ఢిల్లీ : తన అభ్యర్థిత్వం రద్దు చేసే హక్కు యూపీఎస్సీకి లేదని వివాదాస్పద మాజీ ఐఏఎస్ ట్రైనీ అధికారిణి పూజా ఖేద్కర్ వాదిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం తన అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేయడంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఈ తరుణంలో ఒకసారి ఎంపికై ప్రొబేషనర్‌గా నియమితులైన తర్వాత, యూపీఎస్సీ తన అభ్యర్థిత్వాన్ని అనర్హులుగా ప్రకటించే అధికారం లేదన్నారు.
ఒకవేళ చర్యలు తీసుకోవాలనుకుంటే కేవలం డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) మాత్రమే ఉందని, ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్, 1954 సీఎస్‌ఈ 2022 రూల్స్‌లోని రూల్ 19 ప్రకారం ప్రొబేషనర్ రూల్స్ ప్రకారం చర్య తీసుకోవచ్చు’అని ఖేద్కర్ పేర్కొన్నారు.
పూజా ఖేద్కర్ కేసు
ఈ ఏడాది జులైలో మహారాష్ట్ర వాసిం జిల్లా సూపర్ న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్ హోదాలో ఉన్న పూజా ఖేద్కర్ జిల్లా కలెక్టర్ స్థాయిలో తనకూ అధికారిక సదుపాయాలు, వసతులు కల్పించాలని డిమాండ్ చేయడంతో ఆమె వ్యవహార శైలి తొలిసారిగా వార్తల్లోకి ఎక్కింది. ప్రత్యేకంగా ఆఫీస్‌ను కేటాయించాలని, అధికారిక కారు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు సొంత ఖరీదైన కారుపై ఎర్ర బుగ్గను తగిలించుకుని తిరిగారు. దీంతో పుణెలో అసిస్టెంట్ కలెక్టర్ హోదా నుంచి ఆమెను వాసిమ్ జిల్లాలో సూపర్‌న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా ప్రభుత్వం బదిలీచేసింది.
ఆ తర్వాత ఆమె తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి సివిల్స్‌లో ఆమె ఆలిండియా 821వ ర్యాంక్ సాధించారని ఆరోపణలు రావడంతో యూపీఎస్సీ విచారణ చేపట్టింది. విచారణలో ఆమె తప్పుడు వైకల్య ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు తేలింది. దీంతో పూజా ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేసింది. యూపీఎస్సీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ తరుణంలో పూజా ఖేద్కర్ యూపీఎస్సీ గురించి పై విధంగా వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment