ముంబై: వివాదాస్పద ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ కెరియర్ చిక్కుల్లో పడింది. అధికార దుర్వినియోగానికి పాల్పడటంతోపాటు, యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించారన్న ఆరోపణలు రావడంతో కేంద్రం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఆ ఆరోపణలు నిజమని తేలితే పూజా ఖేద్కర్‌ను సర్వీసు నుంచి తొలగించే అవకాశం ఉంది.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అదనపు కార్యదర్శి మనోజ్ ద్వివేదీ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. రెండు వారాల్లో ఆయన ఆమె వ్యవహారంపై ఓ నివేదిక ఇవ్వనున్నారు. ఒకవేళ ఆ దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేలితే పూజా ఖేద్కర్‌ను సర్వీసు నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా నిజాలు దాచిపెట్టి, తప్పుడు మార్గంలో ఉద్యోగంలో చేరినందుకు ఆమెపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవచ్చని తెలిపాయి.
మరోవైపు.. తాజాగా ఆమెపై మరో ఆరోపణ వెలుగులోకి వచ్చింది. తన విచారణలో మనోజ్ ద్వివేదీ, నవీ ముంబై పోలీసుల నుంచి ఓ నివేదిక తీసుకున్నారు. ఓ దొంగతనం కేసులో నిందితుడ్ని విడిచిపెట్టాలంటూ ఆమె పోలీసులకు హుకుం జారీ చేశారామె.
మే 18వ తేదీన నవీ ముంబై డీసీపీకి ఫోన్ చేసిన ఖేద్కర్.. తాను ఫలానా అని పరిచయం చేసుకున్నారు. ఇనుప సామాన్లు దొంగిలించిన కేసులో పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని విడుదల చేయాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. ఆ నిందితుడు అమాయకుడని, పైగా అతనిపై ఆరోపణలు తీవ్ర స్థాయివేం కాదని ఆమె ఫోన్‌లో చెప్పారు. అయినప్పటికీ ఆ పోలీసులు ఆ కాల్‌ను పట్టించుకోలేదు.
అయితే ఆ ఫోన్ కాల్ పూజా ఖేద్కర్ నుంచే వచ్చిందా? లేదంటే ఆమె పేరుతో ఎవరైనా అలా చేశారా? అనేది ద్వివేదీ కమిటీ నిర్ధారించుకోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే..
పుణేలో సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఖేద్కర్‌పై ఆరోపణలు రావడంతో ఆమెను వాసిమ్‌కు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. తన ప్రైవేటు ఆడీ కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వాడటంతో మొదలైన వివాదం.. తీగ లాగితే డొంక కదిలినట్లుగా ట్రాఫిక్ ఉల్లంఘనలు, సెటిల్మెంట్‌లు, ఇతర అధికారులపై ఒత్తిడి చేయడం ఇలా ఒక్కొక్కటీ బయటపడ్డాయి. చివరికి ఆమె యూపీఎస్సీ అభ్యర్థిత్వంపైనా అనుమానాలు రేకెత్తాయి.
తనకు కంటితో పాటు మానసిక సమస్యలు ఉన్నట్లు యూపీఎస్సీకి సమర్పించిన అఫిడవిట్‌లో ఖేద్కర్ పేర్కొన్నారు. 2022 ఏప్రిల్లో తొలిసారి దిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు పిలువగా ఆమె కొవిడ్ సాకుగా చూపించి వెళ్లలేదు. ఆ తర్వాత కూడా కొన్ని నెలలపాటు వైద్య పరీక్షలకు హాజరుకాలేదు. చివరికి ఆరోసారి పిలుపురాగా.. పాక్షికంగా పరీక్షలు చేయించుకున్నారు. దృష్టి లోపాన్ని అంచనా వేసే కీలకమైన ఎమ్మారై పరీక్షకు ఆమె హాజరు కాలేదు. కానీ, ఆమె సివిల్ సర్వీసెస్ అపాయింట్‌మెంట్ ఏదోరకంగా పూర్తయింది. ఆ తర్వాత కమిషన్ ఆమె ఎంపికను ట్రైబ్యూనల్‌లో సవాలు చేసింది. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయినా.. తన నియామకాన్ని కన్‌ఫర్మ్ చేసుకుంది.
ఇక పూజా ఓబీసీ ధ్రువీకరణ పత్రాలపైనా వివాదాలున్నాయి. దాని ఆధారంగానే ఆమెకు 841వ ర్యాంక్ వచ్చినా ఐఏఎస్ హోదాను పొందగలిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఏర్పాటుచేసిన దర్యాప్తు కమిటీ నివేదిక కీలకంగా మారింది. ఆ నివేదికను బట్టే ఖేద్కర్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment