పూజా ఖేద్కర్‌ ఇంటిపై బుల్డోజర్‌ చర్య | IAS Trainee Puja Khedkar's Pune Home Faces Bulldozer Action | Sakshi
Sakshi News home page

వీడియో: వివాదాస్పద యువ ఐఏఎస్‌ పూజా ఖేద్కర్‌ ఇంటిపై బుల్డోజర్‌ చర్య

Published Wed, Jul 17 2024 5:29 PM | Last Updated on Wed, Jul 17 2024 6:13 PM

IAS Trainee Puja Khedkar's Pune Home Faces Bulldozer Action

ట్రైయినీ ఐఏఎస్‌ పూజా ఖేద్కర్‌ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. థ్రిల్లర్‌ సినిమాను మించిన ట్విస్టులు వెలుగుచూస్తున్నాయి. అధికార దుర్వినియోగం, అధికారులపై బెదిరింపులు, సివిల్స్‌ ఎంపిక విషయంలో తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించడం, వయసు వ్యత్యాసం, ఫేక్‌ అడ్రస్‌.. ఇలా ప్రతిచోటా అధికారులను మభ్యపెట్టేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

తాజాగా పూజా ఖేద్కర్‌ కుటుంబానికి చెందిన పుణెలోని నివాసంపై అధికారులు బల్డోజర్‌ చర్య పేపట్టారు. ఆమె నివాసం ఇంటికి ఆనుకొని ఉన్న అక్రమ నిర్మాణాలను పుణె మున్సిపల్‌ కార్పొరేషన్‌ బుల్డోజర్‌తో కూల్చేసింది. ఇంటి ముందున్న ఫుట్‌పాత్‌ను ఆక్రమించి చెట్లు, పూల మొక్కలు పెంచారు. దీనిపై దీనికి సంబంధించి పీఎంసీ ఇప్పటికే నోటీసులు ఇచ్చినా ఆ కుటుంబం నుంచి ఎలాంటి స్పందనా రాలేదని అధికారులు వెల్లడించారు. 

 కాగా పుణెలో అదనపు కలెక్టర్‌గా శిక్షణా విధులు నిర్వర్తిస్తున్న పూజా ఖేద్కర్‌ బ్యూరోక్రాట్‌గా తన పదవిని దుర్వినియోగం చేయడం, ఇతర డిమాండ్లతో  వివాదాస్పదమయ్యారు. ఆమె తన ప్రైవేటు ఆడీ కారుకు సైరన్‌, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్‌, వీఐపీ నంబర్‌ ప్లేట్లను అనుమతి లేకుండా వాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  ప్రొబేషన్‌లో రెండేళ్లపాటు ఉండే ఐఏఎస్‌లకు ఈ సౌకర్యాలు  ఉండవు. దీంతో ఆమెను మహారాష్ట్ర ప్రభుత్వం వాసిమ్‌కు బదిలీ చేసింది.

 

మరోవైపు ఆమె యూపీఎస్సీ అభ్యర్థిత్వంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2022 ఏప్రిల్లో తొలిసారి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు పిలువగా ఆమె కొవిడ్‌ సాకుగా చూపించి వెళ్లలేదు. ఆ తర్వాత కూడా కొన్ని నెలలపాటు తప్పించుకు వచ్చారు. చివరికి ఆరోసారి పిలవగా.. పాక్షికంగా పరీక్షలు చేయించుకున్నారు. దృష్టి లోపాన్ని అంచనావేసే కీలకమైన ఎమ్మారై పరీక్షకు ఆమె హాజరుకాలేదు. కానీ, ఆమె సివిల్‌ సర్వీసెస్‌ అపాయింట్‌మెంట్‌ ఏదోరకంగా పూర్తయింది. ఆ తర్వాత కమిషన్‌ ఆమె ఎంపికను ట్రైబ్యూనల్‌లో సవాలు చేసింది. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయినా.. తన నియామకాన్ని కన్‌ఫర్మ్‌ చేసుకుంది.

ఇక తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి పూజా ఖేడ్కర్‌ ఎంబీబీఎస్‌లో చేరినట్లు ఆరోపణలు వచ్చాయి. నాన్‌ క్రిమీలేయర్‌ ఓబీసీ ధ్రువీకరణపత్రంతో పుణెలోని ఓ మెడికల్‌ కాలేజీలో అడ్మిషన్‌ పొందారని తెలిసింది.  దాని ఆధారంగానే ఆమెకు 841వ ర్యాంక్‌ వచ్చినా ఐఏఎస్‌ హోదాను పొందగలిగింది. దీనిని మెడికల్‌ కాలేజీ  కూడా ధ్రువీకరించింది.

పూజాపై  వివాదాలు ముదరడంతో ప్రభుత్వం ఆమెపై చర్యలు మొదలుపెట్టింది.  ఆమెను శిక్షణ విధుల నుంచి రిలీవ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈనెల 23వ తేదీలోగా ముస్సోరిలోని లాల్‌బహదూర్‌ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement