రూ.100 కోట్లతో బస్తీలకు నీళ్లు
త్వరలో డైలీ వాటర్..!
జలమండలి ఎండీ దానకిషోర్
సిటీబ్యూరో: నగరంలో మంచినీటి సరఫరా వ్యవస్థ అందుబాటులో లేని బస్తీలకు నూతనంగా ఏర్పాటు చేసిన పైప్‌లైన్ల ద్వారా రూ.100 కోట్లు ఖర్చుచేసి తాగునీరు అందిస్తామని జలమండలి ఎండీ ఎం.దాన కిషోర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు త్వరలో నగరంలో రోజూ మంచినీరు సరఫరా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. బుధవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో నిర్వహణ విభాగం అధికారులతో.. సిల్ట్ ఛాంబర్లు, వర్షాకాల ప్రణాళిక, రెవెన్యూ ఆదాయం తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జలమండలి ఏర్పాటై 28 సంవత్సరాలైనా.. నగరంలో చాలా బస్తీల్లో ఇప్పటికీ ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తోందన్నారు.ఆయా బస్తీల్లో నూతనంగా పైపులైన్లు ఏర్పాటుకు బోర్డు సిద్ధంగా ఉందని, దీంతో ట్యాంకర్ల వినియోగం గణనీయంగా తగ్గుతుందన్నారు.
మినీ జెట్టింగ్ యంత్రాలతో మురుగు ఉప్పొంగడం, చౌకేజీ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. వాణిజ్య భవనాలకు డ్రైనేజీ, నల్లా కనెక్షన్లు ఇవ్వాలంటే విధిగా సిల్ట్ ఛాంబర్లు నిర్మించుకోవాలన్నారు. సిల్ట్ ఛాంబర్ల నిర్మాణంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని, కొత్తగా నిర్మించిన 630 సిల్ట్ ఛాంబర్లకు ఈ వారంలో జియోట్యాగింగ్ చేయాలని ఆదేశించారు. ప్రతి డివిజన్లో నెలకు 40 సిల్ట్ ఛాంబర్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాల ప్రణాళిక, రెవెన్యూ ఆదాయం, వినియోగదారుల ఫిర్యాదులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన డైరెక్టర్లను అభినందించారు. ఈ సమావేశంలో జలమండలి ఆపరేషన్స్ డైరెక్టర్ అజ్మీరా కృష్ణ, పీ అండ్ ఏ డైరెక్టర్ ఎ. ప్రభాకర్, ప్రాజెక్టు–1 డైరెక్టర్ బి.విజయ్ కుమార్ రెడ్డి, సీజీఎమ్‌లు పి.రవి, ఎంబీ ప్రవీణ్ కుమార్, ఎస్.ఆనంద్ స్వరూప్, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు పాల్గొన్నారు.