లక్ష్యం చేరని సురక్ష
- సక్రమంగా అమలు కాని జేఎస్ఎస్కే, జేఎస్వై
- జిల్లాలో మిగిలిపోతున్న రెండు పథకాల నిధులు
- పేద గర్భిణులకు అవగాహన కల్పించని అధికారులు
- ప్రభుత్వాస్పత్రుల్లో అరకొరగా గైనకాలజిస్టులు
రామచంద్రపురం : జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా నిరుపేదలైన తల్లీబిడ్డల సంక్షేమం కోసం కేంద్రం ప్రవేశపెట్టిన జననీ శిశు సురక్ష కార్యక్రమాన్ని (జేఎస్ఎస్కే) జిల్లాలో అమలు చేయటంలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో సురక్షిత ప్రసవానికి అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్న అవగాహనను పేదగర్భిణులకు కల్పించలేకపోవడంతో వారు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
పేద మహిళలకు ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలందించి తల్లీబిడ్డలకు మంచి ఆరోగ్యం ఇవ్వాలనేది జేఎస్ఎస్కే లక్ష్యం. ఈ పథకం కింద గర్భిణులు ఆస్పత్రుల్లో చేరేందుకు అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తారు. శస్త్రచికిత్స, రక్త పరీక్షలు, రక్తం ఎక్కించాల్సి వస్తే ఆ ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది. శిశువుకు అవసరమైన మందులన్నింటినీ ఉచితంగానే ఇచ్చి, బాలింతను ఆస్పత్రి నుంచి ఇంటికి సురక్షితంగా పంపిస్తారు. ఈ పథకానికి నిధులను ప్రభుత్వం సకాలంలో విడుదల చేస్తోంది. జిల్లాలో 11 ప్రభుత్వాస్పత్రులతో పాటు 24 గంటలూ పనిచేసే 33 పీహెచ్సీలలో ఈ పథకం అమలులో ఉంది. రాజమండ్రి జిల్లా ఆస్పత్రి, అమలాపురం, రామచంద్రపురం, తుని, రాజోలు, కొత్తపేట, రంపచోడవరం, పెద్దాపురం, ప్రత్తిపాడు, వై.రామవరం, అనపర్తి ఏరియా ఆస్పత్రులకు గత ఏడాది ఈ పథకం కింద రూ.6.76 కోట్లు విడుదల చేయగా రూ.4.30 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.
డబ్బులు గుంజుతున్న సిబ్బంది
జేఎస్ఎస్కే సక్రమంగా అమలు జరగాలంటే ప్రభుత్వాస్పత్రుల్లో గైనకాలజిస్టులు ఉండి తీరాలి. కాకినాడ జీజీహెచ్ మినహా 250 పడకలున్న రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో ఆరుగురు గైనకాలజిస్టులుండాలి. కానీ ప్రస్తుతం ఇద్దరే ఉన్నారు. 100 పడకల రామచంద్రపురం, అమలాపురం, తుని ఏరియా ఆసుపత్రుల్లో నలుగురు చొప్పున ఉండాల్సి ఉండగా ఇద్దరు లేక ఒక్కొక్కరు మాత్రమే ఉన్నారు. పెద్దాపురం, కొత్తపేట ఏరియా ఆస్పత్రుల్లో ఒక్కొక్కరే ఉండగా ప్రత్తిపాడు, వై.రామవరం, రంపచోడవరం, అనపర్తి ఏరియా ఆస్పత్రుల్లో అసలు గైనకాలజిస్టులే లేరు.
జేఎస్ఎస్కే ద్వారా ప్రభుత్వాస్పత్రికి ప్రైవేటు డాక్టర ్లను తీసుకువచ్చి సిజేరియన్ చేయించే అవకాశముంది. శస్త్రచికిత్స చేసిన వైద్యునికి రూ.1200 నుంచి రూ.1700, మత్తు వైద్యునికి రూ.1000 నుంచి రూ.1500 వరకు ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే దీన్ని అవకాశంగా మలచుకుని ప్రభుత్వాస్పత్రిలో సిజేరియన్ చేయించుకున్న పేద గర్భిణుల నుంచి సిబ్బంది రూ.2500 నుంచి రూ.3 వేల వరకు గుంజుతున్నారనే ఆరోపణలున్నాయి.
నిబంధనలే ప్రతిబంధకం..
పేద మహిళల కోసం కేంద్రమే అమలు చేస్తున్న జననీ సురక్ష యోజన (జేఎస్వై) కూడా ఆశించిన ప్రయోజానానికి ఎడంగానే ఉంది. ఈ పథకం కింద ప్రభుత్వాస్పత్రుల్లో పురుడు పోసుకున్న పేద మహిళలకు ఖర్చులుగా గ్రామీణులకు రూ.800, పట్టణవాసులకు రూ.600 చెల్లిస్తారు. 2013 ఏప్రిల్ నుంచి 2014 మార్చి వరకు ఈ పథకం కింద రూ.కోటీ 53 లక్షలు విడుదల కాగా కేవలం రూ.44 లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. పేదమహిళలకు అవగాహన లేకపోవటం, అర్థం లేని నిబంధనలు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల కూడా పేదమహిళలకు దక్కాల్సిన సాయం దూరమవుతోంది. గర్భిణుల్లో పేదలకు సురక్షితమైన వైద్యంతో పాటు ఒకింత ఆర్థిక ఊతం కూడా అందించే ఈ పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి.