ప్రాణాలు తీసుకున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త భార్య
బాధితులపైనే పోలీసులకు టీడీపీ నేతల ఫిర్యాదు
తూర్పు గోదావరి జిల్లా అనంతపల్లిలో దారుణం
నల్లజర్ల: టీడీపీ వారి సూటిపోటి మాటలు, వేధింపులు తట్టుకోలేక తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త రాము భార్య పెద్దింట్లు (50) పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త రాము, వారి కుమారుడు ప్రసాద్ సోమవారం తెలిపిన మేరకు.. ఈ కుటుంబం గ్రామంలోని గంగానమ్మ గుడి వీధిలో నివసిస్తోంది. ఆ వీధిలో వీరొక్కరే వైఎస్సార్‌సీపీకి చెందినవారు.
మిగిలిన వారంతా టీడీపీ వారే. గ్రామంలోని పద్మావతి డ్వాక్రా సంఘంలో పెద్దింట్లు సభ్యురాలు. వయస్సు పైబడిన మానికల లక్ష్మమ్మ ఆ గ్రూపు నుంచి వైదొలగడంతో ఆమె స్థానంలో కొత్త సభ్యురాలిని చేర్చుకునే విషయమై గ్రూపులోని మిగిలిన సభ్యులతో పెద్దింట్లుకు ఇటీవల వివాదం జరిగింది. దీనికితోడు పెద్దింట్లు వైఎస్సార్‌సీపీకి చెందినవారు కావడంతో గ్రూపు సభ్యులు ఆమెను వేధించసాగారు. ఎన్నికల ముందు నుంచే సూటిపోటి మాటలతో వేధిస్తున్న గ్రూపు సభ్యులు.. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓటమితో వేధింపుల్ని తీవ్రతరం చేశారు. ఇంటిపైకి వచ్చి బెదిరించసాగారు.
ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన పెద్దింట్లు గురువారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తొలుత స్థానికంగా వైద్యం చేయించిన కుటుంబసభ్యులు తరువాత ఏలూరు, అక్కడి నుంచి గుంటూరు ఆస్పత్రికి తరలించారు. గుంటూరు ప్రభుత్వాస్పపత్రిలో చికిత్స పొందుతూ పెద్దింట్లు ఆదివారం మృతిచెందింది. టీడీపీ వర్గీయులు తమను వేధించడమే కాకుండా, తిరిగి తమపై పోలీస్‌స్టేషన్‌లో తప్పుడు కేసు పెట్టారని రాము, ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దింట్లును మానసికంగా వేధించి ఆమె మృతికి కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని వారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment