గర్భిణులకు తోడుగా జననీ శిశు సురక్ష | JSSK Scheme Special Story In Kurnool District | Sakshi
Sakshi News home page

గర్భిణులకు తోడుగా జననీ శిశు సురక్ష

Published Wed, Dec 25 2019 10:46 AM | Last Updated on Wed, Dec 25 2019 11:11 AM

JSSK Scheme Special Story In Kurnool District - Sakshi

సాక్షి, కర్నూలు(హాస్పిటల్‌): మాతాశిశు మరణాలు తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. మహిళకు కడుపులో బిడ్డ పడినప్పటి నుంచి జన్మించే వరకు, ఆ తర్వాత టీకాలు పూర్తయ్యే దాకా పలు పథకాల ద్వారా లబ్ధిచేకూరుస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మహిళ సురక్షితంగా ప్రసవం అయ్యేందుకు జననీ శిశు సురక్ష పథకాన్ని కొనసాగిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చిన మహిళ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ పథకం ద్వారా నిధులు ఖర్చు చేస్తారు. జిల్లాలో 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, 20 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, ఒక జిల్లా ఆసుపత్రి, ఒక బోధనాసుపత్రి పనిచేస్తున్నాయి. దీంతో పాటు జిల్లాలో 16 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 3,486 అంగన్‌వాడీ కేంద్రాలు, 63 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో నమోదైన గర్భిణులను ఏఎన్‌ఎంలు, ఆశాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స చేయిస్తున్నారు.

ఈ మేరకు జిల్లాలో ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందే గర్భిణిల సంఖ్య 42 వేల వరకు ఉంటోంది. జిల్లాలో ప్రతి సంవత్సరం 200కు పైగా మాతాశిశు మరణాలు జరుగుతున్నాయి. అందులో శిశు మరణాలే అధికంగా ఉంటున్నాయి. ప్రధానంగా గ్రామీణ పేద మహిళలు గర్భం దాల్చిన తర్వాత అవసరమైన పౌష్టికాహారం తీసుకోవడం లేదు. కొందరికి చిన్న వయస్సునే పెళ్లి జరుగుతుండటంతో వారు ప్రసవ సమయంలో వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో సిజేరియన్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఆర్థిక ఇబ్బందులతో పేద కుటు ంబాల్లోని గర్భిణిలు అవసరమైన ఆహారం అందడం లేదు. మందుల కొనుగోలుకూ వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభు త్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆహారం, మందులు అందిస్తోంది. వారికి వైద్యపరీక్షలూ చేయిస్తోంది.

ప్రసవ సమయంలో ఖర్చు లేకుండా.. 
ప్రసవ సమయంలో పేద గర్భిణులకు ఎలాంటి ఖర్చు లేకుండా జననీ శిశు సురక్ష కార్యక్రమం (జేఎస్‌ఎస్‌కే) ఆదుకుంటోంది. ప్రభుత్వ ఆసుపత్రికి 108 అంబులెన్స్‌లో ఉచితంగా గర్భిణి వచ్చే అవకాశం ఉంది. ఇలా వచ్చిన గర్భిణికి ఆసుపత్రిలో జేఎస్‌ఎస్‌కే ద్వారా ఖర్చులేకుండా ప్రసవం చేసుకునే అవకాశం ఉంది. గర్భిణిలకు అవసరమైన మందులు, రక్తం, వైద్యపరీక్షలు, ఆహారం కోసం ఈ నిధుల ద్వారా ఖర్చు చేసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు జిల్లాలోని ప్రతి ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రి, బోధనాసుపత్రులకు ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయల నిధులు జారీ చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 3కోట్ల49లక్షల 11వేలను కేటాయించింది.  

జేఎస్‌ఎస్‌కేతో ప్రయోజనం 

  • గర్భిణులకు స్కానింగ్‌ కోసం ఒకసారికి రూ.200ను ఇవ్వవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్కానింగ్‌ యంత్రం లేకపోతే బయట చేయించుకుంటే ఈ డబ్బు చెల్లించవచ్చు.   
  • రక్త పరీక్షలకు అవసరమైతే రూ.200 ఖర్చు చేయవచ్చు.  
  • సాధారణ ప్రసవం అయిన వారికి ఆహారం కోసం మూడురోజులకు రోజుకు రూ.100 చొప్పున రూ.300. 
  • సిజేరియన్‌ ప్రసవం అయిన వారికి పౌష్టికాహారం కోసం ఏడు రోజులకు రోజుకు రూ.100 చొప్పున రూ.700 ఖర్చు చేయవచ్చు.  
  • సాధారణ ప్రసవం అయిన వారికి మందుల కోసం రూ.350, సిజేరియన్‌ అయిన వారికి రూ.1,600 ఖర్చు చేయవచ్చు.  
  • ఆసుపత్రి అభివృద్ధి సొసైటీకి ఈ నిధులను పంపిస్తారు. వీటిని మెడికల్‌ ఆఫీసర్‌ ఖాతాలో ఉంచుకుని నిబంధనల మేరకు వెచ్చించాల్సి ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement