ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ప్రతి ఏటా అందించే ‘ఇన్ఫోసిస్ ప్రైజ్’కు సంబంధించి కొత్త మార్గదర్శకాన్ని ప్రకటించింది. ఇన్ఫోఫిస్ ప్రైజ్ కోసం నామినేషన్ల వయోపరిమితిని 40 ఏళ్లలోపు కుదించినట్లు ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ బుధవారం వెల్లడించింది. మరింత మంది యువ ప్రతిభావంతులను పరిశోధనలో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ఇన్ఫోసిస్ ప్రైజ్ కోసం నామినేషన్ల వయోపరిమితిని 40 ఏళ్లలోపు తగ్గించినట్లు తెలిపింది. వారిలోని అసాధారణ ప్రతిభను కనిపెట్టి, వారి సేవలను సత్కరించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు పేర్కొంది.
అంతేగాక ఇప్పటివరకు సోషల్ సైన్సెస్ కేటగిరిలో భాగమైన ఎకానమిక్స్ కోసం ప్రత్యేక బహుమతి అందిచనున్నట్లు తెలిపింది. దీంతో బహుమతులు అందజేసే వర్గాల సంఖ్య ఏడుకు చేరుకుంది. కాగా ఫౌండేషన్ తరపున ఇప్పటి వరకు 92 మంది పరిశోధకులకు అవార్డులు ప్రదానం చేశారు.
కాగా ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఇంజినీర్లు సంబంధిత రంగాల్లో విశేష కృషి చేసినందుకుగాను పత్రి ఏటా ‘ఇన్ఫోసిస్ ప్రైజ్’ను అందిస్తోంది. ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్య వంటి ఆరు విభాగాల్లో కృషి చేసిన వారికి ఈ బహుమతిని ప్రదానం చేస్తారు. ప్రతి కేటగిరి నుంచి గెలుపొందిన విజేతలకు ఒక బంగారు పతకంతోపాటు, ప్రశంస పత్రం, లక్ష డాలర్లు( భారత కరెన్సీ ప్రకారం రూ. 83 లక్షల 50 వేలు), దానికి సమానమైన ప్రైజ్ పర్స్ అందిస్తారు.
ఇదిలా ఉండగాప్రొఫెసర్ అరవింద్, ప్రొఫెసర్ కౌశిక్ బసు, ప్రొఫెసర్ శ్రీనివాస్ కులకర్ణితో కూడిన జ్యూరీ ఇప్పటికే ‘ఇన్ఫోసిస్ ప్రైజ్ 2024’ కోసం నామినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ ఏడాది నవంబర్‌లో విజేతలను ప్రకటించే అవకాశం ఉంది. అవార్డు ప్రదానోత్సవం జనవరిలో జగనుంది.
మానవాళికి మేలు చేసే అత్యుత్తమ పరిశోధనలను గుర్తించడం, దేశంలోని యువ పరిశోధకులకు, ఔత్సాహిక శాస్త్రవేత్తలకు ఆదర్శంగా నిలవడమే ఇన్ఫోసిస్ ప్రైజ్ ప్రాథమిక లక్ష్యం. కాగా విదేశాలకు చెందిన విజేతలు బహుమతిని గెలుచుకునే సమయంలో తమకు నచ్చిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌లలో తగిన సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. దేశంలో గరిష్టంగా రెండు పర్యటనలలో 30 రోజులు గడవాల్సిందిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కోరుతుంది.
Comments
Please login to add a commentAdd a comment