న్యూఢిల్లీ: మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఆమెకు కేంద్రం షాకిచ్చింది. ఆమెను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ నుంచి తొలిగిస్తున్నట్లు ప్రకటించింది.
తక్షణమే ఆమెపై వేటు నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఐఏఎస్ రూల్స్ 1954 ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్లు అధికార ఉత్తర్వుల్లో పేర్కొంది.
కాగా పుణెలో ఐఏఎస్ ప్రొబేషనరీ సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు గత జూన్‌లో ఖేద్కర్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ట్రైనింగ్ సమయంలో అధికారిక ఐఏఎస్ నెంబర్ ప్లేట్ కలిగిన కారు, కార్యాలయం వినియోగించడంతో ఆమెపై పుణె కలెక్టర్ మహారాష్ట్ర సీఎస్‌కు లేఖ రాశారు. దీంతో ఆమెపై బదిలీ వేటు పటింది. అక్కడి నుంచి పూజా అక్రమాల చిట్టా బయటపడింది.
సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక అయ్యేందుకు ఓబీసీ, వికలాంగుల కోటాలో నకిలీ దృవీకరణ పత్రాలు సర్పించినట్లు సైతం తేలింది. అంతేగాక నిబంధనలకు మించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ... ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది.
నకిలీ పత్రాలతో పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులిచ్చింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment