సాక్షి, హైదరాబాద్: రహదారులపై దూసుకెళ్లే వాహనాలు టోల్‌గేట్ దగ్గర కూడా ఇకపై రయ్‌మంటూ వెళ్లిపోవచ్చు... టోల్ రుసుము చెల్లించేందుకు క్యూలో నిరీక్షించాల్సి రావడం, టోల్ సిబ్బంది గేట్ ఎత్తితేనే వాహనాన్ని ముందుకు పోనీయాల్సిన పరిస్థితికి బ్రేక్ పడనుంది. ఇప్పటివరకు కొనసాగుతున్న ఈ పాత విధానానికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తిచెప్పనుంది. వాహనం ఆగాల్సిన అవసరం లేకుండానే టోల్ చెల్లించే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైస్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) విధానాన్ని అమల్లో తేనుంది. ఇప్పటికే కొన్ని జాతీయ రహదారులపై ప్రయోగాత్మకంగా అమలవుతున్న ఈ విధానాన్ని ఇక నుంచి పక్కాగా అమలు చేయటంతోపాటు అన్ని రోడ్లను అనుసంధానించే విధానానికి కసరత్తు ప్రారంభించింది.
ఇందుకోసం వాహనదారుడు ముందుగానే స్మార్ట్‌కార్డు తరహాలో టోల్‌కార్డును పొందడంతోపాటు ఆర్‌ఎఫ్‌ఐడీ టాగ్‌ను వాహనం ముందుభాగంలో అమర్చుకోవాల్సి ఉంటుంది. అందులో వాహనం కేటగిరి, కార్డులో ఉన్న నగదు నిల్వ వివరాలు పొందుపరిచి ఉంటాయి. టోల్ గేట్ వద్ద ఉండే ఆర్‌ఎఫ్‌ఐడీ పరికరం రేడియో తరంగాల ద్వారా దాన్ని స్కాన్ చేస్తుంది. ఆ వాహనం ప్రయాణించిన దూరానికి సరిపడా మొత్తాన్ని కార్డు నుంచి మినహాయించుకుంటుంది. ఆటోమేటిక్‌గా గేటు తెరుచుకుంటుంది. దీంతో వాహనం ఆగకుండా ముందుకు సాగుతుంది. గతంలో రకరకాల విధానాలను పరిశీలించినా ఇప్పుడు సమగ్ర విధానాన్ని అవలంబించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జాతీయ రహదారులు, హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగురోడ్డు (ఓఆర్‌ఆర్)తో అనుసంధానించబోతున్నారు.
ప్రయోగాత్మకంగా ఔటర్ రింగురోడ్డుపై రెండు టోల్‌గేట్ల మధ్య మరో రెండు మూడు రోజుల్లో దీన్ని ప్రారంభించనున్నారు. గచ్చిబౌలి–శంషాబాద్ మార్గంలోని ఔటర్‌రింగురోడ్డుపై నానక్‌రామ్‌గూడ–శంషాబాద్ టోల్‌గేట్ల మధ్య ప్రయోగాత్మకంగా ఆర్‌ఎఫ్‌ఐడీ విధానాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి రూ. 2.5 కోట్ల విలువ చేసే పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. టోల్ స్మార్ట్‌కార్డులను కొన్ని ఎంపిక చేసిన బ్యాంకుల్లో అందుబాటులో ఉంచుతారు. నిర్ధారిత మొత్తానికి అక్కడి నుంచి దాన్ని పొందాల్సి ఉంటుంది. అందులోని బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత ఆ బ్యాంకుల నుంచి టాప్‌అప్ వేసుకోవాల్సి ఉంటుంది.
విధానం అమలు ఇలా...
ఓఆర్‌ఆర్‌పై రెండు టోల్‌గేట్ల వద్ద తొమ్మిది లేన్లను ఈ ఆర్‌ఎఫ్‌ఐడీ వి«ధానంతో అనుసంధానించారు. వాహనాలు తొలి గేట్‌ను దాటే సమయంలో అక్కడి పరికరాలు ఆ వాహనం ముందువైపు ఉన్న ట్యాగ్‌ను స్కాన్ చేసి వాహనం కేటగిరి, కార్డులోని బ్యాలెన్స్, అసలు అది ఆర్‌ఎఫ్‌ఐడీ వాహనం అవునా కాదా తదితర వివరాలను గుర్తిస్తాయి. ఆ వాహనం రెండో గేట్ దాటేటప్పుడు... ఆ వాహనం మొత్తం ఎంత దూరం ప్రయాణించిందో గుర్తించి అక్కడి పరికరం అంత మేర మొత్తాన్ని మినహాయించుకుంటుంది. ఈ నెల 28లోగా దీన్ని అధికారికంగా ప్రారంభించాలని యోచిస్తున్నారు.
కొద్దిరోజులు దీన్ని పరిశీలించిన తర్వాత ఔటర్‌పై అన్ని టోల్‌గేట్ల వద్ద ఏర్పాటు చేస్తారు. వేరే నగరాల నుంచి జాతీయ రహదారుల మీదుగా వచ్చే వాహనాలకు ఉండే ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌ను కూడా ఇవి స్కాన్ చేసేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. వెరసి అన్ని జాతీయ రహదారులు, ఇతర రోడ్లపైతోపాటు ఓఆర్‌ఆర్‌పై ఒకే కార్డు పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఎన్‌హెచ్, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను సంప్రదించి చర్చలు జరుపుతున్నారు. వెరసి దేశవ్యాప్తంగా ఒకే కార్డు పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఓ అధికారి ‘సాక్షి’తో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment