వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ విషయంలో మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. తన తల్లిదండ్రులు విడిపోయారని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఆమె వెల్లడించారు. అయితే ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన అధికారులు.. అది నిజం కాదని తేల్చారు.
పలు వివాదాల్లో చిక్కుకున్న ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) ట్రైనీ ఆఫీసర్ పూజా ఖేడ్కర్ తల్లిదండ్రుల వైవాహిక స్థితి గురించి తెలియజేయాలని పూణే పోలీసులను కేంద్రం ఆదేశించింది. యూపీఎస్‌సీ పరీక్షలో ఓబీసీ నాన్-క్రీమీ లేయర్‌ను పూజా వినియోగించుకుంది. ఇందుకోసం ఆమె తన తల్లిదండ్రులు విడిపోయారనే కారణాన్ని జత చేసింది. అయితే ఆమె ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్‌పై ఆరోపణలు వెల్లువెత్తిన నేపధ్యంలో ఆమె తల్లిదండ్రుల వైవాహిక స్థితిపై కేంద్రం నివేదికను కోరింది.
ఈ నేపథ్యంలో.. పూజా ఖేద్కర్ తల్లిదండ్రుల వైవాహిక స్థితికి సంబంధించి పూణె పోలీసులు తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. పూజా తల్లిదండ్రులైన దిలీప్, మనోరమా ఖేడ్కర్‌లు చట్టబద్ధంగా విడిపోయారని, అయినప్పటికీ వారిద్దరూ కలిసే ఉంటున్నారని ఆ నివేదికలో పోలీసులు పేర్కొన్నారు.
పూజా ఖేద్కర్ ఢిల్లీలోని వివిధ అకాడమీలలో తన మాక్ ఇంటర్వ్యూలలో తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారని, తాను తండ్రికి దూరంగా తన తల్లితో ఉంటున్నందున తన కుటుంబ ఆదాయం సున్నా అని ఆమె పేర్కొన్నారు. అయితే దిలీప్.. మనోరమ ఖేడ్కర్ 2009లో పూణేలోని ఫ్యామిలీ కోర్టులో పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2010, జూన్ 25న వారు విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్నప్పటికీ బన్నర్ ప్రాంతంలోని నివాసంలో కలిసే ఉంటున్నారు. కుటుంబ ఫంక్షన్‌లకు కలిసే హాజరవుతున్నారని దర్యాప్తులో వెల్లడైంది. మరోవైపు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దిలీప్ ఖేద్కర్ సమర్పించిన అఫిడవిట్‌లో మనోరమను తన భార్యగా పేర్కొనడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment