జల ధన యోగం
రెట్టింపు కానున్న జలమండలి పరిథి
సాకారమైతే నల్లా కనెక్షన్లు, ఆదాయం పెరిగే ఛాన్స్
సరఫరా నష్టాలపైనే ఆందోళన
గుదిబండగా విద్యుత్ బిల్లులు
సిటీబ్యూరో: గ్రేటర్ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు జలమండలి స్వరూపాన్ని పూర్తిగా మార్చనుంది. దీని పరిధి రెట్టింపు కానుంది. ప్రస్తుతం ప్రధాన నగరం, శివార్లు కలిపి 700 చదరపు కిలోమీటర్ల పరిధిలో జలమండలి పైప్‌లైన్ నెట్‌వర్క్ ఉంది. గ్రిడ్ సాకారమైతే ఇది సుమారు 1400 చదరపు కిలోమీటర్లకు విస్తరించే అవకాశాలు ఉన్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఉన్న 8.34 లక్షల నల్లా కనెక్షన్ల సంఖ్య దాదాపు రెట్టింపయ్యే అవకాశాలున్నట్లు అధికారుల అంచనా. మహా నగర పరిధిలో 91 లక్షల జనాభాకు నిత్యం 340 మిలియన్ గ్యాలన్ల నీటిని బోర్డు సరఫరా చేస్తోంది. పరిధి పెరిగిన తరవాత 2015 నాటికి 491 మిలియన్ గ్యాలన్లు.. 2021 నాటికి 1.10 కోట్ల జనాభాకు 594.65 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనాలు సిద్ధం చేస్తున్నారు.
రెట్టింపు కానున్న నల్లాలు... ఆదాయం
ప్రస్తుతం జలమండలి పరిధిలో 8.34 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. నాలుగేళ్లలో గ్రిడ్ పూర్తి చేస్తే శివార్లతో కలిపి నల్లాల సంఖ్య దాదాపు 16.50 లక్షలకు చేరుకునే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం నీటి బిల్లులు, సీవరేజి సెస్, నూతన నల్లా కనెక్షన్ల ద్వారా నెలకు రూ.93 కోట్ల ఆదాయం లభిస్తోంది. 2021 నాటికి అది రూ.186 కోట్లకు చేరడం తథ్యమని బోర్డు వర్గాలు లెక్కలు కడుతున్నాయి.
నష్టాల పైనే ఆందోళన
పరిధి, ఆదాయం, కనెక్షన్ల సంఖ్య రెట్టింపు కావడం వరకు బాగానే ఉన్నా... నీటి సరఫరా నష్టాలు బోర్డుకు దడ పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం జలమండలి రోజువారీ 340 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తున్నా.. అందులో సరఫరా నష్టాలు పోను వాస్తవ సరఫరా కనాకష్టంగా 200 మిలియన్ గ్యాలన్లు మించడం లేదు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం సరఫరా నష్టాలు 20 శాతం లోపలే ఉండాలి. నగరంలో అంతకు రెట్టింపు స్థాయిలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. భవిష్యత్‌లోనూ ఇదే స్థాయిలో నష్టాలు ఉంటే జనం దాహార్తి అరకొరగానే తీరే పరిస్థితులు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీఎస్‌ఎం టెక్నాలజీ ఆధారంగా పనిచేసే సూపర్‌వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్(స్కాడా) విధానంతో ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు పైప్‌లైన్లు, రిజర్వాయర్ల నీటిని, సరఫరా చేస్తున్న నీటిని శాస్త్రీయంగా లెక్కించడంతో పాటు నీటిచౌర్యం, లీకేజీలను అరికట్టాలని సూచిస్తున్నారు.
విద్యుత్ భారం తడిసి మోపెడు
ఇక పరిధి పెరగడంతో పాటే విద్యుత్ అవసరాలు కూడా గణనీయంగా పెరగనున్నాయి. ప్రస్తుతం నెలకు రూ.45 కోట్లు విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్న బోర్డు కృష్ణా మూడో దశ, గోదావరి మంచినీటి పథకాల పూర్తితో నెలకు మరో రూ.45 కోట్ల మేర అదనంగా వెచ్చించాల్సిన పరిస్థితి రానుంది. ఇప్పటికే రూ.250 కోట్ల మేర విద్యుత్ బకాయిలు పేరుకుపోయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ నీటి సరఫరా విభాగానికి ఇచ్చిన తరహాలో విద్యుత్ చార్జీలు తగ్గిస్తేనే గ్రిడ్ సాకారమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.