Water supply system
-
విజెఎన్ఎన్ఎస్తో ఇన్ఫీ ఫౌండేషన్ ఎంఓయు
సాక్షి, విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన గ్రామాలలో స్వచ్ఛమైన నీటి సరఫరాను అందించే లక్ష్యంతో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకోసం 5.92 కోట్ల రూపాయలను ఇన్ఫోసిస్ వెచ్చించనుంది. ఈ మేరకు విశాఖ జిల్లా నవ నిర్మాణ్ సమితి (విజెఎన్ఎన్ఎస్)తో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అవగాహనా ఒప్పందం (ఎంఓయు)కుదుర్చుకుంది. తద్వారా విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో రిమోట్ గిరిజన గ్రామాలకు త్రాగునీటి నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గిరిజన గ్రామాల్లో నీటి నిర్వహణ పద్దతులు, శానిటైజేషన్ పద్దతులను ప్రమోట్ చేసేందుకు ఈ నిధులను కేటాయించనుంది. అన్ని గ్రామాల్లోనూ మంచి పారిశుద్ధ్య విధానాలను ప్రోత్సహించేందుకు, సమర్థవంతమైన నీటి నిర్వహణ వ్యవస్థలను రూపొందించడానికి రూ. 5.92 కోట్ల రూపాయలు వినియోగించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోని గిరిజన గ్రామాల్లో తాగునీటి సదుపాయాలను స్వచ్ఛంద సంస్థ అయిన విజెఎన్ఎన్ఎస్ అందిస్తోంది. విజెఎన్ఎన్ఎస్ భాగస్వామ్యంతో వంద గ్రామాల్లో గ్రావిటీ ఆధారిత నీటి సరఫరా పద్దతులను ఇన్ఫోసిస్ ఏర్పాటు చేయనుంది. పైప్లైన్ల ద్వారా సరఫరా చేయనున్న ఈ సురక్షిత నీటితో 40 వేల మందికి ప్రయోజనం కలగనుంది. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడటంతోపాటు నీటి వలన కలిగే వ్యాధులను నిరోధిస్తుందని ఫౌండేషన్ భావిస్తోంది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధా ముర్తి ఎంఓయు గురించి మాట్లాడుతూ, భారతదేశంలో త్రాగునీరు సరఫరా, పారిశుద్ధ్యం కీలకమైందన్నారు. మంచి పారిశుద్ధ్య విధానాలు, నీటి సరఫరా వ్యవస్థలను సమర్థవంతంగా నిర్వహణను ప్రోత్సహించేలా స్థానిక సంఘాలను శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ పథకంలో భాగంగా గ్రామ అభివృద్ధి నిధి పై స్థానికులకు అవగాహన కల్పించనున్నట్టు చెప్పారు. -
రూ.100 కోట్లతో బస్తీలకు నీళ్లు
త్వరలో డైలీ వాటర్..! జలమండలి ఎండీ దానకిషోర్ సిటీబ్యూరో: నగరంలో మంచినీటి సరఫరా వ్యవస్థ అందుబాటులో లేని బస్తీలకు నూతనంగా ఏర్పాటు చేసిన పైప్లైన్ల ద్వారా రూ.100 కోట్లు ఖర్చుచేసి తాగునీరు అందిస్తామని జలమండలి ఎండీ ఎం.దాన కిషోర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు త్వరలో నగరంలో రోజూ మంచినీరు సరఫరా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. బుధవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో నిర్వహణ విభాగం అధికారులతో.. సిల్ట్ ఛాంబర్లు, వర్షాకాల ప్రణాళిక, రెవెన్యూ ఆదాయం తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జలమండలి ఏర్పాటై 28 సంవత్సరాలైనా.. నగరంలో చాలా బస్తీల్లో ఇప్పటికీ ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తోందన్నారు.ఆయా బస్తీల్లో నూతనంగా పైపులైన్లు ఏర్పాటుకు బోర్డు సిద్ధంగా ఉందని, దీంతో ట్యాంకర్ల వినియోగం గణనీయంగా తగ్గుతుందన్నారు. మినీ జెట్టింగ్ యంత్రాలతో మురుగు ఉప్పొంగడం, చౌకేజీ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. వాణిజ్య భవనాలకు డ్రైనేజీ, నల్లా కనెక్షన్లు ఇవ్వాలంటే విధిగా సిల్ట్ ఛాంబర్లు నిర్మించుకోవాలన్నారు. సిల్ట్ ఛాంబర్ల నిర్మాణంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని, కొత్తగా నిర్మించిన 630 సిల్ట్ ఛాంబర్లకు ఈ వారంలో జియోట్యాగింగ్ చేయాలని ఆదేశించారు. ప్రతి డివిజన్లో నెలకు 40 సిల్ట్ ఛాంబర్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాల ప్రణాళిక, రెవెన్యూ ఆదాయం, వినియోగదారుల ఫిర్యాదులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన డైరెక్టర్లను అభినందించారు. ఈ సమావేశంలో జలమండలి ఆపరేషన్స్ డైరెక్టర్ అజ్మీరా కృష్ణ, పీ అండ్ ఏ డైరెక్టర్ ఎ. ప్రభాకర్, ప్రాజెక్టు–1 డైరెక్టర్ బి.విజయ్ కుమార్ రెడ్డి, సీజీఎమ్‌లు పి.రవి, ఎంబీ ప్రవీణ్ కుమార్, ఎస్.ఆనంద్ స్వరూప్, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు పాల్గొన్నారు. -
అంకెల్లో హైదరాబాద్
డ్రైనేజీ, మంచినీటి వ్యవస్థల స్వరూపం ► రూ.90 కోట్లు - నెలకు నీటి బిల్లుల ద్వారా జలమండలికి వస్తున్న ఆదాయం ► 4,800- జలమండలి బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులు ► 688.20 - చదరపు కిలోమీటర్లు గ్రేటర్లో అందుబాటులో ఉన్న మంచినీటి సరఫరా వ్యవస్థ ► 518.90- చదరపు కిలోమీటర్లు శివారు ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న మంచినీటి సరఫరా వ్యవస్థ ► 7,980 - చదరపుకిలోమీటర్లు సిటీ నలుమూలలకు నీటిని సరఫరా చేసే డిస్ట్రిబ్యూటరీ పైపులైన్లు ► 612 కిలోమీటర్లు - నగరంలో 600 ఎంఎం డయా ప్రధాన పైపులైన్లతో అందుబాటులో ఉన డ్రైనేజీ వ్యవస్థ ► 4,050 కిలోమీటర్లు - వీధుల్లో మురుగునీటి పారుదలకు అందుబాటులో ఉన్న లేటరర్స్, సబ్‌మెయిన్స్ ► 1.85 లక్షలు-సిటీలోని మ్యాన్‌హోళ్లు ► 5- నగరంలోని మురుగునీటి శుద్ధి కేంద్రాలు ► 750 మిలియన్ లీటర్లు - రోజు వారీగా శుద్ధి చేసే మురుగు నీరు ► 169.30 చదరపు కిలోమీటర్లు - గ్రేటర్ కార్పొరేషన్‌గా ఉన్నప్పటి మంచినీటి సరఫరా వ్యవస్థ ► 900 చదరపు కిలోమీటర్లు - నగరానికి పలు జలాశయాల నుంచి నీటిని తరలించే ప్రధాన పైపులైన్లు