
కడప అర్బన్: వైఎస్సార్ కడపలో అనంతపురం జిల్లావాసి మ్యాన్‌హోల్‌లో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా కదిరికి చెందిన బుక్కే శీనునాయక్ (45), బుక్కే నీలమ్మ దంపతులు. వీరికి ఇంటర్ చదివే కుమార్తె ఉంది. ఉపాధి కోసం వీరు కొన్నేళ్ల కిందట కడపకు వలస వెళ్లారు. శీనునాయక్ కోటిరెడ్డి సర్కిల్ సమీపంలోని బార్ అండ్ రెస్టారెంట్‌లో సప్లయర్‌గా పని చేస్తుండేవాడు.
అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసేందుకు భార్య నీలమ్మ నెలన్నర కిందట కదిరికి వెళ్లింది. కుమార్తె మదనపల్లెలో ఇంటర్ చదువుతోంది. శీనునాయక్ 20 రోజులుగా పనికి కూడా వెళ్లడం లేదు. రెండువారాల కిందట ఇంటి కరెంట్ బిల్లు తీసుకుని బయటకు వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్లలేదు. బీపీ షుగర్‌తో పాటు ఒక వైపు కన్ను కనిపించని శీనునాయక్ శుక్రవారం సూర్య ఆస్పత్రి సమీపాన మ్యాన్‌హోల్‌లో విగతజీవిగా కనిపించాడు. ప్రమాదవశాత్తు మ్యాన్‌హోల్‌లో పడి మృతి చెంది ఉండవచ్చని బంధువులు భావిస్తున్నారు. వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ సుధాకర్, ఏఎస్‌ఐ వలి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment