సాక్షి, విజయవాడ: కట్టుకున్నవాడు లేడు.. జన్మనిచ్చిన తల్లిదండ్రులు లేరు.. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు... ఇద్దరు ఆడపిల్లలు మరోవైపు.. ఎలా పెంచాలో తెలియదు.. ఏమి చేయాలో అర్థం కాదు.. దీనికి చావు ఒక్కటే పరిష్కారం అనుకుని.. కన్న తల్లే కర్కశంగా తన ఇరువురు ఆడపిల్లలకు విషమిచ్చి తాను విషం తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటనలో ఏడేళ్ల చిన్నకుమార్తె మృతిచెందగా, పెద్దకుమార్తె, తల్లి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి..
తిరువూరుకు చెందిన దైద నాగలక్ష్మి(35)కు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చండ్రుపట్లకు చెందిన తుంగా సురేష్‌తో 10ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కర్ణిక(9), కావ్య(7) కుమార్తెలు. భార్యభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకు సురేష్ చనిపోయాడు. ఈ పరిస్థితుల్లో నాగలక్ష్మి నూజివీడు మున్సిపాలిటీలోని గొడుగువారిగూడెంలో అద్దెకుంటూ ఇళ్లల్లో పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏమైందో ఏమో గాని, శుక్రవారం ఉదయం 9గంటల సమయంలో టిఫిన్ చేసిన తర్వాత ఇరువురు పిల్లలతో గుళికలు తినిపించి, తానూ తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఇంటి చుట్టుపక్కల వారు గమనించి ముగ్గురిని 108 లో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్న కుమార్తె కావ్య మృతిచెందింది. తల్లి నాగలక్ష్మి, పెద్దకుమార్తె కర్ణికలకు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీఐ ఎం. వెంకటనారాయణ ఏరియా ఆస్పత్రికి వచ్చి సంఘటనపై విచారించారు. ఎస్‌ఐ తలారి రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment