ముంబై: ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా మనోరమ దిలీప్ ఖేద్కర్ అధికార దుర్వినియోగానికి పాల్పడటంతోపాటు, యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించారనే ఆరోపణలు ఎందుర్కొంటున్నారు. ఆమెపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని కేంద్రం ఏకసభ్య కమిటీని నియమించింది. ఈ క్రమంలో ఆమెకు సంబంధించి పలు వివాదాస్పద విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు.. ఏకసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది.
తాజాగా శనివారం పూజా ఖేద్కర్‌పై వచ్చిన ఆరోపణలపై ఆమె తండ్రి దిలీప్ ఖేద్కర్ మీడియా ముందుకు వచ్చి ఖండిచారు. కొందరు ఉద్దేశపూర్వకంగా తన కూతురిని వేధింపులకు గురిచేయడానికే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఒక మహిళా అధికారిణిగా ఆఫీసులో కూర్చుకోవడానికి స్థలం ఇవ్వాలని కోరటం తప్పుకాదని తన కూతురు వ్యవహారించిన తీరును సమర్థించారు.
‘నా కూతురు ( ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్) ఎటువంటి తప్పు చేయలేదు. ఒక మహిళగా ఆఫీసులో కూర్చుకోవడానికి స్థలం ఇవ్వాలని కోరటం తప్పా?. ఈవ్యవహారంపై విచారణ జరుగుతోంది. విచారణకు సంబంధించి పూర్తి తీర్పు వెలువడేవరకు వేచిచూద్దాం. నేను మాత్ర ఒక్కటి చెప్పగలను. నా కూతురు పూజా ఖేద్కర్‌ను వేధింపులకు గురిచేయటం కోసమే ఆమెపై ఆరోపణలు చేస్తున్నారు’ అని దిలీప్ ఖేద్కర్ అన్నారు. అయితే పూజా ఖేద్కర్‌పై ఎవరు కావాలని ఆరోపణలు చేస్తున్నారన్న వారి పేర్లు మాత్రం ఆయన బయటపెట్టకపోవటం గమనార్హం.
గొంతెమ్మ కోర్కెలతో మహారాష్ట్ర ప్రభుత్వ ఆగ్రహానికి గురైన ట్రెయినీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ వార్తల్లోకి ఎక్కింది. పుణెలో అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ.. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే తన ఆడి కారుకు రెడ్-బ్లూ బీకన్ లైట్లు, వీఐపీ నంబర్‌ప్లేటు ఏర్పాటుచేసుకున్నారు. ‘మహారాష్ట్ర ప్రభుత్వం’ అనే స్టిక్కర్ అమర్చారు. తనకు ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించాలని, తగినంత సిబ్బందితోపాటు ఓ కానిస్టేబుల్‌తో అధికారిక ఛాంబర్‌ను కేటాయించాలని పట్టుబట్టారు. అదనపు కలెక్టర్ అజయ్ మోర్ లేని సమయంలో.. ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఆయన గదిలో తన నేమ్‌ప్లేట్ పెట్టుకొని దాన్నే తన ఛాంబర్‌గా వినియోగించుకొన్నారు. వాస్తవానికి ప్రొబేషన్‌లో రెండేళ్లపాటు ఉండే జూనియర్ అధికారులకు ఈ సౌకర్యాలు లభించవు.
వాస్తవానికి ఆమె ఈ సౌకర్యాల కోసం కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి తెస్తూ జరిపిన వాట్సాప్ సంభాషణల స్క్రీన్ షాట్లు కూడా తాజాగా వైరల్ అయ్యాయి. తనకు ఉన్నతాధికారి నుంచి ఈ సిబ్బంది నంబర్ లభించినట్లు ఆమె వాటిల్లో పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆమె కొన్ని డిమాండ్లు చేసి.. తాను వచ్చే నాటికి వాటిని పూర్తిచేయాలన్నారు. అయితే పూజ వ్యవహారాన్ని పుణె కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాసే చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆమెను పుణె నుంచి వాసిమ్ జిల్లాకు బదిలీ చేశారు. ప్రొబేషన్ కాలం పూర్తయ్యేవరకు అక్కడే సూపర్ న్యూమరరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా పూజ వ్యవహరిస్తారని ఉన్నతాధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment