ఢిల్లీ: వివాదాస్పదంగా మారిన ట్రెయినీ ఐఏఎస్ పూజా మనోరమ దిలీప్ ఖేద్కర్‌కు ఝలక్ తగిలింది. తప్పుడు ధ్రువీకరణలు సమర్పించిందని ఆమెపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఏకపక్ష సభ్య కమిటీని నియమించింది.
ఆమె ఉద్యోగంలో చేరేందుకు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమె తనకు నేత్ర, మానసిక సంబంధమైన కొన్ని సమస్యలున్నట్లు అఫిడవిట్ ఇచ్చిందని, కానీ, వాటిని నిర్ధారించేందుకు తప్పనిసరి వైద్య పరీక్షలకు మాత్రం ఆమె డుమ్మా కొట్టినట్లు కథనాలు వచ్చాయి. దీంతో.. నిజనిర్ధారణ కోసం కేంద్రం సింగిల్ మెంబర్ కమిటీని నియమించింది. ఈ కమిటీ దర్యాప్తు జరిపి.. రెండు వారాల్లో నివేదిక ఇస్తుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(DoPT) పేర్కొంది.
వివాదం ఇదే..
గొంతెమ్మ కోర్కెలతో మహారాష్ట్ర ప్రభుత్వ ఆగ్రహానికి గురైన ట్రెయినీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ వార్తల్లోకి ఎక్కింది. పుణెలో అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ.. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే తన ఆడి కారుకు రెడ్-బ్లూ బీకన్ లైట్లు, వీఐపీ నంబర్‌ప్లేటు ఏర్పాటుచేసుకున్నారు. ‘మహారాష్ట్ర ప్రభుత్వం’ అనే స్టిక్కర్ అమర్చారు. తనకు ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించాలని, తగినంత సిబ్బందితోపాటు ఓ కానిస్టేబుల్‌తో అధికారిక ఛాంబర్‌ను కేటాయించాలని పట్టుబట్టారు. అదనపు కలెక్టర్ అజయ్ మోర్ లేని సమయంలో.. ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఆయన గదిలో తన నేమ్‌ప్లేట్ పెట్టుకొని దాన్నే తన ఛాంబర్‌గా వినియోగించుకొన్నారు. వాస్తవానికి ప్రొబేషన్‌లో రెండేళ్లపాటు ఉండే జూనియర్ అధికారులకు ఈ సౌకర్యాలు లభించవు.
వాస్తవానికి ఆమె ఈ సౌకర్యాల కోసం కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి తెస్తూ జరిపిన వాట్సాప్ సంభాషణల స్క్రీన్ షాట్లు కూడా తాజాగా వైరల్ అయ్యాయి. తనకు ఉన్నతాధికారి నుంచి ఈ సిబ్బంది నంబర్ లభించినట్లు ఆమె వాటిల్లో పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆమె కొన్ని డిమాండ్లు చేసి.. తాను వచ్చే నాటికి వాటిని పూర్తిచేయాలన్నారు.
అయితే పూజ వ్యవహారాన్ని పుణె కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాసే చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆమెను పుణె నుంచి వాసిమ్ జిల్లాకు బదిలీ చేశారు. ప్రొబేషన్ కాలం పూర్తయ్యేవరకు అక్కడే సూపర్ న్యూమరరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా పూజ వ్యవహరిస్తారని ఉన్నతాధికారులు వెల్లడించారు.
నియామకమే వివాదం..
2022 ఏప్రిల్లో తొలిసారి దిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు పిలువగా ఆమె కొవిడ్ సాకుగా చూపించి వెళ్లలేదు. ఆ తర్వాత కూడా కొన్ని నెలలపాటు వైద్య పరీక్షలకు హాజరు కాలేదు. చివరికి ఆరోసారి పిలుపురాగా.. పాక్షికంగా పరీక్షలు చేయించుకొన్నారు. దృష్టి లోపాన్ని అంచనావేసే కీలకమైన ఎమ్మారై పరీక్షకు ఆమె హాజరుకాలేదు. కానీ, ఆమె సివిల్ సర్వీసెస్ అపాయింట్‌మెంట్ ఏదోరకంగా పూర్తయింది. ఆ తర్వాత కమిషన్ ఆమె ఎంపికను ట్రైబ్యూనల్‌లో సవాలు చేసింది. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయినా.. తన నియామకాన్ని కన్‌ఫర్మ్ చేసుకొంది. ఇక పూజా ఓబీసీ ధ్రువీకరణపైనా వివాదాలున్నాయి. దాని ఆధారంగానే ఆమెకు 841వ ర్యాంక్ వచ్చినా ఐఏఎస్ హోదాను పొందగలిగింది.
నాకు అనుమతి లేదు..
వివాదాల నేపథ్యంలో.. ఐఏఎస్ పూజా ఖేద్కర్ తొలిసారి మీడియా వద్ద స్పందించారు. ‘‘నాకు ఈ అంశంపై మాట్లాడటానికి ప్రభుత్వ అనుమతి లేదు. నిబంధనలు అనుమతించవు క్షమించండి. మహారాష్ట్రలోని వాసిమ్‌లో కొత్త పాత్ర పోషించడం సంతోషంగానే ఉంది’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment