ప్రశాంతంగా ‘అగ్ని పరీక్ష’
అందాల పోటీల్లో విశ్వసుందరిగా నిలిచిన సుందరాంగుల గురించి విన్నాం.. కుస్తీ పోటీల్లో కండబలం చూపించిన ధీరేశ్వరుల గురించి తెలుసు. మేమేం తీసిపోయాం అంటూ అన్నింటా సమ ఉజ్జీగా పోటీ పడుతున్నమగువల కథనాలూ చాలానే విన్నాం. కానీ ప్రస్తుతం ఒక వింత..కాదు కాదు, చాలెంజింగ్ అండ్ క్రియేటివ్ పోటీ ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. చైనాకు చెందిన ఒక మహిళ మొబైల్ ఫోన్ వాడకుండా ఎనిమిది గంటలు గడిపి లక్షరూపాయలకు పైగా బహుమతిని గెల్చుకుంది. ఇంట్రస్టింగ్‌గా ఉంది కదా.. అదేంటి అంటే..!
చాంగ్‌కింగ్ మునిసిపాలిటీలోని షాపింగ్ సెంటర్‌లో ఈ ప్రత్యేకమైన పోటీని నిర్వహించారు. ప్రశాంతంగా, ఎలాంటి ఆందోళన లేకుండా ఎనిమిది గంటల పాటు మొబైల్ ఫోన్ వాడకుండా గడపాలి. ఈ పోటీలో నైరుతి చైనాకు చెందిన ఒక మహిళ 10,000 యువాన్‌లను (సుమారు రూ.1,16,000) గెలుచుకుని వార్తల్లో నిలిచింది.
నవంబరు 29న జరిగిన ఈ పోటీలో 100 మంది దరఖాస్తుదారులలో పది మంది పోటీదారులు పాల్గొన్నారు. మొబైల్ ఫోన్‌లు లేదా ఐప్యాడ్‌లు లేదా ల్యాప్‌టాప్‌ల వంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు ప్రాప్యత లేకుండా, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బెడ్‌పై ఎనిమిది గంటలు గడపాలి. కంపోజ్డ్ గా, రిలాక్స్‌డ్‌గా ఉంటూ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్( స్మార్ట్‌ఫోన్, ఐప్యాడ్, ల్యాప్‌టాప్) వాడాలన్న ఉత్సుకత లేకుండా గడపాలి.
నిబంధనలు, కత్తిమీద సామే
జిము న్యూస్ రిపోర్టుల ప్రకారం, నిబంధనలూ కఠినంగా ఉన్నాయి. ఈవెంట్‌కు ముందు పోటీదారులు తమ మొబైల్ ఫోన్‌లను సరెండర్ చేయాల్సి ఉంటుంది . అత్యవసర పరిస్థితుల్లో పాత మొబైల్ మోడల్‌లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ఎమర్జెన్సీ ఫోన్‌లను కుటుంబ సభ్యులను సంప్రదించడానికి మాత్రమే ఉపయోగించాలి. అదనంగా, పాల్గొనేవారు ఎక్కువ సమయం పడుకునే ఉండాలి. టాయిలెట్ బ్రేక్ కూడా ఐదు నిమిషాలు మాత్రమే. అంతేకాదు ఈ ఎనిమిది గంటలు ఎంచక్కా బజ్జుంటాను అంటే అస్సలు కుదరదు. పోటీదారులు గాఢ నిద్రలోకి జారుకోవడం నిషేధం.
పాల్గొనేవారి ఆహారపానీయలు అందిస్తారు. వారి మానసిక ధైర్యాన్ని పరీక్షించే ప్రయత్నంలో, నిర్వాహకులు మణికట్టు పట్టీలను ఉపయోగించి నిద్ర , ఆందోళన స్థాయిలను పర్యవేక్షించారు. ఈ పోటీలు శారీరక బలం కన్నా, మానసిక బలం, ఓర్పు ఎక్కువ అవసరం. అయితే పోటీదారుల్లో చాలామంది పుస్తకాలు, చదువుతా, విశ్రాంతిగా గడిపారు. (హలేబీడు ఉలి చెక్కిన గ్రంథం, ఆసక్తికర విషయాలు)
100కి 88.99 స్కోరు చేసి, ఫైనాన్స్ సంస్థలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఒక మహిళ విజేతగా నిలిచింది. మంచం మీదే, ఎలాంటి ఆందోళన లేకుండా, నిద్రపోకుండా ప్రశాంతంగా గడిపిందట. పోటీల్లో పాల్గొన్నటి దుస్తుల ఆధారంగా "పైజామా సోదరి" అనే మారుపేరుతో సంచలనం రేపుతోంది. సంపాదించింది. పరుపుల కంపెనీ ఈ పోటీని స్పాన్సర్ చేసింది. ఈ పోటీపెట్టడంలో కంపెనీ ఉద్దేశ్యం ఏంటి అనేది స్పష్టత లేదు కానీ నో మొబైల్-ఫోన్ ఛాలెంజ్ చైనా అంతటా వైరల్‌గా మారింది.
నిముష నిమిషానికీ మొబైల్ స్క్రీన్‌ను అన్‌లాక్ చేసే మొబైల్ యూజర్లకు ఇది నిజంగానే అగ్ని పరీక్షే. ఓసోసి.. అదెంత పని అనుకుంటున్నారా? అయితే మీరూ ప్రయత్నించండి. బోలెడంత ప్రశాంతత, ఆరోగ్యం మీ సొంతమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment