ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం భార్య, కుమార్తెలతో దేవరాజ్(ఫైల్)
అల్వాల్: కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ సంఘటన అల్వాల్ మచ్చబొల్లారం క్రిష్ణనగర్‌లో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివారాల్లోకి వెళితే.. జీహెచ్‌ఎంసీ అవుట్ సోర్సింగ్ విభాగంలో వర్క్స్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న రాజేందర్ అలియాస్ దేవరాజ్, చంద్రిక దంపతులకు కుమార్తెలు వర్ష(13) హరిణి(12) ఉన్నారు. సోమవారం సాయంత్రం చంద్రిక బెడ్‌రూమ్‌లో తన ఇద్దరు కుమార్తెలతో సహా ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మంటలను తాళలేక కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు.
బెడ్ రూమ్ తలుపు గడియ వేసి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా అప్పటికే హరిణి మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన చంద్రిక, వర్షలను ఓ పైవేటు ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్యకు యత్నించి ఉండవచ్చునని పోలీసులు పేర్కొన్నారు. సంఘటన స్థలాన్ని పేట్ బషీరాబాద్ ఏసీపీ అందె శ్రీనివాస్, అల్వాల్ ఇన్‌స్పెక్టర్ మట్టయ సందర్శించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment