
పరుగుల తల్లికి పండంటి బిడ్డ
కరీంనగర్: తొమ్మిది నెలల గర్భంతో వారం క్రితం 5 కిలోమీటర్ల దూరం పరుగెత్తి రికార్డు సృష్టించిన పరుగుల తల్లి కరీంనగర్‌కు చెందిన కామారపు లక్ష్మి సోమవారం ఆడబిడ్డకు జన్మనిచ్చారు. కరీంనగర్‌లోని ఝాన్సీలక్ష్మి ప్రసూతి ఆస్పత్రి ఇందుకు వేదికగా నిలిచింది. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని డాక్టర్ ఝాన్సీ తెలిపారు. 42 ఏళ్ల లక్ష్మికి ఇది రెండో కాన్పు.
తొలి కాన్పులో కూడా ఆమె ఇదే విధంగా రన్నింగ్ చేయడం వల్ల సాధారణ ప్రసవం జరిగింది. లక్ష్మి భర్త కామారపు రవీందర్ జాతీయస్థాయి అథ్లెట్ కావడంతో ఆయన ప్రోత్సాహంతో ఐదు కిలోమీటర్ల రన్నింగ్ సాహసాన్ని విజయవంతంగా పూర్తి చేసి రికార్డు సృష్టించింది. కాగా, గర్భిణులు వ్యాయామం చేసినప్పుడే తల్లీబిడ్డలు క్షేమంగా ఉంటారని లక్ష్మి అన్నారు.