా వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనల్లో మహిళలు, చిన్నారులు తల్లడిల్లిపోతున్నారు. ఈ క్రమంలోనే ఓ మహిళ తన పిల్లల్ని కాపాడుకోవడానికి ప్రాణాల్ని సైతం లెక్కపెట్టకుండా ఎత్తయిన భవనం మీద నుంచి దూకేసింది. ఇటువంటి ఘటనలు ఢిల్లీలో అనేకం చోటుచేసుకుంటున్నాయి. చదవండి: ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ ఆందోళనకారులు విచక్షణ మరిచి ఇళ్లలోకి ప్రవేశించి బీభత్సం సృష్టిస్తున్నారు. ఢిల్లీలోని కరవాల్‌నగర్‌లో ఎన్జీఓ నడుపుతున్న ఓ మహిళ ఇంటిని ఆందోళన కారులు చుట్టుముట్టడంతో తన ఇద్దరు పిల్లల్ని కాపాడుకోవడం కోసం ఆమె మొదటి అంతస్తు పై నుంచి దూకేసింది. ఈ ప్రమాదంలో వారికి గాయాలైనా ప్రాణాలు దక్కించుకున్నారు. ఆ విధంగా ఆందోళనకారులు నుంచి తప్పించుకున్న వారు అయూబ్ అహ్మద్ అనే కిరాణాషాపు యజమాని ఇంట్లో ఆశ్రయం పొందారు. అనంతరం వారిని కష్టంమీద ఆస్పత్రిలో చేర్పించారు. చదవండి: ఢిల్లీ అల్లర్లు: మిరాకిల్ బాబు..! అయితే అయూబ్ ఇంట్లో వారు తలదాచుకున్నారన్న విషయం తెలుసుకున్న ఆందోళనకారులు ఆయన ఇంటిపై దాడి చేశారు. ఆమె అక్కడ కనిపించకపోవడంతో ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై బాధితురాలు మాట్లాడుతూ.. తన ఇంటికి దగ్గరలో ఉండే వ్యక్తిపై యాసిడ్ చల్లారని అతను తీవ్ర గాయాలపాలయ్యాడని చెప్పుకొచ్చారు. అదే క్రమంలో వారు మా ఇంటికి మీదకి దాడికి వస్తుండటంతో తన ఇద్దరు కుమార్తెలతో మొదటి అంతస్తు నుంచి దూకి ముస్లింలు నివసించే ప్రాంతానికి వచ్చి ప్రాణాలు దక్కించుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. చదవండి: ఢిల్లీ అల్లర్లు: వివాహమైన 12 రోజులకే.. -
గర్భిణులకు తోడుగా జననీ శిశు సురక్ష
సాక్షి, కర్నూలు(హాస్పిటల్): మాతాశిశు మరణాలు తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. మహిళకు కడుపులో బిడ్డ పడినప్పటి నుంచి జన్మించే వరకు, ఆ తర్వాత టీకాలు పూర్తయ్యే దాకా పలు పథకాల ద్వారా లబ్ధిచేకూరుస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మహిళ సురక్షితంగా ప్రసవం అయ్యేందుకు జననీ శిశు సురక్ష పథకాన్ని కొనసాగిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చిన మహిళ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ పథకం ద్వారా నిధులు ఖర్చు చేస్తారు. జిల్లాలో 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 20 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, ఒక జిల్లా ఆసుపత్రి, ఒక బోధనాసుపత్రి పనిచేస్తున్నాయి. దీంతో పాటు జిల్లాలో 16 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 3,486 అంగన్వాడీ కేంద్రాలు, 63 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో నమోదైన గర్భిణులను ఏఎన్ఎంలు, ఆశాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స చేయిస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందే గర్భిణిల సంఖ్య 42 వేల వరకు ఉంటోంది. జిల్లాలో ప్రతి సంవత్సరం 200కు పైగా మాతాశిశు మరణాలు జరుగుతున్నాయి. అందులో శిశు మరణాలే అధికంగా ఉంటున్నాయి. ప్రధానంగా గ్రామీణ పేద మహిళలు గర్భం దాల్చిన తర్వాత అవసరమైన పౌష్టికాహారం తీసుకోవడం లేదు. కొందరికి చిన్న వయస్సునే పెళ్లి జరుగుతుండటంతో వారు ప్రసవ సమయంలో వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో సిజేరియన్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఆర్థిక ఇబ్బందులతో పేద కుటు ంబాల్లోని గర్భిణిలు అవసరమైన ఆహారం అందడం లేదు. మందుల కొనుగోలుకూ వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభు త్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆహారం, మందులు అందిస్తోంది. వారికి వైద్యపరీక్షలూ చేయిస్తోంది. ప్రసవ సమయంలో ఖర్చు లేకుండా.. ప్రసవ సమయంలో పేద గర్భిణులకు ఎలాంటి ఖర్చు లేకుండా జననీ శిశు సురక్ష కార్యక్రమం (జేఎస్ఎస్కే) ఆదుకుంటోంది. ప్రభుత్వ ఆసుపత్రికి 108 అంబులెన్స్‌లో ఉచితంగా గర్భిణి వచ్చే అవకాశం ఉంది. ఇలా వచ్చిన గర్భిణికి ఆసుపత్రిలో జేఎస్ఎస్కే ద్వారా ఖర్చులేకుండా ప్రసవం చేసుకునే అవకాశం ఉంది. గర్భిణిలకు అవసరమైన మందులు, రక్తం, వైద్యపరీక్షలు, ఆహారం కోసం ఈ నిధుల ద్వారా ఖర్చు చేసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు జిల్లాలోని ప్రతి ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రి, బోధనాసుపత్రులకు ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయల నిధులు జారీ చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 3కోట్ల49లక్షల 11వేలను కేటాయించింది. జేఎస్ఎస్కేతో ప్రయోజనం గర్భిణులకు స్కానింగ్ కోసం ఒకసారికి రూ.200ను ఇవ్వవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్కానింగ్ యంత్రం లేకపోతే బయట చేయించుకుంటే ఈ డబ్బు చెల్లించవచ్చు. రక్త పరీక్షలకు అవసరమైతే రూ.200 ఖర్చు చేయవచ్చు. సాధారణ ప్రసవం అయిన వారికి ఆహారం కోసం మూడురోజులకు రోజుకు రూ.100 చొప్పున రూ.300. సిజేరియన్ ప్రసవం అయిన వారికి పౌష్టికాహారం కోసం ఏడు రోజులకు రోజుకు రూ.100 చొప్పున రూ.700 ఖర్చు చేయవచ్చు. సాధారణ ప్రసవం అయిన వారికి మందుల కోసం రూ.350, సిజేరియన్ అయిన వారికి రూ.1,600 ఖర్చు చేయవచ్చు. ఆసుపత్రి అభివృద్ధి సొసైటీకి ఈ నిధులను పంపిస్తారు. వీటిని మెడికల్ ఆఫీసర్ ఖాతాలో ఉంచుకుని నిబంధనల మేరకు వెచ్చించాల్సి ఉంటుంది. -
తల్లీకూతుళ్లను తగులబెట్టిన అజ్ఞాత వ్యక్తి
సాక్షి, అమలాపురం: ఇరవై రోజుల కిందట పట్టణంలో ఓ తల్లి, తన ఏడాది వయసు ఆడబిడ్డతో అదృశ్యమైంది. ఈ ఘటనపై ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పట్లో పట్టణ పోలీసు స్టేషన్లో అదృశ్యం కేసు నమోదైంది. ఇదిలా ఉండగా ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేర్లమెట్ట శివారు డొంక దారిలో ఐదు రోజుల కిందట ఓ తల్లిని, చిన్నారిని ఓ అజ్ఞాత వ్యక్తి తగులబెట్టి పరారయ్యాడు. ఈ రెండు కేసులు దాదాపు ఒకేలా ఉండడంతో అటు సంతనూతలపాడు.. ఇటు అమలాపురం పోలీసులు ఆ దిశగా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ రెండు కేసుల మధ్య ఏమైనా లింకు ఉందా అనే దిశగా రెండు జిల్లాల పోలీసులు విచారణ జరుపుతున్నారు. అదృశ్యమైన తల్లీ బిడ్డల కుటుంబ సభ్యులను విచారించారు. ఈ ఘటనపై విచారణకు ఇక్కడి పోలీసులు ప్రకాశం జిల్లా వెళ్లారు. కుటుంబ సభ్యులను కూడా ప్రకాశం జిల్లాలోని ఘటనా స్థలానికి తీసుకు వెళ్లారు. ఆ మృతదేహాల తాలూకు వస్తువులను బట్టి, హతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ జిల్లా నుంచి కూడా ఓ పోలీసు బృందం ఇక్కడకు వచ్చింది. అదృశ్యమయ్యారిలా.. మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామానికి చెందిన వైదాడి దుర్గాభవాని(25)కి ఏడాది వయసున్న ఆడబిడ్డ సమీర ఉంది. బిడ్డను తీసుకుని గత నెల 15న దుర్గాభవాని అమలాపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. కుమార్తెను చిన్నపిల్లల వైద్యుడికి చూపించి వస్తానని బయలుదేరి వచ్చింది. అలా వెళ్లిన ఆమె మళ్లీ ఇంటికి రాలేదు. వారి కోసం కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించారు. ఫలితం లేకపోవడంతో తొలుత నగరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా దుర్గాభవాని వచ్చిన అమలాపురం ఆస్పత్రి వద్ద కూడా పోలీసులు విచారణ జరిపారు. ఆస్పత్రి సీసీ కెమెరాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఆమె ఫోన్ చేయడం.. మోటారు సైకిల్‌పై ఓ యువకుడు రావడం.. అతడి బైక్‌పైనే తన బిడ్డతో ఆమె వెళ్లిపోయినట్లు రికార్డు అయింది. దీంతో కేసును అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. అప్పటి నుంచీ ఈ అదృశ్యం కేసుపై దర్యాప్తు జరుగుతోంది. పేర్లమెట్ట వద్ద ఏం జరిగిందంటే.. ఇదిలా ఉండగా ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేర్లమెట్ట శివారులో బురదతో ఉన్న డొంక దారిలో ఈ నెల మూడో తేదీ సాయంత్రం ఐదు గంటల సమయంలో ఓ మహిళ, ఏడాది వయసున్న బిడ్డ మంటల్లో తగులబడుతున్న దృశ్యాన్ని సమీపంలో ఉన్న కొందరు రైతులు చూశారు. ఆ సమాచారాన్ని గ్రామస్తులకు అందజేశారు. వారు ఫోన్ చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అప్పటికే ఆ రెండు మృతదేహాలూ దాదాపు కాలిపోయాయి. ఆ సమయంలో అటుగా వెళ్లిన కొందరిని పోలీసులు విచారించారు. అయ్యప్ప దీక్షలో ఉన్న ఇద్దరు ఇచ్చిన సమాచారంతో దర్యాప్తును వేగవంతం చేశారు. తాము ఆ బురద దారిలో వెళుతున్నప్పుడు ఓ యువకుడు, ఓ యువతి, ఓ చంటిబిడ్డతో మోటారు సైకిల్‌పై వస్తూ ఆగి çకోపంతో వాదించుకుంటున్నారని ఆ స్వాములు పోలీసులకు తెలి పారు. ‘‘ఈ బురద దారిలో గొడవేమిటి? మీరెవరు?’’ అని తాము అడగగా.. తాము భార్యాభర్తలమని, అటుగా పనుండి వెళ్తున్నామని వారు చెప్పారని స్వాములు వివరించారు. ఈ క్లూతో అక్కడి పోలీసులు ప్రకాశం జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లలో తల్లీకూతుళ్లు అదృశ్యమైన కేసులేమైనా ఉన్నాయా అని ఆరా తీశా రు. అటువంటి కేసు ట్రేస్ కాలేదు. దాంతో రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లకూ ఈ సమాచారం పంపించారు. అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్లో తల్లీ కూతురు అదృశ్యం కేసు నమోదై ఉండడం, ఈ రెండు ఘటనలకూ సారూప్యం ఉండడంతో ఇటు అమలాపురం, అటు సంతనూతలపాడు పోలీసులు ఆ దిశగా దర్యా ప్తు చేశారు. అక్కడ దొ రికిన మృత దేహాలు తమవారివి కావని దుర్గా భవా ని కుటుంబ సభ్యులు చెప్పడంతో.. వారి కోసం ఇక్కడి పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. ఆ యువకుడు ఎవరు? అమలాపురం ఆస్పత్రి సీసీ ఫుటేజీల్లో ఉన్న యువకుడెవరనే దిశగా ఇక్కడి పోలీసులు దర్యాప్తు చేశారు. దుర్గాభవానీని మోటారు సైకిల్‌పై ఎక్కించుకుని తీసుకు వెళ్లిన ఆ యువకుడిని స్థానిక వై జంక్షన్లో మోటారు సైకిళ్ల సీటు కవర్లు తయారుచేసే రమేష్‌గా గుర్తించారు. వారిద్దరి మధ్య గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్టు విచారణలో తేలింది. దుర్గాభవానీకి పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం అయోధ్యలంకకు చెందిన దగ్గరి బంధువుతో వివాహం జరిగింది. భర్త ప్రస్తుతం ఉపాధి నిమిత్తం కువైట్‌లో ఉంటున్నారు. ఇదిలా ఉండగా పేర్లమెట్ట వద్ద లభించిన మృతదేహాలు తమవారివి కావని దుర్గాభవాని కుటుంబ సభ్యులు చెప్పారని పోలీసులు అంటున్నారు. దీంతో తల్లీకూతుళ్లు ఎక్కడున్నారనేది మిస్టరీగా మారింది. కావాలని అదృశ్యమైన ఆ యువకుడు, దుర్గాభవానీలు చిన్నారి సమీరతో సహా ఎక్కడో ఓచోట కలిసే ఉండి ఉండవచ్చని పోలీసులు అంటున్నారు. -
ఇద్దరు కుమారులతో సహా తల్లి అదృశ్యం
మల్కాజిగిరి: భర్తతో గొడవపడి ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ అశోక్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.షఫీనగర్‌కు చెందిన షేక్ అహ్మద్, షేక్ సుల్తానా దంపతులకు రహ్మద్(7), అయాన్(4) కుమారులు ఉన్నారు. ఈ నెల 27న భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో సుల్తానా గాంధీనగర్‌లో ఉంటున్న తన తల్లి తహీరాబేగంకు ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో ఆమె సుల్తానా ఇంటికి వచ్చి వారిని నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా, ఆమె పట్టించుకోకుండా ఇద్ద రు కుమారులను తీసుకొని బయటికి వెళ్లిపోయింది. గాంధీనగర్‌లో ఇంటి వద్దకే వెళ్లి ఉంటుందని భావించి తహీరాబేగం ఇంటికి వచ్చి చూడగా, అక్కడ కుమార్తె కనిపించకపోవ డంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లి, కూతురు అదృశ్యం
చందానగర్: తల్లి, కూతురు అదృశ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్లో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా, షాద్‌నగర్‌కు చెందిన మానసకు శేరిలింగంపల్లి తారానగర్‌కు చెందిన రఘువీర్‌తో 2013లో వివాహం జరిగింది. వారిద్దరూ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి కూతురు వర్షిణి(3) ఉంది. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి మానస తన సోదరుడు శ్రీనివాస్‌కు ఫోన్ చేసి ‘నేను ఇంటి నుంచి వెళ్లిపోతున్నాను. నా కోసం వెతకొద్దు ..నా కూతురితో కలిసి ఎక్కడికైనా వెళ్లి బతుకుతామని చెప్పింది. మానస సోదరుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గృహిణి అదృశ్యం చిక్కడపల్లి: గృహిణి అదృశ్యమైన సంఘటన చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ సైరెడ్డి వెంకట్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బాగ్‌లింగంపల్లి నెహ్రునగర్‌కు చెందిన జ్యోతి భర్తతో గొడవపడి ఇద్దరు కుమారులతో కలిసి తల్లి వద్దే ఉంటోంది. జ్యోతి భర్త పాండు తరచూ మద్యం తాగి అక్కడికి వచ్చి భార్యతో గొడవపడేవాడు. ఈ నెల 14న అతను భార్య, అత్తతో గొడవపడ్డాడు. 15న మధ్యాహ్నం బయటికి వెళ్లిన జ్యోతి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి సరస్వతి ఆదివారం చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ సైదులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లీ కూతురు అదృశ్యం
బహదుర్‌పురా: కుమార్తెతో సహా ఓ మహిళ అదృశ్యమైన సంఘటన బహదూర్‌పురా పోలీస్ సేష్టన్ పరిధిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కిషన్‌బాగ్ నంది ముస్లాయిగూడాలో హుస్సేన్, ముజాసిం దంపతులు కుమార్తె ఆశ (3)తో కలిసి ఉంటున్నారు. ఈ నెల 8న బాషా బయటికి వెళ్లగా ముజసీం కుమార్తె ఆశను తీసుకుని బయటికి వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చిన బాషాకు భార్యా బిడ్డలు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన అతను స్థానికులను విచారించాడు. ఉదయం 11 ప్రాంతంలో ముజాసిం కుమార్తెతో సహా బయటికి వెళ్లినట్లు తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన షఫీ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. బహదూర్‌పురా పోలీసులు కేసు నమోడు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ఎంత పని చేశావు తల్లీ..
కర్నూలు, ఓర్వకల్లు: ముక్కుపచ్చలారని చిన్నారి.. అభం శుభం తెలియదు.. 18 నెలలైనా నిండనే లేదు.. ఎంతో భవిష్యత్ ఉన్న ఆ చిన్నారి.. తల్లి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయానికి బలైపోయింది.కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపానికి గురైన తల్లి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తను చనిపోతే కుమార్తెకు దిక్కెవరన్న బెంగతో ఆ చిన్నారిని కూడా తీసుకుపోవాలనుకుంది. ముందుగా కుమార్తెను హంద్రీ–నీవా కాలువలోకి విసిరేసింది. తర్వాత తనూ దూకింది. కుమార్తె చనిపోగా.. ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ విషాదకర ఘటన ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. తెలంగాణలోని అలంపూర్ మండలం ర్యాలెంపాడు గ్రామానికి చెందిన నాగజ్యోతిని ఆరేళ్ల క్రితం నన్నూరుకు చెందిన కురువ శివకుమార్కిచ్చి వివాహం చేశారు. వీరికి కుమారుడు పవన్, కుమార్తె సునీత (18 నెలలు) సంతానం. శివకుమార్ పెళ్లయిన కొంత కాలం వరకు కర్నూలులో పెయింటర్‌గా పనిచేశాడు. పిల్లలు పుట్టిన తర్వాత పెయింటింగ్ వృత్తిని మానుకున్నాడు. భార్యాభర్త ఇద్దరూ శివకుమార్ తల్లిదండ్రుల వద్దనే ఉంటూ ఊళ్లో వ్యవసాయ పనులకు వెళ్లేవారు. అయితే..అత్తమామలు, కోడలు మధ్య కొద్ది రోజుల నుంచి కుటుంబ కలహాలు మొదలయ్యాయి. శుక్రవారం ఉదయం శివకుమార్ శనగ కోత పనులకు వెళ్లాడు. నాగజ్యోతి కుమారుడు పవన్‌ను స్థానికంగా ప్రైవేట్ పాఠశాలలో వదిలిపెట్టి, కూతురును తీసుకొని ఆటోలో పుట్టింటికని బయలు దేరింది.అయితే.. నన్నూరు టోల్‌ప్లాజా సమీపంలోని హంద్రీ–నీవా బ్రిడ్జి వద్ద దిగింది. కాలువ గట్టుకు చేరుకొని మొదట కుమార్తెను కాలువలోకి విసిరింది. ఆ వెంటనే తను కూడా నీటిలోకి దూకింది. అటుగా వెళుతున్న వాహనదారులు గమనించి తల్లీ కూతురును బయటకు తీశారు. చికిత్స కోసం ఆటోలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి సునీత అప్పటికే చనిపోయింది. కాలువలో తక్కువ లోతులో నీళ్లు ఉండడంతో నాగజ్యోతి స్వల్ప గాయాలతో బయటపడింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె అత్తమామలపై కేసు నమోదు చేశారు. -
తల్లీబిడ్డ అదృశ్యం
సాక్షి, పాలకుర్తి టౌన్: తల్లీబిడ్డ అదృశ్యమైన సంఘటన మండలంలోని కొండాపురం పెద్దతండాలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... మునవత్ స్వర్ణ(20), తన బిడ్డ మంగ్లీ (9నెలలు) ఈ నెల 23న ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లారు. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వారి ఆచూకీ లభించకపోవడంతో స్వర్ణ తండ్రి అంగోత్ బాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై గండ్రాతి సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వర్ణ, మంగ్లీ ఆచూకీ తెలిసిన వారు 9440700549, 9440904658 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్సై సతీష్ కోరారు. -
తల్లీ, కూతుళ్ల ఆత్మహత్యాయత్నం
అల్వాల్: కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ సంఘటన అల్వాల్ మచ్చబొల్లారం క్రిష్ణనగర్‌లో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివారాల్లోకి వెళితే.. జీహెచ్ఎంసీ అవుట్ సోర్సింగ్ విభాగంలో వర్క్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రాజేందర్ అలియాస్ దేవరాజ్, చంద్రిక దంపతులకు కుమార్తెలు వర్ష(13) హరిణి(12) ఉన్నారు. సోమవారం సాయంత్రం చంద్రిక బెడ్రూమ్లో తన ఇద్దరు కుమార్తెలతో సహా ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మంటలను తాళలేక కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. బెడ్ రూమ్ తలుపు గడియ వేసి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా అప్పటికే హరిణి మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన చంద్రిక, వర్షలను ఓ పైవేటు ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్యకు యత్నించి ఉండవచ్చునని పోలీసులు పేర్కొన్నారు. సంఘటన స్థలాన్ని పేట్ బషీరాబాద్ ఏసీపీ అందె శ్రీనివాస్, అల్వాల్ ఇన్స్పెక్టర్ మట్టయ సందర్శించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.