నీటి లెక్క ఇక పక్కా!
గ్రేటర్‌లో ఆర్‌ఎఫ్‌ఐడీ మీటర్ల వినియోగం
జలమండలి ప్రయోగాత్మక చర్యలు..
సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో సరఫరా చేస్తున్న ప్రతి నీటిబొట్టును శాస్త్రీయంగా లెక్కించేందుకు జలమండలి ప్రయోగాత్మకంగా ఆర్‌ఎఫ్‌ఐడీ మీటర్లను ప్రవేశపెడుతోంది. వందల కిలోమీటర్ల దూరం నుంచి మహానగరానికి నిత్యం 404 మిలియన్ గ్యాలన్ల మేర కృష్ణా, గోదావరి జలాలను తరలిస్తోంది. ఈ నీటిని 9.65 లక్షల నల్లాలకు సరఫరా చేస్తోంది. కానీ ఇందులో బిల్లులు వసూలవుతున్నది కేవలం 209 మిలియన్ గ్యాలన్లకు మాత్రమే. మిగతా నీరంతా లీకేజీలు, చౌర్యం, అక్రమ నల్లాల కారణంగా బోర్డు లెక్కలోకి రాకపోవడంతో జలమండలి ఖజనా నష్టాల నుంచి గట్టెక్కడంలేదు. ప్రస్తుతం నెలవారీ ఆదాయం రూ.90 కోట్లు కాగా...జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులు, విద్యుత్ బిల్లులకు రూ.102 కోట్ల మేర ఖర్చుచేస్తోంది.
ఈ నేపథ్యంలో సరఫరా నష్టాలకు శాస్త్రీయంగా చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. తొలివిడతగా జూబ్లిహిల్స్, రెడ్‌హిల్స్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో బడా భవంతులకున్న నల్లాలు, మాల్స్, హోటల్స్, రెస్టారెంట్లకున్న వాణిజ్య నల్లాలకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్‌ఎఫ్‌ఐడీ) సాంకేతికత ఆధారంగా పనిచేసే అత్యాధునిక మీటర్లను ఏర్పాటుచేయాలని సంకల్పించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే గ్రేటర్ పరిధిలో ఇతర డివిజన్లకు కూడా క్రమంగా విస్తరించాలని నిర్ణయించింది. కాగా సుమారు రూ.7,500 ధర పలికే ఈ మీటర్లను సుమారు ఐదు లక్షల నల్లాలకు ఏర్పాటు చేసి నెలవారీ బిల్లులో కొంతమొత్తాన్ని వాయిదాల పద్ధతిలో వసూలు చేయాలని సంకల్పించింది. ఇందుకయ్యే వ్యయాన్ని వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణంగా స్వీకరించాలా..లేక ప్రభుత్వం ఇందుకయ్యే వ్యయాన్ని కేటాయిస్తుందా అన్న అంశం మున్సిపల్ పరిపాలన శాఖ పరిశీలనలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఆర్‌ఎఫ్‌ఐడీ మీటర్లతో ఉపయోగాలివే..
మీటర్ రీడింగ్‌లో 100 శాతం కచ్చితత్వం ఉంటుంది. సిబ్బంది నిల్చున్న చోట నుంచే రీడింగ్ సేకరించే వీలు చేతిలో ఉన్న ప్రత్యేక పరికరం ద్వారా డేటా సేకరణ. ప్రతి ఇంటికీ వెళ్లి నల్లా గుంతలో దిగాల్సిన అవసరం ఉండదు. నీటి సరఫరా నష్టాలను ఇట్టే గుర్తించవచ్చు.
బెంగళూరులో ఇలా...
మన పొరుగునే ఉన్న బెంగళూరు తరహాలో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్‌ఎఫ్‌ఐడీ) నీటి మీటర్లను అక్కడి జలబోర్డు ఏర్పాటుచేసింది. అక్కడి వి«ధానంపై ఇటీవల జలమండలి ఉన్నతాధికారుల బందం బెంగళూరు వెళ్లి పరిశీలించి వచ్చింది.బెంగళూరులో తొలుత ఆయా నల్లాల కు మీటర్లు ఏర్పాటుచేసి తర్వాత విని యోగదారుల నుంచి వాయిదాల పద్ధతిలో వసూలు చేస్తున్నారు. ప్రతి నల్లాకు అక్కడ బెంగళూరు జలబోర్డు ఆర్‌ఎఫ్‌ఐడీ మీటర్లను అమర్చుతోంది.మీటరు పనితీరుపై ఫిర్యాదు వచ్చిన 12 గంటల వ్యవధిలోనే రంగంలోకి దిగి మీటరు మరమ్మతులు లేదంటే కొత్తది ఏర్పాటు చేస్తారు. ఒక్కో ఆర్‌ఎఫ్‌ఐడీ మీటరు మార్కెట్‌లో రూ.7,500 ధర పలుకుతోంది.
నగరంలో ఇలా...
వినియోగదారులు తమ ఇళ్లలోని నల్లాలకు సాధారణ మీటర్లు పెట్టుకుంటున్నారు. ఇవి రూ.1,000 నుంచి రూ.1,500 లోపు ఉంటున్నాయి. నాణ్యత లేకపోవడంలో కొన్ని రోజుల్లోనే మూలకు చేరుతున్నాయి.ప్రస్తుతం నల్లాలకున్న నీటి మీటరు భూమిలోపల ఉంటుంది. ఈ గోతిలోకి దిగి రీడింగ్ తీయడం జలమండలి సిబ్బందికి కష్టమవుతోంది. దీంతో చాలామంది మీటరు రీడర్లు తోచినంత రీడింగ్ వేసి బిల్లులు ఇస్తున్నారు.కొన్నిసార్లు వాడని నీటికి వినియోగదారులు భారీ ఎత్తున బిల్లులు చెల్లిస్తున్నారు. ఈ మీటర్ల ద్వారా కచ్చితమైన లెక్కలు తెలియడం లేదు. వినియోగిస్తున్న నీటికి చెల్లిస్తున్న బిల్లులకు పొంతన ఉండటం లేదు.ఈ నేపథ్యంలో ఆర్‌ఎఫ్‌ఐడీ మీటర్లు పెట్టాలనేది జలమండలి యోచన.