rfid
-
టోల్గేట్లలో ఇక ఫాస్ట్‌గా!
గుంటూరు – విజయవాడ మధ్య జాతీయ రహదారిపై రద్దీగా ఉండే కాజ టోల్‌గేట్‌ను దాటాలంటే వాహనాలు బారులు తీరిన సమయంలో 10 – 15 నిమిషాలు పడుతోంది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో గంటల తరబడి నిరీక్షణ తప్పదు. వాహనాలు చీమల్లా కదులుతుండటంతో ఇంధనం వృథా అవుతోంది. జాతీయ రహదారులపై 10 టోల్గేట్లు దాటాలంటే సగటున అర లీటరు నుంచి లీటరు దాకా ఇంధనం వృథా అవుతోందని అంచనా. అదే ‘ఫాస్టాగ్’ వరుసలో వెళ్తే రెండు నిమిషాల్లో టోల్గేట్ దాటవచ్చు. ప్రస్తుతం టోల్గేట్లలో ఒక వరుస మాత్రమే ఫాస్టాగ్ కోసం అందుబాటులో ఉంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి టోల్గేట్లలో అన్ని వరుసలను ఫాస్టాగ్‌గా మారుస్తారు. వాహనదారులు కేవలం ఒక్క వరుసలో మాత్రమే డబ్బులు చెల్లించి రశీదు తీసుకునే వీలుంటుంది. సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా డిసెంబరు 1వ తేదీ నుంచి ‘వన్ నేషన్.. వన్ ట్యాగ్’ నినాదంతో అన్ని టోల్గేట్లలో ఫాస్టాగ్ విధానాన్ని విధిగా అమలు చేయనున్నారు. కేవలం ఒక్క వరుసలో మాత్రమే నగదు చెల్లించే అవకాశం ఉంటుంది. ఏపీలోని 43 ఎన్హెచ్ఏఐ టోల్గేట్లలో ఫాస్టాగ్ అమలవుతుంది. టోల్‌గేట్‌కు 20 కిలోమీటర్ల పరిధిలో ఉండే స్థానికులు, స్థానిక రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలకు ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ ప్రీ పెయిడ్ పాసులు ఇచ్చి.. ఫాస్టాగ్ విధానంలో రాయితీలు వర్తించేలా ఎన్హెచ్ఏఐ ఉత్తర్వులిచ్చింది. పలు రకాలుగా రీ చార్జి సదుపాయం: టోల్గేట్ వద్ద ఫాస్టాగ్ వరుసలో వాహనాలు 25–40 కి.మీ. వేగంతో మాత్రమే వెళ్లాలి. క్యాష్ లెస్ విధానంలో ఫాస్టాగ్ అమలవుతుంది. ఫాస్టాగ్ ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ల కోసం కేంద్రం 23 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. కనీసం రూ.వందతో ఫాస్టాగ్ ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ పొందవచ్చు. అమెజాన్, ఫాస్టాగ్ యాప్, పేటీఎం ద్వారా రీ ఛార్జి చేసుకునే సదుపాయం ఉంది. ఇవీ ఉపయోగాలు.. - ఇంధనం, సమయం ఆదా. - కాలుష్యం తగ్గుతుంది. - ట్రాఫిక్ సమస్యలుండవు. - చోరీకి గురైన ఫాస్టాగ్ ఉన్న వాహనం టోల్‌ప్లాజా దాటగానే యజమాని ఫోన్‌కు మెస్సేజ్ వస్తుంది. స్టేట్ హైవే టోల్‌ప్లాజాల్లోనూ... జాతీయ రహదారులతోపాటు రాష్ట్ర రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల్లోనూ ఫాస్టాగ్ అమలు చేయాలని ఎన్హెచ్ఏఐ ఆదేశాలిచ్చింది. నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిలో తుమ్మలచెరువు వద్ద, సంతమాగులూరు సమీపం లోని ఏల్చూరు, రాజమండ్రి బ్రిడ్జి, పులిగడ్డ వారధి వద్ద ఇలాంటి టోల్గేట్లు ఉన్నాయి. వీటిలో రెండువైపులా ఫాస్టాగ్ డెడికేటెడ్ లైన్లు ఏర్పాటు చేయనున్నారు. టోల్గేట్లలో ఆర్ఎఫ్ఐడీ యంత్రాల వ్యయంలో 50 శాతాన్ని ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ భరించనుంది. ఫాస్టాగ్ అంటే..? బ్యాంకు ఖాతాతో అనుసంధానం కలిగి ఉండే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీతో కూడిన స్టిక్కర్‌ను ఫాస్టాగ్ అంటారు. ఫాస్టాగ్ స్టిక్కర్ మీదున్న బార్‌కోడ్‌ను టోల్‌ప్లాజాలోని ఆర్ఎఫ్ఐడీ యంత్రం గుర్తించి రీడ్ చేస్తుంది. వాహనం టోల్‌ప్లాజాను దాటుతుండగా టోల్ రుసుమును రీఛార్జి మొత్తం నుంచి మినహాయించుకుంటుంది. ఈ వివరాలు వెంటనే వాహనదారుడి ఫోన్‌కు ఎస్ఎంఎస్ ద్వారా అందుతాయి. ఏపీలో ఫాస్టాగ్ ద్వారా ప్రస్తుతం 20 నుంచి 25 శాతం వాహనాలు ప్రయాణిస్తున్నట్లు అంచనా. సిబ్బంది కుదింపు?: టోల్‌ప్లాజాల్లో ఫాస్టాగ్ అమలుతో భవిష్యత్తులో సిబ్బంది కుదింపు చర్యలు చేపట్టనున్నట్లు కొంతమంది టోల్ నిర్వాహకులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో అన్ని టోల్‌ప్లాజాల్లో సగటున 105 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేలా ఎన్హెచ్ఏఐ చర్యలు చేపట్టాలని సిబ్బంది కోరుతున్నారు. సరుకు రవాణా సమయం ఆదా టోల్‌ప్లాజాల్లో ట్రాఫిక్ సమస్యతో సమయం, ఇంధనం వృథా అవుతోంది. పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలతో ఇప్పటికే రవాణా రంగం కుదేలైంది. ఫాస్టాగ్ అమలుతో కొన్ని సమస్యలు తీరినట్లే. – ఈశ్వరరావు, లారీ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఫాస్టాగ్‌కు కేంద్రం సాయం స్టేట్ హైవేస్‌లోని టోల్‌ప్లాజాల్లో ఫాస్టాగ్ అమలుకు రూ.20 లక్షల చొప్పున ఖర్చవుతుంది. ఈ భారం భరించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. – మనోహర్‌రెడ్డి, రోడ్ డెవలప్‌మెంట్‌కార్పొరేషన్ ఎండీ -
వాహనం ఆగకుండానే టోల్
సాక్షి, హైదరాబాద్: రహదారులపై దూసుకెళ్లే వాహనాలు టోల్గేట్ దగ్గర కూడా ఇకపై రయ్‌మంటూ వెళ్లిపోవచ్చు... టోల్ రుసుము చెల్లించేందుకు క్యూలో నిరీక్షించాల్సి రావడం, టోల్ సిబ్బంది గేట్ ఎత్తితేనే వాహనాన్ని ముందుకు పోనీయాల్సిన పరిస్థితికి బ్రేక్ పడనుంది. ఇప్పటివరకు కొనసాగుతున్న ఈ పాత విధానానికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తిచెప్పనుంది. వాహనం ఆగాల్సిన అవసరం లేకుండానే టోల్ చెల్లించే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైస్ (ఆర్ఎఫ్ఐడీ) విధానాన్ని అమల్లో తేనుంది. ఇప్పటికే కొన్ని జాతీయ రహదారులపై ప్రయోగాత్మకంగా అమలవుతున్న ఈ విధానాన్ని ఇక నుంచి పక్కాగా అమలు చేయటంతోపాటు అన్ని రోడ్లను అనుసంధానించే విధానానికి కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం వాహనదారుడు ముందుగానే స్మార్ట్‌కార్డు తరహాలో టోల్కార్డును పొందడంతోపాటు ఆర్ఎఫ్ఐడీ టాగ్‌ను వాహనం ముందుభాగంలో అమర్చుకోవాల్సి ఉంటుంది. అందులో వాహనం కేటగిరి, కార్డులో ఉన్న నగదు నిల్వ వివరాలు పొందుపరిచి ఉంటాయి. టోల్ గేట్ వద్ద ఉండే ఆర్ఎఫ్ఐడీ పరికరం రేడియో తరంగాల ద్వారా దాన్ని స్కాన్ చేస్తుంది. ఆ వాహనం ప్రయాణించిన దూరానికి సరిపడా మొత్తాన్ని కార్డు నుంచి మినహాయించుకుంటుంది. ఆటోమేటిక్‌గా గేటు తెరుచుకుంటుంది. దీంతో వాహనం ఆగకుండా ముందుకు సాగుతుంది. గతంలో రకరకాల విధానాలను పరిశీలించినా ఇప్పుడు సమగ్ర విధానాన్ని అవలంబించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జాతీయ రహదారులు, హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్)తో అనుసంధానించబోతున్నారు. ప్రయోగాత్మకంగా ఔటర్ రింగురోడ్డుపై రెండు టోల్గేట్ల మధ్య మరో రెండు మూడు రోజుల్లో దీన్ని ప్రారంభించనున్నారు. గచ్చిబౌలి–శంషాబాద్ మార్గంలోని ఔటర్‌రింగురోడ్డుపై నానక్‌రామ్‌గూడ–శంషాబాద్ టోల్గేట్ల మధ్య ప్రయోగాత్మకంగా ఆర్ఎఫ్ఐడీ విధానాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి రూ. 2.5 కోట్ల విలువ చేసే పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. టోల్ స్మార్ట్‌కార్డులను కొన్ని ఎంపిక చేసిన బ్యాంకుల్లో అందుబాటులో ఉంచుతారు. నిర్ధారిత మొత్తానికి అక్కడి నుంచి దాన్ని పొందాల్సి ఉంటుంది. అందులోని బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత ఆ బ్యాంకుల నుంచి టాప్అప్ వేసుకోవాల్సి ఉంటుంది. విధానం అమలు ఇలా... ఓఆర్ఆర్పై రెండు టోల్గేట్ల వద్ద తొమ్మిది లేన్లను ఈ ఆర్ఎఫ్ఐడీ వి«ధానంతో అనుసంధానించారు. వాహనాలు తొలి గేట్‌ను దాటే సమయంలో అక్కడి పరికరాలు ఆ వాహనం ముందువైపు ఉన్న ట్యాగ్‌ను స్కాన్ చేసి వాహనం కేటగిరి, కార్డులోని బ్యాలెన్స్, అసలు అది ఆర్ఎఫ్ఐడీ వాహనం అవునా కాదా తదితర వివరాలను గుర్తిస్తాయి. ఆ వాహనం రెండో గేట్ దాటేటప్పుడు... ఆ వాహనం మొత్తం ఎంత దూరం ప్రయాణించిందో గుర్తించి అక్కడి పరికరం అంత మేర మొత్తాన్ని మినహాయించుకుంటుంది. ఈ నెల 28లోగా దీన్ని అధికారికంగా ప్రారంభించాలని యోచిస్తున్నారు. కొద్దిరోజులు దీన్ని పరిశీలించిన తర్వాత ఔటర్‌పై అన్ని టోల్గేట్ల వద్ద ఏర్పాటు చేస్తారు. వేరే నగరాల నుంచి జాతీయ రహదారుల మీదుగా వచ్చే వాహనాలకు ఉండే ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌ను కూడా ఇవి స్కాన్ చేసేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. వెరసి అన్ని జాతీయ రహదారులు, ఇతర రోడ్లపైతోపాటు ఓఆర్ఆర్పై ఒకే కార్డు పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఎన్‌హెచ్, ఎన్హెచ్ఏఐ అధికారులను సంప్రదించి చర్చలు జరుపుతున్నారు. వెరసి దేశవ్యాప్తంగా ఒకే కార్డు పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఓ అధికారి ‘సాక్షి’తో చెప్పారు. -
నీటి లెక్క ఇక పక్కా!
గ్రేటర్లో ఆర్ఎఫ్ఐడీ మీటర్ల వినియోగం జలమండలి ప్రయోగాత్మక చర్యలు.. సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో సరఫరా చేస్తున్న ప్రతి నీటిబొట్టును శాస్త్రీయంగా లెక్కించేందుకు జలమండలి ప్రయోగాత్మకంగా ఆర్ఎఫ్ఐడీ మీటర్లను ప్రవేశపెడుతోంది. వందల కిలోమీటర్ల దూరం నుంచి మహానగరానికి నిత్యం 404 మిలియన్ గ్యాలన్ల మేర కృష్ణా, గోదావరి జలాలను తరలిస్తోంది. ఈ నీటిని 9.65 లక్షల నల్లాలకు సరఫరా చేస్తోంది. కానీ ఇందులో బిల్లులు వసూలవుతున్నది కేవలం 209 మిలియన్ గ్యాలన్లకు మాత్రమే. మిగతా నీరంతా లీకేజీలు, చౌర్యం, అక్రమ నల్లాల కారణంగా బోర్డు లెక్కలోకి రాకపోవడంతో జలమండలి ఖజనా నష్టాల నుంచి గట్టెక్కడంలేదు. ప్రస్తుతం నెలవారీ ఆదాయం రూ.90 కోట్లు కాగా...జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులు, విద్యుత్ బిల్లులకు రూ.102 కోట్ల మేర ఖర్చుచేస్తోంది. ఈ నేపథ్యంలో సరఫరా నష్టాలకు శాస్త్రీయంగా చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. తొలివిడతగా జూబ్లిహిల్స్, రెడ్‌హిల్స్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో బడా భవంతులకున్న నల్లాలు, మాల్స్, హోటల్స్, రెస్టారెంట్లకున్న వాణిజ్య నల్లాలకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ) సాంకేతికత ఆధారంగా పనిచేసే అత్యాధునిక మీటర్లను ఏర్పాటుచేయాలని సంకల్పించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే గ్రేటర్ పరిధిలో ఇతర డివిజన్లకు కూడా క్రమంగా విస్తరించాలని నిర్ణయించింది. కాగా సుమారు రూ.7,500 ధర పలికే ఈ మీటర్లను సుమారు ఐదు లక్షల నల్లాలకు ఏర్పాటు చేసి నెలవారీ బిల్లులో కొంతమొత్తాన్ని వాయిదాల పద్ధతిలో వసూలు చేయాలని సంకల్పించింది. ఇందుకయ్యే వ్యయాన్ని వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణంగా స్వీకరించాలా..లేక ప్రభుత్వం ఇందుకయ్యే వ్యయాన్ని కేటాయిస్తుందా అన్న అంశం మున్సిపల్ పరిపాలన శాఖ పరిశీలనలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆర్ఎఫ్ఐడీ మీటర్లతో ఉపయోగాలివే.. మీటర్ రీడింగ్‌లో 100 శాతం కచ్చితత్వం ఉంటుంది. సిబ్బంది నిల్చున్న చోట నుంచే రీడింగ్ సేకరించే వీలు చేతిలో ఉన్న ప్రత్యేక పరికరం ద్వారా డేటా సేకరణ. ప్రతి ఇంటికీ వెళ్లి నల్లా గుంతలో దిగాల్సిన అవసరం ఉండదు. నీటి సరఫరా నష్టాలను ఇట్టే గుర్తించవచ్చు. బెంగళూరులో ఇలా... మన పొరుగునే ఉన్న బెంగళూరు తరహాలో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ) నీటి మీటర్లను అక్కడి జలబోర్డు ఏర్పాటుచేసింది. అక్కడి వి«ధానంపై ఇటీవల జలమండలి ఉన్నతాధికారుల బందం బెంగళూరు వెళ్లి పరిశీలించి వచ్చింది.బెంగళూరులో తొలుత ఆయా నల్లాల కు మీటర్లు ఏర్పాటుచేసి తర్వాత విని యోగదారుల నుంచి వాయిదాల పద్ధతిలో వసూలు చేస్తున్నారు. ప్రతి నల్లాకు అక్కడ బెంగళూరు జలబోర్డు ఆర్ఎఫ్ఐడీ మీటర్లను అమర్చుతోంది.మీటరు పనితీరుపై ఫిర్యాదు వచ్చిన 12 గంటల వ్యవధిలోనే రంగంలోకి దిగి మీటరు మరమ్మతులు లేదంటే కొత్తది ఏర్పాటు చేస్తారు. ఒక్కో ఆర్ఎఫ్ఐడీ మీటరు మార్కెట్లో రూ.7,500 ధర పలుకుతోంది. నగరంలో ఇలా... వినియోగదారులు తమ ఇళ్లలోని నల్లాలకు సాధారణ మీటర్లు పెట్టుకుంటున్నారు. ఇవి రూ.1,000 నుంచి రూ.1,500 లోపు ఉంటున్నాయి. నాణ్యత లేకపోవడంలో కొన్ని రోజుల్లోనే మూలకు చేరుతున్నాయి.ప్రస్తుతం నల్లాలకున్న నీటి మీటరు భూమిలోపల ఉంటుంది. ఈ గోతిలోకి దిగి రీడింగ్ తీయడం జలమండలి సిబ్బందికి కష్టమవుతోంది. దీంతో చాలామంది మీటరు రీడర్లు తోచినంత రీడింగ్ వేసి బిల్లులు ఇస్తున్నారు.కొన్నిసార్లు వాడని నీటికి వినియోగదారులు భారీ ఎత్తున బిల్లులు చెల్లిస్తున్నారు. ఈ మీటర్ల ద్వారా కచ్చితమైన లెక్కలు తెలియడం లేదు. వినియోగిస్తున్న నీటికి చెల్లిస్తున్న బిల్లులకు పొంతన ఉండటం లేదు.ఈ నేపథ్యంలో ఆర్ఎఫ్ఐడీ మీటర్లు పెట్టాలనేది జలమండలి యోచన. -
ఆరంభ శూరత్వంగా ‘ఆర్ఎఫ్ఐడీ’
జీజీహెచ్‌లో పని చేయని ‘ట్యాగింగ్’ వ్యవస్థ ‘ఆర్ఎఫ్ఐడీ’తో తల్లికి, పసి బిడ్డలకు రక్షణ కవచాలు జీజీహెచ్‌లో ఆర్ఎఫ్ఐడీ ట్యాగింగ్ సిస్టమ్ ఏర్పాటు ఆరంభ శూరత్వంగా మారింది. రాష్ట్ర మంత్రులు అట్టహాసంగా ప్రారంభించిన ఈ ప్రక్రియ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. హైటెక్ ముఖ్యమంత్రిగా గొప్పలు చెప్పుకునే చంద్రబాబు టెక్నాలజీతో కూడిన కార్యక్రమాలు ఆగిపోతున్నా వాటిపై దృష్టి సారించడం లేదు. గుంటూరు మెడికల్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో తరచుగా పసికందులు అదృశ్యమైన ఘటనలు చోటు చేసుకుంటుండటంతో ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం పిల్లల అపహరణను నియంత్రించేందుకు గుంటూరు జీజీహెచ్‌లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) ట్యాగింగ్ సిస్టమ్‌ను మొదటిసారిగా 2016 జూలై 16న గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో ప్రారంభించింది. ఆస్పత్రిలో నాలుగు చోట్ల ఏర్పాటు... పసికందులు పుట్టిన వెంటనే తల్లికి, బిడ్డకు (ఒకే నంబర్ ఉన్న) ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌ను అమరుస్తారు. ఈ వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేస్తారు. తల్లీబిడ్డకు మధ్య 10 మీటర్ల దూరం దాటితే వెంటనే పెద్దగా శబ్ధం వస్తుంది. వేరేవారు పిల్లలను పట్టుకుంటే వెంటనే దొరికిపోతారు. ప్రధాన ద్వారాల వద్ద, వార్డుల్లో సైరన్ శబ్ధం వినిపించే సరికి సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమవుతారు. ఈ ట్యాగ్‌లను సెన్సార్లు మోనిటర్ చేస్తుంటాయి. ఆస్పత్రిలోని లేబర్ రూమ్, ఎస్ఎన్సీయూ, పిల్లల వైద్య విభాగం, గైనకాలజీ వైద్య విభాగ వార్డుల్లో ఈ సెన్సార్లు ఏర్పాటు చేశారు. గుజరాత్‌కు చెందిన ఓడోహబ్ డాట్ కామ్ సంస్థ ఈ నూతన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. రూ.12 లక్షల ఖర్చుతో... జీజీహెచ్‌లో ఈ వ్యవస్థ ఏర్పాటుకు సుమారు రూ.12 లక్షల వరకు ఖర్చయ్యింది. ముందస్తు ఒప్పందంతోనే సెక్యూరిటీ కాంట్రాక్ట్ సంస్థౖయెన జేబీ సెక్యూరిటీ నిర్వాహకులు ఈ ఖర్చును భరించారు. ఆన్లైన్లో వివరాల నమోదుకు రిసెప్షనిస్ట్ కమ్ ఆపరేటర్‌ను కూడా నియమించారు. ట్యాగ్లు ఏర్పాటు చేసేందుకు జతకు రూ.50 ఖర్చవుతుందని, అహ్మదాబాద్ నుంచి ట్యాగ్‌లను తెప్పిస్తున్నామని ఆసుపత్రి అధికారులు తెలిపారు. ప్రారంభానికే పరిమితం.. అయితే, అట్టహాసంగా ప్రారంభమైన ఆర్ఎఫ్ఐడీ ట్యాగింగ్ విధానం ఆరంభ శూరత్వంగా మిగిలింది. ప్రారంభానికే పరిమితమై ఆచరణలోకి రాలేదు. అయితే, కాంట్రాక్టర్లు ట్యాగ్‌లను కొనుగోలు చేయకుండా తాత్సారం చేస్తున్నా జీజీహెచ్ అధికారులు పట్టించుకోవట్లేదు. పైగా ప్రతినెలా వారి పని తీరుకు 80 శాతానికిపైగా మార్కులు వేసి నిధులు వచ్చేందుకు దోహదం చేస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బందికి నిర్వాహకులు జీతాలు ఇవ్వకపోయినా, ఆర్ఎఫ్ఐడీ టాగ్లు తెప్పించకపోయినా ఆసుపత్రి అధికారులు కాంట్రాక్టు సంస్థకు వత్తాసు పలుకుతుండటం విమర్శలకు తావిస్తోంది. సాంకేతిక సమస్యలు వచ్చాయి.. ఆర్ఎఫ్ఐడీ ట్యాగింగ్ సిస్టమ్‌లో సాంకేతిక సమస్యలు వచ్చాయి. సాఫ్ట్వేర్ తప్పుగా వస్తుండటంతో ట్యాగ్లు ఏర్పాటు చేసినా సక్రమంగా పని చేయడం లేదు. కొత్త సాఫ్ట్వేర్ ఏర్పాటు చేయాలని సెక్యూరిటీ కాంట్రాక్టర్‌ను ఆదేశించాం. – డాక్టర్ అనంత శ్రీనివాసులు, జీజీహెచ్ ఆర్ఎంవో -
ఆటో పర్మిట్ల మంజూరుకు కొత్త నియమాలు
సాక్షి, ముంబై: కొత్త ఆటో పర్మిట్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిబంధనలను రూపొందించింది. ఇక మీదట ఆటో పర్మిట్లను పొందాలనుకున్నవారు తమ వాహనాలకు తప్పనిసరిగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్), జనరల్ ప్యాకెట్ రేడియో సర్వీస్ (జీపీఆర్ఎస్) పరికరాలను అమర్చుకోవాల్సి ఉంటుందని రవాణా శాఖ స్పష్టం చేసింది. వీటితోపాటు ప్రయాణికుల సౌకర్యార్థం రూఫ్ టాప్ ఇండికేటర్లు, ఐడెంటిటీ కార్డులు, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) ట్యాగ్‌లను కూడా అమర్చుకోవడం తప్పనిసరి. అయితే ఆర్ఎఫ్ఐడీ పరికరాన్ని అమర్చితే టోల్‌నాకాల వద్ద వాహనం సమాచారాన్ని సులువుగా నమోదు చేయవచ్చు. టోల్‌ను కూడా ఆన్లైన్ పద్ధతిలో వసూలు చేయవచ్చు. ఆటో పర్మిట్లను జారీకి రూపొందించిన నిబంధనల్లో చాలా వరకు పాతవే ఉన్నాయి. జీపీఎస్, జీపీఆర్ఎస్, ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్, రూఫ్ టాప్ ఇండికేటర్లు, డిస్ప్లే కార్డులు (ఈ కార్డుల్లో డ్రైవర్లకు చెందిన పూర్తి సమాచారం పొందుపర్చాల్సి ఉంటుంది) తదితర పరికరాలను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ప్రస్తుతం నియమాల ప్రకారం ప్రతి డ్రైవర్‌కు లెసైన్సులు, ఆటోరిక్షా బ్యాడ్జీలు, మహారాష్టల్రో 15 ఏళ్లుగా నివాసముంటున్నట్లుగా రుజువు చేసే పత్రాలు కలిగి ఉంటే సరిపోతుంది. ఇక నుంచి మరిన్ని కొత్త నియమాలను కూడా డ్రైవర్లు పాటించాల్సి ఉంటుంది. కొత్త పర్మిట్ల కేటాయింపునకు లాటరీ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా సీనియర్ రవాణా శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. కొత్త నియమాల గురించి ఇంతకు ముందే సమాచారాన్ని డ్రైవర్లకు అందజేశామన్నారు. ఇక ముంబైవ్యాప్తంగా 18 వేల కొత్త పర్మిట్లను జారీ చేస్తారు. ఇందులో 9,350 పర్మిట్లను అంధేరీ ఆర్టీఓ, 8,750 పర్మిట్లను వడాలా ఆర్టీఓ జారీ చేస్తుంది. నిద్రాణస్థితిలో (డోర్మంట్) ఉన్న వాటిలో 50 శాతం పర్మిట్లను కూడా పునరుద్ధరిస్తారు. అయితే పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థి చెల్లుబాటు గల ఆటో లెసైన్సును కలిగి ఉండాలి. ప్రజారవాణా బ్యాడ్‌జ కూడా తప్పనిసరి. స్థానిక భాష, స్థానిక పర్యాటక ప్రాంతాలపై అవగాహన కలిగి ఉండాలి. మహారాష్టల్రో 15 ఏళ్లుగా నివాసముంటున్నట్టు నిరూపించే ధ్రువపత్రం సమర్పించాలి. గత ఏడాదిలో తనపై ఎలాంటి కేసులూ నమోదు కాలేదంటూ పోలీసులు మంజూరు చేసిన ధ్రువపత్రాన్ని కూడా ఇవ్వాలి.