ఇక కను‘మరుగు’
►జలమండలి ప్రీ మాన్‌సూన్ యాక్షన్ ప్లాన్ రెడీ
►రూ.3.03 కోట్లతో మురుగునీటి పైపులైన్ల ప్రక్షాళన రూ.13 కోట్లతో 170
►‘హాట్‌స్పాట్స్’కు మరమ్మతులు జూన్ తొలివారం లోగా పనుల పూర్తి
సిటీబ్యూరో: గ్రేటర్‌లో చినుకుపడితే చాలు.. ఉప్పొంగే మ్యాన్‌హోళ్లు..మురుగు, వరద నీరు సుడులు తిరుగుతూ రహదారులు చెరువులను తలపిస్తాయి. వాహనదారులకు నరకం చూపిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు వర్షాకాలం అవస్థలను తొలగించేందుకు జలమండలి ‘ప్రీ మాన్‌సూన్ యాక్షన్‌ప్లాన్’ (వర్షాకాల ముందస్తు ప్రణాళిక)కు శ్రీకారం చుట్టింది. జూన్ తొలివారంలోగా మురుగునీటి పైపులైన్లు, మ్యాన్‌హోళ్లలో పేరుకుపోయిన పూడిక తొలగించేందుకు యుద్ధప్రాతిపదికన వాటి ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించింది. ఇరుకైన కాలనీలు, బస్తీల్లో ఈ ప్రక్షాళన పనులు చేపట్టేందుకు 37 మినీ ఎయిర్‌టెక్ యంత్రాలను రంగంలోకి దించనుంది. గ్రేటర్‌లో సుమారు ఐదువేల కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన మురుగునీటి పారుదల వ్యవస్థలో.. సుమారు వెయ్యి కిలోమీటర్ల వరకు తరచూ మురుగు నీరు ఉప్పొంగి సమీపబస్తీలు, కాలనీలు, రహదారులను ముంచెత్తే పరిస్థితులున్నాయి. వీటికి తక్షణం ప్రక్షాళన చేపట్టనున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. ఇందుకవసరమైన రూ.16 కోట్ల నిధులను సైతం కేటాయించామని పేర్కొన్నాయి.
ముందస్తు ప్రణాళిక అమలు ఇలా..
మహానగరంలో జలమండలికి 5 వేల కిలోమీటర్ల పరిధిలో విభిన్న పరిమాణం గల మురుగునీటి పైపులైన్ వ్యవస్థ అందుబాటులో ఉంది. వీటిపై ప్రతి 30 మీటర్లకు ఒకటిచొప్పున 1.85 లక్షల మ్యాన్‌హోళ్లున్నాయి. వీటిలో ప్రధానంగా వెయ్యి కిలోమీటర్ల పైపులైన్లు, మరో 50 వేల వరకు మ్యాన్‌హోళ్లలో ప్రస్తుతం చెత్తా, చెదారం, కొబ్బరిబోండాలు, ప్లాస్టిక్ కవర్లు వంటి వ్యర్థాల చేరికతో మురుగునీరు సాఫీగా వెళ్లే పరిస్థితులు లేవు. దీంతో ప్రీమాన్‌సూన్ యాక్షన్‌ప్లాన్‌ను జలమండలి అమలుచేయనుంది. మరోవైపు మెస్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు, ఫంక్షన్‌హాళ్లు, డెయిరీ ఫారాలు, సినిమాహాళ్ల నుంచి వెలువడుతోన్న మురుగునీటిలో ఘనవ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు అధిక మొత్తంలో వెలువడుతోన్న నేపథ్యంలో ఆయా వాణిజ్య భవనాల ముందు విధిగా సిల్ట్‌ఛాంబర్లు(ఘనవ్యర్థాలను నిలువరించేవి)నిర్మించుకునేలా క్షేత్రస్థాయి మేనేజర్లు, డీజీఎంలు చర్యలు తీసుకోవాలని ఎండీ దానకిశోర్ ఆదేశాలిచ్చారు.
ఏ పనులకు ఎంత వ్యయం అంటే..
► గ్రేటర్ పరిధిలో తరచూ మురుగునీరు ఉప్పొంగే 170 హాట్‌స్పాట్స్ వద్ద రూ.13 కోట్లతో మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు.
► అసాధారణ స్థాయిలో మురుగు ఉప్పొంగే ప్రభావిత ప్రాంతాల్లో రూ.88 లక్షల అంచనా వ్యయంతో పైపులైన్లు, మ్యాన్‌హోళ్లను సమూలంగా ప్రక్షాళన చేస్తారు.
► ఇతర ప్రాంతాల్లో సుమారు రూ.22 లక్షలతో 37 మినీ ఎయిర్‌టెక్ యంత్రాలతో మ్యాన్‌హోళ్లు, మురుగునీటి పైపులైన్లను శుద్ధి చేయనుంది.
►చిన్నపాటి వర్షం కురిస్తే చాలు వరద, మురుగునీరు ఉప్పొంగి బస్తీలు, కాలనీలను ముంచెత్తే ప్రాంతాల్లో రూ.2.03 కోట్లతో అత్యవసర బృందాలను రంగంలోకి దించి వారి ఆధ్వర్యంలో ప్రక్షాళన, నష్టనివారణ చర్యలను చేపట్టనుంది.
సమస్యలకు తక్షణ పరిష్కారం
ప్రీ మాన్‌సూన్ యాక్షన్‌ప్లాన్‌లో ప్రధానంగా ఉప్పొంగే మ్యాన్‌హోళ్లు, మురుగునీటి పైపులైన్లలో తక్షణం ప్రక్షాళన పనులు చేపట్టాలని నిర్ణయించాం. తరచూ సమస్యలు తలెత్తే ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్ధరణ, ప్రక్షాళన పనులు చేపడతాం. వినియోగదారుల నుంచి జలమండలి టోల్‌ఫ్రీ నెంబరు 155313తోపాటు ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా అందిన ఫిర్యాదులను 24 గంటల్లోగా పరిష్కరించాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం ప్రతి సెక్షన్ పరిధిలో సిల్ట్ ఛాంబర్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధచూపాలని అధికారులను ఆదేశించాం.
– ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్