ఆరంభ శూరత్వంగా ‘ఆర్‌ఎఫ్‌ఐడీ’ | RFID system failure in GGH | Sakshi
Sakshi News home page

ఆరంభ శూరత్వంగా ‘ఆర్‌ఎఫ్‌ఐడీ’

Published Thu, Oct 6 2016 5:49 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM

పసిబిడ్డకు  ట్యాగ్‌ అమరుస్తున్న  మంత్రులు కామినేని, కొల్లు, ప్రత్తిపాటి (ఫైల్‌)

పసిబిడ్డకు ట్యాగ్‌ అమరుస్తున్న మంత్రులు కామినేని, కొల్లు, ప్రత్తిపాటి (ఫైల్‌)

జీజీహెచ్‌లో పని చేయని ‘ట్యాగింగ్‌’ వ్యవస్థ
‘ఆర్‌ఎఫ్‌ఐడీ’తో తల్లికి, పసి బిడ్డలకు రక్షణ కవచాలు 
 
జీజీహెచ్‌లో ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు ఆరంభ శూరత్వంగా మారింది. రాష్ట్ర మంత్రులు అట్టహాసంగా ప్రారంభించిన ఈ ప్రక్రియ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. హైటెక్‌ ముఖ్యమంత్రిగా గొప్పలు చెప్పుకునే చంద్రబాబు టెక్నాలజీతో కూడిన కార్యక్రమాలు  ఆగిపోతున్నా వాటిపై దృష్టి సారించడం లేదు. 
 
గుంటూరు మెడికల్‌: ప్రభుత్వ ఆస్పత్రుల్లో తరచుగా పసికందులు అదృశ్యమైన ఘటనలు చోటు చేసుకుంటుండటంతో ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం పిల్లల అపహరణను నియంత్రించేందుకు గుంటూరు జీజీహెచ్‌లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ఎఫ్‌ఐడీ) ట్యాగింగ్‌ సిస్టమ్‌ను మొదటిసారిగా 2016 జూలై 16న గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో ప్రారంభించింది. 
 
ఆస్పత్రిలో నాలుగు చోట్ల ఏర్పాటు...
పసికందులు పుట్టిన వెంటనే తల్లికి, బిడ్డకు (ఒకే నంబర్‌ ఉన్న) ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌ను అమరుస్తారు. ఈ వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. తల్లీబిడ్డకు మధ్య 10 మీటర్ల దూరం దాటితే వెంటనే పెద్దగా శబ్ధం వస్తుంది. వేరేవారు పిల్లలను పట్టుకుంటే వెంటనే దొరికిపోతారు. ప్రధాన ద్వారాల వద్ద, వార్డుల్లో సైరన్‌ శబ్ధం వినిపించే సరికి సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమవుతారు. ఈ ట్యాగ్‌లను సెన్సార్లు మోనిటర్‌ చేస్తుంటాయి. ఆస్పత్రిలోని లేబర్‌ రూమ్, ఎస్‌ఎన్‌సీయూ, పిల్లల వైద్య విభాగం, గైనకాలజీ వైద్య విభాగ వార్డుల్లో ఈ సెన్సార్‌లు ఏర్పాటు చేశారు. గుజరాత్‌కు చెందిన ఓడోహబ్‌ డాట్‌ కామ్‌ సంస్థ ఈ నూతన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. 
 
రూ.12 లక్షల ఖర్చుతో...
జీజీహెచ్‌లో ఈ వ్యవస్థ ఏర్పాటుకు సుమారు రూ.12 లక్షల వరకు ఖర్చయ్యింది. ముందస్తు ఒప్పందంతోనే సెక్యూరిటీ కాంట్రాక్ట్‌ సంస్థౖయెన జేబీ సెక్యూరిటీ నిర్వాహకులు ఈ ఖర్చును భరించారు. ఆన్‌లైన్‌లో వివరాల నమోదుకు రిసెప్షనిస్ట్‌ కమ్‌ ఆపరేటర్‌ను కూడా నియమించారు. ట్యాగ్‌లు ఏర్పాటు చేసేందుకు జతకు రూ.50 ఖర్చవుతుందని, అహ్మదాబాద్‌ నుంచి ట్యాగ్‌లను తెప్పిస్తున్నామని ఆసుపత్రి అధికారులు తెలిపారు.
 
ప్రారంభానికే పరిమితం..
అయితే, అట్టహాసంగా ప్రారంభమైన ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగింగ్‌ విధానం ఆరంభ శూరత్వంగా మిగిలింది. ప్రారంభానికే పరిమితమై ఆచరణలోకి రాలేదు. అయితే, కాంట్రాక్టర్లు ట్యాగ్‌లను కొనుగోలు చేయకుండా తాత్సారం చేస్తున్నా జీజీహెచ్‌ అధికారులు పట్టించుకోవట్లేదు. పైగా ప్రతినెలా వారి పని తీరుకు 80 శాతానికిపైగా మార్కులు వేసి నిధులు వచ్చేందుకు దోహదం చేస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బందికి నిర్వాహకులు జీతాలు ఇవ్వకపోయినా, ఆర్‌ఎఫ్‌ఐడీ టాగ్‌లు తెప్పించకపోయినా ఆసుపత్రి అధికారులు కాంట్రాక్టు సంస్థకు వత్తాసు పలుకుతుండటం విమర్శలకు తావిస్తోంది. 
 
సాంకేతిక సమస్యలు వచ్చాయి..
ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగింగ్‌ సిస్టమ్‌లో సాంకేతిక సమస్యలు వచ్చాయి. సాఫ్ట్‌వేర్‌ తప్పుగా వస్తుండటంతో ట్యాగ్‌లు ఏర్పాటు చేసినా సక్రమంగా పని చేయడం లేదు. కొత్త సాఫ్ట్‌వేర్‌ ఏర్పాటు చేయాలని సెక్యూరిటీ కాంట్రాక్టర్‌ను ఆదేశించాం. 
– డాక్టర్‌ అనంత శ్రీనివాసులు, జీజీహెచ్‌ ఆర్‌ఎంవో

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement