అనుచిత వ్యాఖ్యల దుమారం.. యూట్యూబర్‌కు దక్కని ఊరట | YouTuber Ranveer Allahbadia Approached Supreme Court Check Details Here | Sakshi
Sakshi News home page

అనుచిత వ్యాఖ్యల దుమారం.. సుప్రీం కోర్టులో యూట్యూబర్‌కు దక్కని ఊరట

Published Fri, Feb 14 2025 11:45 AM | Last Updated on Fri, Feb 14 2025 12:15 PM

YouTuber Ranveer Allahbadia Approached Supreme Court Check Details Here

న్యూఢిల్లీ: ప్రముఖ యూట్యూబర్‌ రణవీర్‌ అల్హాబాదియా సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్‌ సహా తన పిటిషన్లను అత్యవసరంగా విచారించాలన్న విజ్ఞప్తిని సీజేఐ బెంచ్‌ తిరస్కరించింది. ఇండియాస్‌ గాట్‌ లాటెంట్‌ వేదికగా ఓ కంటెస్టెంట్‌ను ఉద్దేశించి రణవీర్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో అతనిపై కేసులు నమోదు అయ్యాయి. అయితే..

ఆ ఎఫ్‌ఐఆర్‌లు అన్నింటిని ఒకే దగ్గరికి చేర్చేలా ఆదేశాలివ్వాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశాడతను. అలాగే.. గువాహతి పోలీసులు ఈ వ్యవహారంలో ఇప్పటికే అతనికి సమన్లు జారీ చేశారు. దీంతో అరెస్ట్‌ చేస్తారనే భయంతో అతను ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కూడా వేశాడు. ఈ పిటిషన్లన్నీ ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వెళ్లాయి. దీంతో ఆయన విచారణకు తేదీని నిర్ణయించారు. అయితే.. 

ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించాలన్న రణవీర్‌ తరఫు లాయర్‌ విజ్ఞప్తిని సీజేఐ బెంచ్‌ తోసిపుచ్చింది. ఈ విషయంలో కోర్టు రిజిస్ట్రీని సంప్రదించాలని సూచించింది.

బీర్‌బైసెప్స్‌ యూట్యూబ్‌ ఛానెల్‌తో రణవీర్‌ అల్హాబాదియాకు మంచి ఫాలోయింగ్‌ ఉండేది. అయితే స్టాండప్‌ కమెడియన్‌ సమయ్‌ రైనా నిర్వహిస్తున్న ఇండియాస్‌ గాట్‌ లాటెంట్‌ షోలో పాల్గొన్న రణవీర్‌.. ఓ అభ్యర్థిని ఉద్దేశించి దారుణమైన కామెంట్లు చేశాడు. అతని తల్లిదండ్రుల శృంగారం గురించి ప్రస్తావించడంతో పెను దుమారం రేగింది.

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో పాటు పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, తోటి యూట్యూబర్లు సైతం రణవీర్‌ వ్యాఖ్యలపై మండిపడ్డారు. వాక్‌ స్వతంత్రం పేరిట అతను సమాజం అంగీకరించని వ్యాఖ్యలు చేశాడంటూ మండిపడ్డారు.  ఈ క్రమంలో చివరకు అతను క్షమాపణలు చెప్పాడు. అయినప్పటికీ ఈ వ్యవహారం మాత్రం చల్లారడం లేదు. 

కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నోటీసులు ఇవ్వడంతో యూట్యూబ్‌ అతని వ్యాఖ్యలు ఉన్న వీడియోను తొలగించింది. అయినప్పటికీ అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ వ్యాఖ్యల ఎఫెక్ట్‌తో.. అతనికున్న 16 మిలియన్ల ఫాలోవర్ల(అన్ని ప్లాట్‌ఫారమ్‌లు కలిపి) సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇప్పటికే అతనిపై పలు  రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. 

మరోవైపు.. ఈ వ్యవహారం పార్లమెంట్‌కు సైతం చేరింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా.. కంటెంట్‌ నియంత్రణపై ప్రభుత్వం దృష్టిసారించాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ లేఖ రాయబోతోంది. మరోవైపు సమయ్‌ రైనా, ఇండియాస్‌ గాట్‌ లాటెంట్‌ నిర్వాహకులందరి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మహారాష్ట్ర సైబర్ విభాగం ఈ షో సభ్యులపై కేసు నమోదు చేసింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన జాతీయ మహిళా కమిషన్‌.. ఈ నెల 17వ తేదీన తమ ఎదుట హాజరు కావాల్సిందిగా రణవీర్‌ అల్హాబాదియా, సమయ్‌ రైనాలకు నోటీసులు జారీ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement