పేదింటికి నల్లా
►1,476 బస్తీల్లో అమలకు జలమండలి నిర్ణయం
►రూ.100 కోట్ల నిధులతో ఏర్పాట్లు
►రూ.1కే 50వేల నల్లా కనెక్షన్ల మంజూరు
►వందరోజుల ప్రణాళిక సిద్ధం
►ఇక పేదల తాగునీటి ఎదురుచూపులకు చెక్!
►తగ్గనున్న ట్యాంకర్ల నిర్వహణ వ్యయం
►పెరగనున్న జలమండలి ఆదాయం
సిటీబ్యూరో: మహానగరం పరిధిలోని ఎంపికచేసిన 1,476 మురికివాడల్లో వందరోజుల్లో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఏర్పాటే లక్ష్యంగా జలమండలి కార్యాచరణ సిద్ధం చేసింది. నిరుపేదలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు రూ.100 కోట్లను వెచ్చించనుంది. ఆయా బస్తీలు, మురికివాడల్లో ఇప్పటివరకు నల్లా కనెక్షన్ లేని ఆవాసాలకు రూ.1కే ఇవ్వాలని, నూతనంగా 50 వేల నల్లా కనెక్షన్లు మంజూరు చేయడం ద్వారా సుమారు 5 లక్షల మంది పేదలకు మేలు చేకూర్చాలని నిర్ణయించింది. ఈ అంశంపై గురువారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రధానంగా మంచినీటి సరఫరా పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటులేని, కలుషిత జలాలతో ఇబ్బంది పడుతున్న.. తక్కువ వత్తిడితో నీటిసరఫరా జరుగుతున్న ప్రాంతాలను తక్షణం సెక్షన్ల వారీగా గుర్తించాలని క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మేనేజర్లను ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో ఇంటింటి నల్లా కనెక్షన్ ఏర్పాటుకు చేయాల్సిన పైపులైన్లు, బూస్టర్ పంప్‌లు, కలుషిత జలాల నివారణకు చేపట్టాల్సిన పనులపై అంచనాలు సిద్ధంచేసి పనులు ప్రారంభించాలన్నారు.
బస్తీలకు తీరనున్న దాహార్తి..
నగర శివార్లలోని 12 శివారు మున్సిపల్ సర్కిళ్లను కలుపుకొని 2007లో మహానగర పాలకసంస్థ (జీహెచ్‌ఎంసీ) ఏర్పాటైంది. సుమారు 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన జీహెచ్‌ఎంసీలో 1476 మురికివాడలున్నాయి. వీటిలో చాలా నివాసాలకు ఇప్పటికీ నల్లా కనెక్షన్లు లేవు. దీంతో పబ్లిక్ నల్లాలు, ట్యాంకర్ల ద్వారానే ఇక్కడి పేదలు గొంతు తడుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హడ్కో నిధులు రూ.1900 కోట్లతో జలమండలి ఆయా ప్రాంతాల్లో 1300 కి.మీ. పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు చేసింది. మరో 56 భారీ స్టోరేజీ రిజర్వాయర్లను నిర్మిస్తోంది. ఈ పైపులైన్లు, రిజర్వాయర్ల ఏర్పాటుతో సమీప భవిష్యత్‌లో ఆయాబస్తీల్లో నూతనంగా ఏర్పాటు చేసిన నల్లా కనెక్షన్లకు రోజూ నీటిసరఫరా చేస్తారు. ఇదే జరిగితే ఆయా బస్తీలకు ట్యాంకర్ నీళ్లకోసం ఎదురు చూసే పరిస్థితి తప్పుతుంది.
సీఎం సంకల్పాన్ని సాకారం చేస్తాం
జలమండలి ఏర్పాటై 28 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ చాలా బస్తీల్లో ఇంటింటికీ నల్లా లేదు. చాలా ప్రాంతాలకు ట్యాంకర్ నీరే దాహార్తిని తీరుస్తోంది. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. గ్రేటర్ పరిధిలో ప్రతి బస్తీలో ఇంటింటికి నల్లాల ఏర్పాటు ద్వారా సీఎం కలను సాకారం చేస్తాం. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే బస్తీల్లో పైపులైన్లు విస్తరించడానికి తక్షణం ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించాం. కొత్తగా నీటిని సరఫరా చేయాల్సిన ప్రాంతాల తుది జాబితాను సిద్దం చేయాలని సూచించాం.
– ఎం.దానకిశోర్, జలమండలి ఎండీ