ఎన్నికల సమయం రాబోతూ ఉంది. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు సోషల్ ఇన్‌ఫ్లూయర్స్‌ను సంప్రదించి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ప్రచారం పొందుతున్నారు. ‘కర్లీ టేల్స్’ యూ ట్యూబ్ చానల్‌తో విశేషంగా ఫాలోయర్స్‌ను సాధించుకున్న కామియా జని ఇటీవల రాహుల్ గాంధీ, ఆదిత్య థాకరే వంటి నేతలను కూడా ఇంటర్వ్యూ చేస్తోంది. 20 లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్న కామియా జని కేవలం ఈ ఇంటర్వ్యూల ద్వారా పేరు, పైకం సంపాదిస్తోంది.
కామియా జని ‘సండే బ్రంచ్’ పేరుతో చేసే యూ ట్యూబ్ ఇంటర్వూలు 100వ ఎపిసోడ్‌కు చేరుకున్నప్పుడు గెస్ట్‌గా సచిన్ టెండూల్కర్ వచ్చాడు. ‘శివాజీ పార్కులో చిన్నప్పుడు క్రికెట్ ఆడితే చాలా ఆకలేసేది. మూడు నాలుగు వడపావ్‌లు లాగించేసేవాణ్ణి’ అని చెప్పాడు. వెంటనే కామియా జని ‘మీ కోసం జుహూ, అంధేరి, శివాజీ పార్క్ నుంచి మూడు వడపావ్‌లు తెప్పించాను. వాటిలో ఏది శివాజీ పార్క్‌దో మీరు తిని కనిపెట్టి చెప్పాలి’ అంది. సచిన్ టెండూల్కర్ చిటికెలో కనిపెట్టాడు.
ఇలా ఇంటర్వ్యూ చేస్తే జనం చూడరూ?
‘సండే బ్రంచ్’కు విరాట్ కోహ్లీ ఒక వారం గెస్ట్. ‘అనుష్కతో పెళ్లయ్యాక మమ్మల్ని ఎవరూ గుర్తు పట్టకూడదని హనీమూన్‌కు ఫిన్లాండ్ వెళ్లాం. హాయిగా తిరుగుతున్నాం. ఒక చోట కాఫీ తాగుతూ ఉంటే ఒక సర్దార్‌జీ మమ్మల్ని గుర్తు పట్టాడు. కోహ్లీ... మా ఇంటి పేరు కూడా కోహ్లీనే అన్నాడు. పెద్దాయనా... ఇప్పుడు హడావిడి చేసి మా గుట్టు బయట పెట్టకు అని బతిమాలుకున్నాం’ అని సరదా విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు.ఇలాంటి సరదా కబుర్ల కోసం కామియా జని ఇంటర్వ్యూలు చూస్తారు.
భారత్‌జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ రాజస్థాన్‌లో ఉన్నప్పుడు ‘సండే బ్రంచ్’కు పిలిచి మరీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. కామియా జనితో ‘నాకు పాతికేళ్ల వయసు వచ్చినప్పుడు లండన్‌లో ఒక కార్పొరెట్ కంపెనీలో ఉద్యోగం చేశాను. ఆ రోజుల్లో మొదటి జీతం 2,500 పౌండ్లు అందుకున్నప్పుడు అది చాలా పెద్ద అమౌంట్ అనిపించింది’ అని గుర్తు చేసుకున్నాడు. కామియా జని యూట్యూబ్ చానల్ ‘కర్లీ టేల్స్’కు 20 లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు.
ఆమె ఇప్పటి వరకూ ప్రొడ్యూస్ చేసిన వీడియోలకు 88 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఆమె చానల్ ఇండియాలో అత్యంత పాపులర్ చానల్‌గా గుర్తింపు పొందింది. అందుకే కొత్త సినిమా రిలీజ్ అయినా, ఈవెంట్ జరుగుతున్నా సెలబ్రిటీలే ఆమెను ఇంటర్వ్యూ చేయమని కోరుతున్నారు. ఇప్పుడు ఎన్నికలు కనుక రాజకీయ నేతలు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ ఇంటర్వ్యూల వ్యూస్ కామియా జనికి భారీ ఆదాయం సంపాదించి పెడుతున్నాయి.
ఒకప్పుడు జర్నలిస్ట్
ముంబైలో ఒక సాధారణ ఆటో డ్రైవర్‌కు జన్మించిన కామియా జని మాస్ మీడియాలో డిగ్రీ చేసింది. తర్వాత ఎల్‌ఎల్‌బీ చేసి 2006లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో సబ్ ఎడిటర్‌గా పని చేసింది. ఆ తర్వాత సిఎన్‌బిసి తదితర చానల్స్‌లో పని చేసి 2016 నాటికి ఈ రోజువారీ పని బోర్ కొడుతోందని భావించి ఉద్యోగం మానేసింది. ఆమెకు ప్రయాణాలు, ఫుడ్ అంటే చాలా ఇష్టం. తన మనసుకు నచ్చిన ప్రయాణాలు చేస్తూ, నచ్చింది తింటూ వాటి మీద వీడియోలు తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తుంటే విశేషమైన ఆదరణ లభించింది.
కామియా జని జట్టు రింగులు రింగులుగా ఉంటుంది కనుక ‘కర్లీ టేల్స్’ పేరుతో యూట్యూబ్ చానల్ మొదలెట్టింది. ‘సండే బ్రంచ్’ పేరుతో సెలబ్రిటీలను బ్రంచ్‌కు పిలిచి వారికి నచ్చిన ఫుడ్ ఐటమ్స్ వడ్డిస్తూ పిచ్చాపాటి కబుర్లతో ఇంటర్వ్యూ చేయడం కామియా జని స్టయిల్. విహారం, ఆహారం అంటే అందరికీ ఇష్టం కనుక వ్యూస్ విపరీతంగా పెరిగాయి. పెరుగుతూనే ఉన్నాయి.
ఫోలోయెర్స్ ఉన్నవారే నిర్ణేతలు
ఇవాళ ఎక్కువమంది ఫాలోయెర్స్ ఉన్నవారే అభిప్రాయాలను నిర్మిస్తున్నారు. ప్రచారం చేస్తున్నారు. రాజకీయ నాయకులు ఇది కనిపెట్టారు. లక్షల మంది ఫాలోయెర్స్ ఉన్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల సాయం పొందుతున్నారు. వారు చేసే కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఇంటర్వ్యూలు ఇస్తూ తాము ప్రచారం పొందుతున్నారు. ఇటీవల్ ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్యా థాక్రే కామియా జనికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. రానున్న ఎన్నికల్లో కామియా జని లాంటి వాళ్లకు ఇంకా డిమాండ్ పెరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment