
అభిప్రాయం
రణవీర్ అలహాబాదియా కేసు ఎంత సంక్లిష్టమో సుప్రీంకోర్టు దాన్ని డీల్ చేసిన తీరు తేటతెల్లం చేస్తోంది. ఈ విచారణ... నైతిక ఆగ్రహానికీ, రాజ్యాంగ ఔచిత్యానికీ నడుమ తాడు మీద చేసిన నడకను తలపిస్తోంది. వాదప్రతివాదాలు విన్న తర్వాత యూ ట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ రణవీర్‌కు ఊరట కల్పిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్త ర్వులు జారీ చేసింది.
రణవీర్ సామాజిక మాధ్యమాల్లో ప్రముఖ వ్యక్తి. ‘ఇండియా గాట్ లేటెంట్’ అనే వెబ్ టాలెంట్ షోలో అతను చేసిన వ్యాఖ్యలపై అనేక ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు అయ్యాయి. ఆ వ్యాఖ్యలు సరదా కోసమే చేసినప్పటికీ వాటిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికింది. మీడియా సంస్థలు, రాజకీయ నేతలు గగ్గోలు పెట్టడం అగ్నికి ఆజ్యం పోసి నట్లయింది. రణవీర్ భాష ఎంత అసహ్యకరంగా ఉంది అన్నది న్యాయపరంగా ప్రధాన ప్రశ్న కాదు, అది భారతీయ చట్టాల ప్రకారం నేరపూరిత అపరాధం అవుతుందా అవ్వదా అన్నదే ముఖ్యం. ఆయన న్యాయవాది అభినవ్ చంద్రచూడ్ న్యాయస్థానంలో చేసిన ఈ వాదన ఎంతైనా సమంజసం.
వారికీ రాజ్యాంగ రక్షణ అవసరం
కానీ కోర్టు ఇలాంటి సూక్ష్మ అంశాలను పట్టించుకునే మూడ్‌లో లేదు. భాష ‘డర్టీ’గా, ‘పర్వర్టెడ్’గా ఉందంటూ విచారణ ఆసాంతం ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై తన ఏహ్యభావం వ్యక్తం చేసింది. ఒక దశలో న్యాయమూర్తి కల్పించుకుని, ‘‘ఇలాంటి భాషను మీరు సమర్థిస్తున్నారా?’’ అని చంద్రచూడ్‌ను ప్రశ్నించారు. నిజానికి డిఫెన్స్ లాయర్ పాత్ర... అత్యంత తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్ననిందితుడికి సైతం న్యాయవ్యవస్థ ద్వారా చట్టపరమైన రక్షణ లభించేట్లు చూడటమే!
సుప్రీంకోర్టు సమాజ నైతికతకు సంరక్షకురాలు కాదు. భావ ప్రకటన స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి రాజ్యాంగ హక్కులను కాపాడటమే దాని ప్రాథమిక విధి. భావప్రకటన స్వేచ్ఛను పరిరక్షించడం అంటే జనామోదం పొందిన భావప్రకటనను పరిరక్షించడం అనుకోకూడదు. అప్రియమైన, జనాదరణ లేని భావప్రకటన చేసి నప్పుడు అలాంటి వారికి రాజ్యాంగపరమైన రక్షణ అవసరం అవుతుంది.
అభినవ్ చంద్రచూడ్ ఈ విచారణ సందర్భంగా న్యాయ సూత్రాల మీదకు కోర్టు దృష్టిని మరల్చారు. అపూర్వ అరోరా వెబ్ సిరీస్ (కాలేజ్ రొమాన్స్) కేసును ఉదహరిస్తూ, అసభ్యత మాత్రమే అశ్లీలత అవ్వదన్న సుప్రీం తీర్పును ఆయన ప్రస్తావించారు. ఒకరి భావప్రకటన ఇతరుల లైంగిక వాంఛలను ప్రేరేపించడానికి ఉద్దేశించి నదా, హద్దులు దాటి నేరపూరితమైన అశ్లీలతకు అది కారణమైందా అనే అంశాల ప్రాతిపదికగా దాన్ని పరీక్షకు పెట్టాలని ఈ తీర్పు చెబుతోంది.
న్యాయస్థానం దీన్ని పట్టించుకున్నట్లు లేదు. ‘‘ఇది అశ్లీలత కాకుంటే, మరేది అశ్లీలత అవుతుంది?’’ అని ప్రశ్నించింది. కోర్టులు నైతిక శూన్యంలో పని చేయాలని అనడం లేదు. అలా అని వాటి నైతిక పరమైన ఏహ్యత... న్యాయ తర్కాన్ని కప్పివేయకూడదు. అరోరా కేసు ‘‘మీరు ఏదనుకుంటే అది మాట్లాడేందుకు లైసెన్స్ ఇచ్చిందా?’’ అని కోర్టు ప్రశ్నించడం గమనార్హం. తన వ్యక్తిగత మర్యాద భావన నుంచి వాక్ స్వాతంత్య్ర సంరక్షణను వేరు చేయడానికి కోర్టు విముఖంగా ఉన్నట్లు ఈ ప్రశ్న సంకేతాలు ఇచ్చింది.
వివాదాస్పద వ్యాఖ్యలతో కేసు ఎదుర్కొంటున్న ‘యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్’ రణవీర్ అలహాబాదియా
పితృస్వామ్య కథనం
రణవీర్‌ను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నట్లు ఆయన న్యాయవాది చంద్రచూడ్ కోర్టు దృష్టికి తీసుకురాగా, జస్టిస్ సూర్య కాంత్ చేసిన వ్యాఖ్య ప్రస్తుత హియరింగ్‌లో అత్యంత కలవరం కలిగించిన అంశం! ఈ తరహాలో చౌకబారు ప్రచారం పొందాలని మీరు ప్రయత్నించినట్లే, బెదిరింపుల ద్వరా చౌకబారు ప్రచారం సంపాదించాలని ప్రయత్నించే వారు కూడా ఉంటారు అని ఆయన వ్యాఖ్యానించారు. రణవీర్ మాటలు ఎంత అభ్యంతర కరమైనవి అన్నది పక్కనపెడితే, చంపేస్తామనే బెదిరింపులు వాటికి పర్యవ సానం కారాదు.
రణవీర్ వ్యాఖ్యలు తన తల్లిదండ్రులకు అవమానం కలిగించా యని విచారణలో కోర్టు పదేపదే ప్రస్తావించింది. భారతీయ సాంస్కృతిక నియమాలను ఈ పితృస్వామ్య నెరేటివ్ ప్రతిఫలిస్తుంది. రాజ్యాంగంలో దీనికి చోటు లేదు. న్యాయస్థానాలు నైతికతకు పున రావాస కేంద్రాలు కావు. రణవీర్ నేరం చేశాడా లేదా అన్నదానికి... అతడు తన కుటుంబాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేశాడన్నది సంబంధం లేని విషయం. సామాజిక తిరస్కారాన్ని చట్టపరమైన నేరారోపణతో ముడిపెట్టడం అనేది కోర్టులు దాటకూడని ప్రమాదకమైన రేఖ.
కోర్టు చిట్టచివరకు రణవీర్‌కు మధ్యంతర ఉపశమనం మంజూరు చేసింది. ప్రతివాదులకు నోటీసు జారీచేసి వారి సమాధానం కోరింది. ఇది సరైన నిర్ణయం. రణవీర్ వ్యాఖ్యలకు అభ్యంతరకర స్వభావం ఉన్నప్పటికీ, వాటిని నేరంగా గుర్తించడానికి అది చాలదు.
‘ఇండియా గాట్ లేటెంట్’ వెబ్ షో వివాదం, పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన ఈ కార్యక్రమ స్వభావం సందర్భపరమైన ఒక ముఖ్యమైన అంశం లేవనెత్తింది. రణవీర్ వ్యాఖ్యల క్లిప్ అసందర్భంగా లీక్ అయ్యింది. ఆ విషయం కోర్టుకూ తెలిసినట్లే ఉంది. అయినా విచారణలో ఈ ఎరుక ప్రభావం కనిపించలేదు. భావప్రకటన స్వేచ్ఛ కేసుల్లో సంద ర్భానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. మూక ప్రేరేపిత నైతిక భయాందోళనల నుంచి కోర్టులు వాక్ స్వేచ్ఛను పరిరక్షించాలి.
న్యాయస్థానాలు తమ విచారణలో ఎంత సంయమనం పాటించాల్సి ఉంటుందో గుర్తు చేసేందుకు రణవీర్ కేసు చక్కటి ఉదా హరణగా నిలుస్తుంది. న్యాయమూర్తులు కూడా మనుషులే. అందరి లానే వారికీ అసహ్యం, కోపం, అనైతికత పట్ల ఏహ్యభావం ఉంటాయి. కాని వారి వృత్తి... భావోద్వేగాలకు లోనై తీర్పులు చెప్పేది కాదు. రాగద్వేషాలకు అతీతంగా నిష్పక్షపాతంగా న్యాయాన్ని పరిరక్షించాలి. జనాభిప్రాయం వేరేలా ఉన్నప్పుడు ఈ విధి కష్టతరంగానే ఉంటుంది. కత్తి మీద సాములా వారు తమ విద్యుక్త ధర్మం నిర్వర్తించాల్సి వస్తుంది.
విచారణ జరగాల్సిన తీరు
వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించడానికి రాజ్యాంగానికి లోబడి అంతిమంగా తాను ఏం చేయాలో అదే మన సర్వోన్నత న్యాయ స్థానం చేసింది. మధ్యంతర ఉపశమనం మంజూరు చేస్తూ ఉత్తర్వు జారీ చేసింది. అయితే, ఈ క్రమంలో అది వ్యవహరించిన తీరు ప్రజలకు అస్పష్ట సంకేతాలు పంపింది. న్యాయవ్యవస్థ నిన్ను కాపాడు తుంది... కానీ ఆ పని నిన్ను అవమానానికి గురి చేసిన తర్వాతే,అసంతృప్తితోనే నీ హక్కులను గౌరవిస్తున్నట్లు నీకు స్పష్టం చేసిన తర్వాతే, నీ మీద తన నైతిక ఆధిక్యతను రుజువు చేసుకున్న తర్వాత మాత్రమే జరుగుతుందని చెప్పకనే చెప్పింది.
రాజ్యాంగబద్ధ న్యాయస్థానాలు పని చేయాల్సిన తీరు ఇది కాదు. జనామోదం కొరవడిన వారికీ, అభ్యంతకరమైన వారికీ, ఆఖరుకు పెర్వర్ట్ అయిన వారికీ ప్రజాస్వామ్యంలో భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. దాన్ని కాపాడేందుకే సుప్రీం కోర్టు ఉన్నది. అసభ్యత నుంచి సమాజాన్ని శుద్ధి చేయడం తన బాధ్యత కాదనీ, తనకు దీపస్తంభంలా నిలవాల్సింది చట్టమే కాని నైతికత కానేకాదనీ న్యాయ స్థానం గుర్తు పెట్టుకోవాలి. అలా గుర్తు పెట్టుకుంటూ ఈ కేసు విచా రణ కొనసాగిస్తుందని ఆశిద్దాం.
సంజయ్ హెగ్డే
వ్యాసకర్త సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment