పూజా ఖేద్కర్‌కు మరో షాక్‌.. అరెస్టు తప్పదా? | Delhi High Court denied pre arrest bail to ex IAS trainee officer Puja Khedkar | Sakshi
Sakshi News home page

పూజా ఖేద్కర్‌కు మరో షాక్‌.. అరెస్టు తప్పదా?

Published Mon, Dec 23 2024 3:21 PM | Last Updated on Mon, Dec 23 2024 6:43 PM

Delhi High Court denied pre arrest bail to ex IAS trainee officer Puja Khedkar

ఢిల్లీ : వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేద్కర్‌కు మరో షాక్‌ తగిలింది. అధికార దుర్వినియోగంతో పాటు, ఐఏఎస్‌కు ఎంపిక అయ్యేందుకు నకిలీ పత్రాలు సమర్పించిన కేసులో ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.    

పూజా ఖేద్కర్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ చంద్ర ధరి సింగ్‌తో కూడిన ఏక సభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా..జస్టిస్ చంద్ర ధరి సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. పూజా ఖేద్కర్‌ ఉద్దేశ పూర్వకంగానే ఐఏఎస్‌ ఎంపిక అయ్యేందుకు అధికారులను మోసగించినట్లు తాము గుర్తించాం. ఆమె కుట్ర పూరితగా చర్యలు ఐఏఎస్‌కు అనర్హులు. ఆమెపై నమోదైన ఫోర్జరీ, మోసం వంటి అభియోగాలు ‘అధికారం కోసమే కాకుండా, దేశం మొత్తాన్ని మోసం చేశారనే దానికి ఉదాహరణ నిలుస్తారు.

‘పిటిషనర్ (పూజా ఖేద్కర్‌) ప్రవర్తన పూర్తిగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను మోసం చేసే ఉద్దేశ్యంతో నకిలీ పత్రాలు సమర్పించారు.  సమాజంలోని బలహీన వర్గాలకు అందిస్తున్న పథకాల ప్రయోజనాలను పొందేందుకు భారీ ఎత్తున మోసానికి తెరతీశారు.’  

‘ప్రస్తుతం కేసు దర్యాప్తు, అందుబాటులో ఉన్న రికార్డ్‌ల ఆధారంగా పూజా ఖేద్కర్‌ వెనుకబడిన వర్గాలకు  ఉద్దేశించిన ప్రయోజనాలను పొందేందుకు అనర్హులు. దీంతో పాటు నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులతో కుమ్మక్కయ్యే అవకాశం ఉంది’. దీంతో ప్రభుత్వ అధికారులు, సంబంధిత విభాగాల్లో దర్యాప్తు చేసే అవకాశం ఉండననుంది.

వివాదాస్పద కేసులో గతంలో పూజా ఖేదర్కర్‌ను అరెస్ట్‌ చేయొద్దని ఆదేశాలిచ్చిన జస్టిస్ చంద్ర ధరి సింగ్‌తో కూడిన ఏక సభ్య ధర్మాసనం.. ఈ రోజు విచారణలో ముందస్తు బెయిల్‌ను తిరస్కరించింది. కోర్టు నిర్ణయంతో పోలీస్‌ శాఖ పూజా ఖేద్కర్‌ అరెస్ట్‌ తప్పదన్న చర్చ మొదలైంది. 

వివాదాస్పద మాజీ ట్రెయినీ IAS అధికారిణి పూజాకు ఖేద్కర్ కు షాక్

వివాదం ఇదే..
గొంతెమ్మ కోర్కెలతో మహారాష్ట్ర ప్రభుత్వ ఆగ్రహానికి గురైన ట్రెయినీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేద్కర్‌ వార్తల్లోకి ఎక్కారు.  పుణెలో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ.. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే తన ఆడి కారుకు రెడ్‌-బ్లూ బీకన్‌ లైట్లు, వీఐపీ నంబర్‌ప్లేటు ఏర్పాటు చేసుకున్నారు. ‘మహారాష్ట్ర ప్రభుత్వం’ అనే స్టిక్కర్‌ అమర్చారు. తనకు ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించాలని, తగినంత సిబ్బందితోపాటు ఓ కానిస్టేబుల్‌తో అధికారిక ఛాంబర్‌ను కేటాయించాలని పట్టుబట్టారు. అదనపు కలెక్టర్‌ అజయ్‌ మోర్‌ లేని సమయంలో.. ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఆయన గదిలో తన నేమ్‌ప్లేట్‌ పెట్టుకొని దాన్నే తన ఛాంబర్‌గా వినియోగించుకొన్నారు.  వాస్తవానికి ప్రొబేషన్‌లో రెండేళ్లపాటు ఉండే జూనియర్‌ అధికారులకు ఈ సౌకర్యాలు లభించవు.

ఆమె ఈ సౌకర్యాల కోసం కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి తెస్తూ జరిపిన వాట్సాప్‌ సంభాషణల స్క్రీన్‌ షాట్లు కూడా  వైరల్‌ అయ్యాయి. తనకు ఉన్నతాధికారి నుంచి ఈ సిబ్బంది నంబర్‌ లభించినట్లు ఆమె వాటిల్లో పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆమె కొన్ని డిమాండ్లు చేసి.. తాను వచ్చే నాటికి వాటిని పూర్తిచేయాలన్నారు.

అయితే పూజ వ్యవహారాన్ని పుణె కలెక్టర్‌ డాక్టర్‌ సుహాస్‌ దివాసే చీఫ్‌ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లడంతో తీగ లాగితే డొంక కదిలింది అన్న చందంగా యూపీఎస్సీ రాత పరీక్ష నుంచి ఆమె ట్రైనీ ఐఏఎస్‌ అధికారిగా ఎంపిక అవ్వడం వరకూ పూజా ఖేద్కర్‌ చేసిన అక్రమాలు అన్నీ వెలుగులోకి వచ్చాయి. దీంతో కేంద్రం ఆమెను ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ నుంచి తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆమెపై కోర్టులో కేసు నడుస్తోంది. 

నియామకమే వివాదం.. 
2022 ఏప్రిల్లో తొలిసారి దిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు పిలువగా ఆమె కొవిడ్‌ సాకుగా చూపించి వెళ్లలేదు. ఆ తర్వాత కూడా కొన్ని నెలలపాటు వైద్య పరీక్షలకు హాజరు కాలేదు. చివరికి ఆరోసారి పిలుపురాగా.. పాక్షికంగా పరీక్షలు చేయించుకొన్నారు. దృష్టి లోపాన్ని అంచనావేసే కీలకమైన ఎమ్మారై పరీక్షకు ఆమె హాజరుకాలేదు. కానీ, ఆమె సివిల్‌ సర్వీసెస్‌ అపాయింట్‌మెంట్‌ ఏదోరకంగా పూర్తయింది. ఆ తర్వాత కమిషన్‌ ఆమె ఎంపికను ట్రైబ్యూనల్‌లో సవాలు చేసింది. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయినా.. తన నియామకాన్ని కన్‌ఫర్మ్‌ చేసుకొంది. ఇక పూజా ఓబీసీ ధ్రువీకరణపైనా వివాదాలున్నాయి. దాని ఆధారంగానే ఆమెకు 841వ ర్యాంక్‌ వచ్చినా ఐఏఎస్‌ హోదాను పొందగలిగింది.

ఐఏఎస్‌ సర్వీస్‌ నుంచి తొలగింపు
ఇలా వరుస వివాదాల నేపథ్యంలో కేంద్రం పూజా ఖేద్కర్‌పై విచారణకు ఆదేశించింది. విచారణాలో సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపిక అయ్యేందుకు ఓబీసీ, వికలాంగుల కోటాలో నకిలీ దృవీకరణ పత్రాలు సర్పించినట్లు సైతం తేలింది. అంతేగాక నిబంధనలకు మించి సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు రాసినట్లు తెలిసింది. దీంతో  ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ..  ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్‌ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది.

నకిలీ పత్రాలతో పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్‌ నోటీసులిచ్చింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది.

ముందస్తు బెయిల్‌ తిరస్కరణ
ఈ వివాదంలో అరెస్ట్‌ కాకుండా ఉండేందుకు పూజా ఖేద్కర్‌ ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు ఇప్పటికే పలు మార్లు ఆమెకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేసింది. తాజాగా, సోమవారం సైతం ఢిల్లీ హైకోర్టు పూజా ఖేద్కర్‌కు ముందస్తు బెయిల్‌ను తిరస్కరించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement