ఇటు సూరీడు.. అటు సర్కారు.. | Water pumped with electricity bills | Sakshi
Sakshi News home page

ఆ రెండే దిక్కు!

Published Tue, Dec 12 2017 8:34 AM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM

Water pumped with electricity bills - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: మహానగర తాగునీటి అవసరాలు తీర్చే జలమండలి విద్యుత్‌ చార్జీల భారంతో కుదేలవుతోంది. ప్రస్తుతం పరిశ్రమల విభాగం కింద కరెంట్‌ చార్జీలతో బోర్డు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే రూ.150 కోట్ల పెండింగ్‌ విద్యుత్‌ బిల్లులు చెల్లించలేక బోర్డు ఆపసోపాలు పడుతోన్న విషయం విదితమే. దీనికి తోడు ప్రతినెలా రూ.68 కోట్ల మేర విద్యుత్‌ బిల్లులు చెల్లించడం గుదిబండగా మారింది. నవంబరు నెలలో ఏకంగా రూ.80 కోట్ల బిల్లు రావడంతో బోర్డు వర్గాలు ఇంత మొత్తం ఎలా చెల్లించాలో తెలియక తలలు పట్టుకుంటున్నాయి. ఈ విద్యుత్‌ భారం నుంచి బయట పడేందుకు సౌరవిద్యుత్‌ వినియోగించే అంశంపై జలమండలి దృష్టిసారిస్తోంది.

ఇక వందల కిలోమీటర్ల దూరం నుంచి గ్రేటర్‌కు తరలిస్తోన్న కృష్ణా, గోదావరి జలాల పంపింగ్, స్టోరేజీ రిజర్వాయర్ల నుంచి 9.65 లక్షల నల్లా కనెక్షన్లకు నీటి సరఫరాకు నెలకు సుమారు 100 మెగావాట్ల విద్యుత్‌ అవసరం అవుతోంది. ఈ స్థాయిలో సౌర విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లు నెలకొల్పేందుకు ఏకమొత్తంలో దాదాపు రూ.600 కోట్లు అవసరమవుతాయని లెక్క తేల్చింది. సౌర విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు జలమండలికి సంబంధించి కృష్ణా, గోదావరి జలాల నీటిశుద్ధి, పంపింగ్‌ కేంద్రాల వద్ద సుమారు 989 ఎకరాల విస్తీర్ణంలో భూములుండడం గమనార్హం. అయితే ఈ ప్రాజెక్టుకయ్యే నిధులను రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రైవేటు ఆర్థిక సంస్థల నుంచి రుణంగా సేకరిస్తేనే ఈ ప్రాజెక్టు సాకారమవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కనీసం యాన్యుటీ విధానంలోనైనా చేపడితే బోర్డు నష్టాల నుంచి గట్టెక్కే అవకాశముంది.   

తాగునీటికి కరెంట్‌ బిల్లుల షాక్‌.. 
జలమండలికి నెలవారీగా నీటిబిల్లుల వసూలు, ట్యాంకర్‌ నీళ్ల సరఫరా, నూతన నల్లా కనెక్షన్ల జారీతో రెవెన్యూ ఆదాయం కనాకష్టంగా రూ.100 కోట్ల వరకు సమకూరుతోంది. కానీ నెలవారీ వ్యయం రూ.112 కోట్లు దాటుతోంది. ప్రధానంగా నెలవారీగా విద్యుత్‌ బిల్లుల రూపేణా రూ.68 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. మిగతా మొత్తంలో ఉద్యోగుల జీతభత్యాలు, గతంలో తీసుకున్న రుణాలకు సంబంధించిన వాయిదాలు, వడ్డీ చెల్లింపులు, నిర్వహణ వ్యయాలు, మరమ్మతులు, నీటిశుద్ధి తదితర ప్రక్రియలకు సుమారు రూ.44 కోట్లు వ్యయమవుతోంది. ఇలా ప్రతినెలా బోర్డు రూ.10 నుంచి రూ.12 కోట్ల లోటుతో నెట్టుకొస్తోంది. దీనికి తోడు గత కొన్ని నెలలుగా రూ.150 కోట్ల మేర విద్యుత్‌ బిల్లులు కొండలా పేరుకుపోవడంతో బోర్డు ఖజానాపై భారీ భారం పడినట్టయింది. 

ఖజానాపై మోయలేని భారం 
ఈ ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వం జలమండలికి పేరుకు రూ.1,420 కోట్లు కేటాయింపులు చేసినా.. రెండో త్రైమాసికానికి బోర్డుకు అందిన నిధులు కేవలం రూ.367 కోట్లే. ఇందులోనూ రూ.167 కోట్లు రుణ వాయిదాల చెల్లింపునకే సరిపోయాయి. మిగతా బడ్జెటరీ నిధుల విడుదలపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండడం గమనార్హం. పులిమీద పుట్రలా హడ్కో సంస్థ నుంచి గతంలో జలమండలి తీసుకున్న రూ.700 కోట్ల రుణాన్ని గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఏకమొత్తంగా ఇతర అవసరాలకు దారి మళ్లించింది. ఇందులో ఏడాదిగా రూ.300 కోట్లు మాత్రమే బోర్డుకు చెల్లించింది. మిగతా రూ.400 కోట్లు చెల్లించే విషయంలో రిక్తహస్తం చూపించింది. దీంతో కీలకమైన తాగునీటి పథకాల పూర్తికి నిధుల లేమి శాపంగా పరిణమిస్తుండడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement