సాక్షి, విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన గ్రామాలలో స్వచ్ఛమైన నీటి సరఫరాను అందించే లక్ష్యంతో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకోసం 5.92 కోట్ల రూపాయలను ఇన్ఫోసిస్ వెచ్చించనుంది. ఈ మేరకు విశాఖ జిల్లా నవ నిర్మాణ్ సమితి (విజెఎన్‌ఎన్‌ఎస్)తో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అవగాహనా ఒప్పందం (ఎంఓయు)కుదుర్చుకుంది. తద్వారా విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో రిమోట్ గిరిజన గ్రామాలకు త్రాగునీటి నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
గిరిజన గ్రామాల్లో నీటి నిర్వహణ పద్దతులు, శానిటైజేషన్ పద్దతులను ప్రమోట్ చేసేందుకు ఈ నిధులను కేటాయించనుంది. అన్ని గ్రామాల్లోనూ మంచి పారిశుద్ధ్య విధానాలను ప్రోత్సహించేందుకు, సమర్థవంతమైన నీటి నిర్వహణ వ్యవస్థలను రూపొందించడానికి రూ. 5.92 కోట్ల రూపాయలు వినియోగించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోని గిరిజన గ్రామాల్లో తాగునీటి సదుపాయాలను స్వచ్ఛంద సంస్థ అయిన విజెఎన్‌ఎన్‌ఎస్ అందిస్తోంది. విజెఎన్‌ఎన్‌ఎస్ భాగస్వామ్యంతో వంద గ్రామాల్లో గ్రావిటీ ఆధారిత నీటి సరఫరా పద్దతులను ఇన్ఫోసిస్ ఏర్పాటు చేయనుంది. పైప్‌లైన్ల ద్వారా సరఫరా చేయనున్న ఈ సురక్షిత నీటితో 40 వేల మందికి ప్రయోజనం కలగనుంది. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడటంతోపాటు నీటి వలన కలిగే వ్యాధులను నిరోధిస్తుందని ఫౌండేషన్ భావిస్తోంది.
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధా ముర్తి ఎంఓయు గురించి మాట్లాడుతూ, భారతదేశంలో త్రాగునీరు సరఫరా, పారిశుద్ధ్యం కీలకమైందన్నారు. మంచి పారిశుద్ధ్య విధానాలు, నీటి సరఫరా వ్యవస్థలను సమర్థవంతంగా నిర్వహణను ప్రోత్సహించేలా స్థానిక సంఘాలను శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ పథకంలో భాగంగా గ్రామ అభివృద్ధి నిధి పై స్థానికులకు అవగాహన కల్పించనున్నట్టు చెప్పారు.