పూజా ఖేద్కర్‌కు యూపీఎస్సీ షాక్‌.. అన్ని పరీక్షల నుంచి శాశ్వత డిబార్‌ | UPSC Cancels Puja Khedkar Candidature Debars Her From All Future Exams | Sakshi
Sakshi News home page

పూజా ఖేద్కర్‌కు యూపీఎస్సీ షాక్‌.. అన్ని పరీక్షల నుంచి శాశ్వత డిబార్‌

Published Wed, Jul 31 2024 4:25 PM | Last Updated on Wed, Jul 31 2024 4:59 PM

UPSC Cancels Puja Khedkar Candidature Debars Her From All Future Exams

న్యూఢిల్లీ: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేద్కర్‌ ప్రొవిజినల్‌ అభ్యర్ధిత్వాన్ని యూపీఎస్సీ కమిషన్‌ రద్దు చేసింది. అదే విధంగా భవిష్యత్తులోనూ కమిషన్‌ నిర్వహించే ఏ ఇతర పరీక్షలకు హాజరు అవ్వకుండా ఆమెపై నిషేధం విధించింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌(సీఎస్‌ఈ) నిబంధనలను ఉల్లంఘించినందుకు పూజా దోషిగా తేలినట్లు నిర్ధారించిన కమిషన్‌ ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు.

కాగా పూజా ఖేద్కర్‌కు 18 జూలైగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆమెపై వచ్చిన అవినీతి ఆరోపణలపై జూలై 25 లోపు సమాధానం చెప్పాలని కోరింది. అయితే ఆమె ఆగస్టు 4 వరకు సమయం కావాలని కోరగా.. యూపీఎస్సీ జూలై 30 వరకు డెడ్‌లైన్‌ విధించింది. ఇదే చివరి అవకాశం అని కూడా స్పష్టం చేసింది. గడువులోగా స్పందన రాకపోతే చర్యలు తీసుకునే విషయంపై కూడా యూపీఎస్సీ ఆమెకు వెల్లడించింది. ఇక నిర్ణీత సమయంలో వివరణ ఇవ్వడంతో పూజా విఫలమవ్వడంతో ఆమె ప్రొవిజినల్‌  అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తున్నట్లు కమిషన్‌ పేర్కొంది.

యూపీఎస్సీ పరీక్ష నిబంధనల్ని అతిక్రమిస్తూ అవకాశాలు వాడుకొని ఆమె నకిలీ పత్రాలతో పరీక్షను క్లియర్‌ చేసినట్లు గుర్తించామని గతంలో కమిషన్‌ పేర్కొంది. సివిల్ సర్వీసెస్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత పొందడం కోసం తప్పుడు పత్రాల సమర్పణ, అంగ వైకల్యం, మానసిక వైకల్యాల గురించి అబద్దాలు చెప్పడమే కాకుండా సాధారణ కేటగిరీలో అనుమతించిన ఆరు కంటే ఎక్కువ సార్లు పరీక్ష రాసినట్లు తెలిపింది. .తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫొటోగ్రాఫ్‌/సంతకం, ఈ-మెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబర్, చిరునామాకు సంబంధించిన పత్రాలన్నీ మార్చడం ద్వారా మోసపూరిత ప్రయత్నాలకు పాల్పడినట్లు వివరించింది. 

పుణెలో అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న పూజా ఖేద్కర్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో మహారాష్ట్ర సర్కార్‌ ఆమెను మరో చోటుకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఆమె వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తుంది. యూపీఎస్సీలో తప్పుడు పత్రాలు సమర్పించడం, మెడికల్‌ టెస్టులకు హాజరు కాకపోవడం బయటపడింది. దీంతో పూజా ఐఏఎస్‌ ఎంపికను రద్దు చేస్తూ యూపీఎస్సీ కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. 

ఖేద్కర్‌ తండ్రి ప్రభుత్వ మాజీ అధికారి దిలీప్‌ ఖేద్కర్‌పై పలు అవినీతి ఆరోపణల కేసులు నమోదయ్యాయి. ఖేద్కర్‌ తల్లి మనోరమ కూడా భూ వివాదం కేసులో రైతలను తుపాకీ‌తో బెదిరిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలోవైరల్‌ అవ్వడంతో ఆమెను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మరోవైపు ఫీసర్ పూజా ఖేద్కర్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement