కనెక్షన్‌లో కాసుల వేట
గ్రీన్‌బ్రిగేడ్ సిబ్బంది నిర్వాకం
చేయి తడపకుంటే చుక్కలే..
రూ.25 వేల వరకు అక్రమ వసూళ్లు
నిఘా పెట్టాలని వినియోగదారుల విజ్ఞప్తి
సిటీబ్యూరో: సురేష్ ఆసిఫ్‌నగర్ డివిజన్ పరిధిలో నివాసం ఉంటున్నాడు. ఇటీవలే నూతన నల్లా కనెక్షన్ పొందేందుకు ఆన్‌లైన్‌లో జలమండలికి దరఖాస్తు చేసుకున్నాడు. తన ఇంటి విస్తీర్ణాన్ని బట్టి కనెక్షన్ చార్జీలు సైతం చెల్లించాడు. దీంతో బోర్డు అధికారులు అతనికి నల్లా కనెక్షన్ మంజూరు చేశారు. కానీ కనెక్షన్ ఇచ్చే గ్రీన్ బ్రిగేడ్ సిబ్బంది మాత్రం రూ.5 వేలు ఇవ్వకుంటే కనెక్షన్ వేసేది లేదని చెప్పడంతో సురేష్ విస్తుబోయాడు. దరఖాస్తుతో పాటే తాను కనెక్షన్ చార్జీలు చెల్లించినట్లు చెప్పినా వారు వినలేదు. చేసేదిలేక వారి చేతిలో డబ్బు పెట్టి కనెక్షన్ తీసుకోవాల్సి వచ్చింది.
ఇది సురేష్ ఒక్కరి సమస్య మాత్రమే కాదు.. కొత్తగా నల్లా కనెక్షన్ తీసుకుంటున్న ప్రతి వినియోగదారుడిదీ. జలమండలి పరిధిలో నెలకు సుమారు మూడువేల మందికి నూతన నల్లా కనెక్షన్లు మంజూరు అవుతున్నాయి. ఇక్కడి దాకా బాగానే ఉన్నా కనెక్షన్ ఇచ్చే సిబ్బంది కనెక్షన్ బిగించే సమయంలో వియోగదారుల జేబులు ఖాళీ చేస్తున్నారు. ఇంటి విస్తీర్ణాన్ని బట్టి రూ.5 వేలు నుంచి రూ.25 వేల వరకు పిండుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
దొరికినంత దోచుకో..
నల్లా కనెక్షన్ల జారీలో కాసుల వేటతో వినియోగదారుల జేబులు గుల్లవుతున్నాయి. జలమండలి గ్రీన్‌బ్రిగేడ్ సి బ్బంది చేస్తున్న నిర్వాకాలతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లా కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకునే సమయంలోనే ఇంటి నిర్మాణ స్థలం, అంతస్తులు, పోర్షన్ల సంఖ్యను బట్టి బోర్డు నిర్దేశించిన మేరకు చార్జీలు చెల్లిస్తున్నారు. ఆ తరవాత కనెక్షన్ మంజూరు అవుతుంది. ఇంటికి నల్లా వేసే సమయంలో కనెక్షన్లు ఇచ్చే గ్రీన్‌బ్రిగేడ్ సిబ్బంది వినియోగదారులకు చుక్కలు చూపుతున్నారు. దీనిపై ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆసిఫ్‌నగర్, మెహిదీపట్నం, సికింద్రాబాద్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో జలమండలికి నిర్ణీత మొత్తంలో కనెక్షన్ చార్జీలు చెల్లించినప్పటికీ తమకు అడిగినంత ఇవ్వనిదే కనెక్షన్ ఇచ్చేది లేదంటూ పలువురు గ్రీన్‌బ్రిగేడ్ సిబ్బంది అందినకాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బోర్డు మంజూరు చేసిన పై పులను సైతం విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రీన్‌బ్రిగేడ్ సిబ్బంది ఆగడాలపై ఉన్నతాధికారుల నిఘా లేకపోవడంతో ఈ భాగోతం యథేచ్ఛగా సాగుతుండడం గమనార్హం.
నెలకు మూడు వేల కనెక్షన్లు..
జలమండలి పరిధిలో ప్రస్తుతం 8.75 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వీటి ద్వారా నిత్యం 356 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తున్నారు. కాగా, ప్రతి నెలా నీటి సరఫరా వ్యవస్థ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో మూడువేల నూతన నల్లా కనెక్షన్లను బోర్డు మంజూరు చేస్తోంది. వీటి ఏర్పాటుకు సుమారు 125 గ్రీన్‌బ్రిగేడ్ బృందాలు అందుబాటులో ఉన్నాయి. ఈ బృందాల్లో పలువురు ప్రతి కొత్త కనెక్షన్‌కు.. భవనం, ప్రాంతాన్ని బట్టి రూ.25 వేల వరకు అదనంగా దండుకోవడం గమనార్హం. వీరిపై అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గ్రీన్‌బ్రిగేడ్ సిబ్బంది ఆగడాలపై విజిలెన్స్ నిఘా పెట్టాలని కోరుతున్నారు.