భార్యాబిడ్డల మృతదేహాల వద్ద బోరున విలపిస్తున్న సత్తిబాబు, కుటుంబ సభ్యులు
పండంటి కూతురుకు జన్మనిచ్చిన భార్య, 28 రోజుల శిశువును సొంతింటికి ఆనందంగా తీసుకువెళుతున్న అతడి కళ్లెదుటే.. వారిద్దరినీ ట్రాక్టర్ ఉసురు తీసుకుంది. కట్టలు తెచ్చుకున్న దుఃఖంతో తల్లిడిల్లిపోయిన అతడిని ఎవరూ ఓదార్చలేకపోయారు. ఇంటికి అర కిలోమీటరు దూరం ఈ ఘటన సంభవించడంతో.. అతడి బంధువులు, గ్రామస్తుల ఆర్తనాదాలతో పరుగున అక్కడికి చేరుకున్నారు. రోదనలతో సంఘటన స్థలం దద్ధరిల్లింది. బాలింత, శిశువు మృతదేహాలను చూసి ఎన్‌ఎస్‌వీ నగరం ఘోల్లుమంది.
తుని రూరల్: భర్త కళ్లెదుటే కట్టుకున్న భార్య, కన్నబిడ్డ మృత్యువాత పడడం ఎన్‌ఎస్‌వీ నగరం గ్రామంలో అందరినీ కలచివేసింది. మృత్యు శకటంగా దూసుకొచ్చిన ట్రాక్టర్ తల్లీబిడ్డలను పొట్టన పెట్టుకుంది. పుట్టింటి నుంచి వరసకు సోదరుడితో 28 రోజుల వయసు ఉన్న కుమార్తెతో బయలుదేరిన బాలింత.. అత్తింటి సమీపానికి చేరుకుంది. అంతలో ట్రాక్టర్ వారి ఉసురు తీసింది. ఈ హృదయ విదారక ఘటన తుని మండలం ఎన్‌ఎస్‌వీ నగరంలో సోమవారం జరిగింది. ఎన్‌ఎస్‌వీ నగరానికి చెందిన ఎంటికండ సత్తిబాబు, అతని భార్య వరలక్ష్మి (28), బిడ్డను తీసుకుని ఈ నెల 13న విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం చిడిక గ్రామంలో అత్తివారింటికి వెళ్లాడు. ఈ ముగ్గురు సోమవారం అతడి సొంత గ్రామం ఎన్‌ఎస్‌వీ నగరానికి తిరుగు ప్రయాణమయ్యారు. 28 రోజుల వయసు ఉన్న శిశువును ఒళ్లో పెట్టుకుని వరలక్ష్మి వరసకు సోదరుడైన నేతాజీతో బైక్ ఎక్కింది. మరో బైక్‌పై ఆమె భర్త వెనుక వస్తున్నాడు.
30 కిలోమీటర్లు దూరం ప్రయాణించిన వారు స్వగ్రామానికి చేరుకున్నారు. మరో అర కిలోమీటరు ప్రయాణిస్తే వారి ఇంటికి వెళ్లిపోతారు. ఆ సమయంలో కూటయ్యపాలెం నుంచి ఎన్.సూరవరం గ్రామానికి గ్రావెల్ లోడ్‌తో ట్రాక్టర్ వేగంగా వస్తోంది. ఈ ట్రాక్టర్‌ను గమనించిన నేతాజీ బైక్‌ను రోడ్డు పక్క నిలిపాడు. ట్రాక్టర్ బైక్‌ను ఢీకొట్టి పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకుపోయింది. ట్రాక్టర్ ఢీకొనడంతో నేతాజీ బైక్‌కు రోడ్డుకు ఎడమ వైపున పడి ప్రాణాలను దక్కించుకున్నాడు. శిశువుతోపాటు తల్లి కుడివైపున రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దృశ్యాన్ని కళ్లారా చూసిన అతడు భార్యా బిడ్డను పట్టుకుని కన్నీరుమున్నీరుగా విలపించడం స్థానికలను కలిచివేసింది. గ్రామంలోనే ప్రమాదం జరగడంతో పెద్ద సంఖ్యలోగ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యుల రోదనలతో ఎన్‌ఎస్‌వీ నగరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలికి మరో కుమార్తె కూడా ఉంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడని, ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై వై.గణేష్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment