భార్య శవాన్ని భుజాన మోసుకొని వెళ్లిన భర్త.. కొడుకు మృతదేహాన్ని చేతలపై తీసుకెళ్లిన తండ్రి.. ఇలాంటి వార్తలను అప్పుడప్పుడూ పేపర్లు,టీవీల్లో చూస్తుంటాం. ప్రైవేట్ అంబులెన్స్‌లకు డబ్బులు ఇవ్వలేక.. ప్రభుత్వ ఆస్పత్రులను అంబులెన్స్‌లను పంపించక.. కొందరు అభాగ్యులు.. భుజాలపైనా తమ అయినవారి మృతదేహలను తీసుకెళ్లిన ఘటన గతంలో పలు చోట్ల జరిగాయి.
ఈ కాలంలోనూ ఇలాంటి ఘటనలు జరగడం శోచనీయం. తాజాగా మహారాష్ట్రలో హృదయ విదారక దృశ్యాలు వెలుగుచూశాయి. గడ్చిరోలి జిల్లా అహేరి తాలూకాలో ఓ తల్లిదండ్రులు తమ ఇద్దరు కుమారుల మృతదేహాలను భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లడం పలువురిని కంటతడి పెట్టిస్తోంది. సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో తీవ్రమైన జ్వరంలో బాలురు మరణించారు. దీంతో ఆసుపత్రి నుంచి 15 కి.మీ దూరంలో ఉన్న తమ గ్రామానికి మృతదేహాలను భుజాలను మోసుకెళ్లారు.
10 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ఇద్దరు మైనర్ బాలుర మృతదేహాలపే ఓ జంట వారి భుజాలపై మోసుకెళ్తూ బురదతో కూడిన అటవీ మార్గం గుండా వెళ్తున్న వీడియోను అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టివార్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.
‘ఇద్దరు సోదరులు జ్వరంతో బాధపడుతున్నారు. అయితే వారికి సకాలంలో చికిత్స లభించలేదు. కొన్ని గంటల్లోనే వారి పరిస్థితి క్షీణించింది. గంటల వ్యవధిలో ఇద్దరు బాలురు మరణించారు. వారి మృతదేహాలను స్వగ్రామమైన పట్టిగావ్‌కు తరలించడానికి కూడా అంబులెన్స్ లేదు. తల్లిదండ్రులు వర్షంలో తడిసిన బురద మార్గం గుండా 15 కిలోమీటర్లు నడవవలసి వచ్చింది. గడ్చిరోలి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ యొక్క భయంకరమైన వాస్తవికత ఈ రోజు మళ్లీ తెరపైకి వచ్చింది.’అంటూ వాడెట్టివార్ విషాదానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.
‘గడ్చిరోలి జిల్లాకు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇంచార్జ్ మంత్రిగా ఉన్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ధర్మారావు బాబా అత్రమ్ మంత్రిగా ఉన్నారు. ఇద్దరు మంత్రులు రాష్ట్రమంతటా కార్యక్రమాలు నిర్వహిస్తూ మహారాష్ట్ర ఎలా అభివృద్ధి చెందుతుందో వాదిస్తున్నారని కాని గ్రౌండ్ లెవల్‌కి వెళ్లి గడ్చిరోలిలో ప్రజలు ఎలా జీవిస్తున్నారో, అక్కడ ఎలా మరణాలు సంభవిస్తున్నాయో తెలుసుకోవడం లేదు.’ అని మండిపడ్డారు.
అయితే విదర్భ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోవది. సెప్టెంబరు 1న ఒక గర్భిణీ గిరిజన మహిళ తన ఇంటి వద్ద చనిపోయిన బిడ్డను ప్రసవించింది. స్థానిక ఆసుపత్రికి ఆమెను సమయానికి తీసుకువెళ్లడానికి అంబులెన్స్‌ను రాకపోవడంతో నొప్పులతో తనువు చాలించింది.
Comments
Please login to add a commentAdd a comment