ముంబై : మూడు గంటల అంబులెన్స్ ఆలస్యం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. సరైన సమయానికి ఆసుప్రతికి చేరుకోలేకపోవటంతో గర్భిణితోపాటు కడుపులో ఉన్న బిడ్డ కూడా మృత్యువాత పడింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. నాసిక్ జిల్లాలోని ఖొదాలా గ్రామానికి చెందిన మనీష అనే మహిళ ఏడవ నెల గర్బంతో ఉంది. ఈ నెల 17వ తేదీన ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. రక్తస్రావం అవసాగింది. ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యులు, నర్సులు రక్తస్రావాన్ని ఆపటానికి ఎంత ప్రయత్నించినా వారి వల్ల కాలేదు. దీంతో జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లటం మంచిదని కుటుంబసభ్యులకు తెలిపారు. అనంతరం అంబులెన్స్‌కు ఫోన్ చేయగా.. స్పందన లభించలేదు. ఇతర వాహనాల సదుపాయం లేకపోవటంతో వెంటనే మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రహదారి వద్దకు ఆమెను తరలించారు.( వారే జీవితంలో విజయం సాధిస్తారు: మోదీ)
దాదాపు 3 గంటల నిరీక్షణ తర్వాత అంబులెన్స్ అక్కడకు చేరుకుని, గర్భిణిని నాసిక్ జిల్లా ఆసుపత్రికి తరలించింది. అయితే అప్పటికే కడుపులోని బిడ్డ చనిపోయింది. రెండు రోజుల చికిత్స తర్వాత అధిక రక్తస్రావం కారణంగా మనీష కూడా కన్నుమూసింది. ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారి దయానంద్ సూర్యవంశీ మాట్లాడుతూ.. ‘‘ఇదో దురదృష్టకర సంఘటన. ఆమె ఓ హై రిస్క్ పేషంట్. బరువు తక్కువగా ఉంది.. పైగా హైపోటెన్షివ్(లో బీపీ) కూడా. ఆసుపత్రి నుంచి వెళ్లవద్దని వైద్యులు చెప్పారు. కానీ, దీపావళి కోసం ఆమె ఇంటికి వెళ్లింది. ఆమెకు నొప్పులు మొదలైన సమయంలో అంబులెన్స్ వేరే ఊరికి వెళ్లింది. ఆ ఊరికి చేరుకోవటానికి దాదాపు 3 గంటలు పట్టింద’ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment