కరెంటు చార్జీల పెంపు లేదు | No increase in electricity charges in Telangana | Sakshi
Sakshi News home page

కరెంటు చార్జీల పెంపు లేదు

Published Tue, Jan 14 2025 5:59 AM | Last Updated on Tue, Jan 14 2025 5:59 AM

No increase in electricity charges in Telangana

ఇటీవల సీఎం, డిప్యూటీ సీఎం నిర్వహించిన సమీక్షలో నిర్ణయం

ప్రస్తుత చార్జీలే 2025–26 లోనూ కొనసాగించాలని ఆదేశం

వారంలో ఈఆర్సీకి ఏఆర్‌ఆర్, టారిఫ్‌ ప్రతిపాదనలు

రూ.57,448 కోట్లకు చేరిన డిస్కంల మొత్తం నష్టాలు

డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టీకరణ

వచ్చే ఏడాదిలో చార్జీలు పెంచాలన్న విద్యుత్‌ సంస్థల విజ్ఞప్తికి నో

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. చార్జీలు పెంచాలని రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం) లు చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. ప్రస్తుత విద్యుత్‌ చార్జీలనే వచ్చే ఆర్థిక సంవత్సరం 2025–26లో యథా తథంగా కొనసాగించాలని స్పష్టం చేసింది. విద్యుత్‌ చార్జీల పెంపును ప్రతిపాదించకుండానే 2025–26కి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్‌), టారిఫ్‌ ప్రతిపాదనలను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి సమర్పించేందుకు డిస్కంలకు అనుమతి నిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత విద్యుత్‌ చార్జీలనే 2025–26లోనూ కొనసాగించాలని ప్రతిపాదిస్తూ వారం రోజుల్లో ఈఆర్సీకి ఏఆర్‌ఆర్, టారిఫ్‌ ప్రతిపాదనలను సమర్పిస్తామని డిస్కంల అధికారవర్గాలు వెల్లడించాయి.

నష్టాల ఊబిలో డిస్కంలు..
ఉత్తర/దక్షిణ డిస్కంలు గత ఆర్థిక సంవత్సరం 2023–24లో రూ.6,299.29 కోట్ల కొత్త నష్టాలను మూటగట్టుకోగా, మొత్తం నష్టాలు రూ.57,448 కోట్లకు ఎగబాకాయి. ఒక్క టీజీఎస్పీడీసీఎల్‌ నష్టాలే రూ.39,692 కోట్లకు చేరగా, టీజీఎన్పీడీసీఎల్‌  రూ.17,756 కోట్ల నష్టాల్లో ఉంది. కాగా విద్యుత్‌ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి గత శనివారం ఆ శాఖపై నిర్వహించిన సమీక్షలో.. డిస్కంల నష్టాలను అధికారులు ప్రస్తావించారు.

విద్యుత్‌ చార్జీల పెంపు అనివార్యంగా మారిందని వివరించారు. గృహాలు మినహాయించి కేవలం పారిశ్రామిక, ఇతర వాణిజ్య కేటగిరీల విద్యుత్‌ చార్జీల పెంపునకు అనుమతించాలని కోరినట్టు తెలిసింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి విద్యుత్‌ చార్జీల పెంపు జోలికి వెళ్లవద్దని సీఎం, డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుత చార్జీలనే వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొనసాగిస్తామని ప్రతిపాదిస్తూ ఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించాలని సీఎం ఆదేశించారని అధికార వర్గాలు తెలిపాయి. వచ్చే శనివారం ఈఆర్సీకి ఈ మేరకు ఏఆర్‌ఆర్, టారిఫ్‌ ప్రతిపాదనలను సమర్పించే అవకాశముందని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు.

విద్యుత్‌ సబ్సిడీ పెంచక తప్పదు
ప్రస్తుత విద్యుత్‌ చార్జీలతోనే వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్‌ సర ఫరా చేస్తే డిస్కంలకు కొత్తగా వచ్చే నష్టాలను డిస్కంలు అంచనా వేసి ఈఆర్సీకి సమర్పించే ప్రతిపాదనల్లో ఆర్థిక లోటుగా చూపించనున్నాయి. ఈఆర్సీ పరిశీలించి ఆమోదించిన నష్టాల మొత్తాన్ని డిస్కంలకు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తేనే విద్యుత్‌ చార్జీల పెంపు భారం నుంచి ప్రజలకు ఉపశమనం లభించనుంది.

 గతేడాది నవంబర్‌ నుంచి ప్రస్తుత ఏడాది మార్చి 31 వరకు రాష్ట్రంలో రూ.1,200 కోట్ల విద్యుత్‌ చార్జీల పెంపునకు అనుమతి కోరుతూ డిస్కంలు గతేడాది చివర్లో ప్రతిపాదనలు సమర్పించగా, ఈఆర్సీ అనుమతించకపోవడంతో చార్జీల పెంపు భారం నుంచి ఉపశమనం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ సబ్సిడీలను రూ.11,499 కోట్లకు పెంచేందుకు అంగీకరించడంతో ఇది సాధ్యమైంది. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్‌ సబ్సిడీలను ప్రభుత్వం మరింతగా పెంచితేనే ప్రజలపై చార్జీల పెంపు భారం ఉండదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement