Greater water grid project
-
వి‘నూతనం’గా..
తెలంగాణ చరిత్రలో 2014ది ప్రత్యేక స్థానమైతే... 2015 సంవత్సరం గ్రేటర్ సిటీకి మరచిపోలేని జ్ఞాపకంగా మిగల్చాలనేది ప్రభుత్వ యోచన. ఆ దిశగా ఒక్కో అడుగూ ముందుకేసి... హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనేది సంకల్పం. ప్రస్తుతం ఉన్న పథకాలు... కార్యక్రమాలకు... మరికొన్నిటిని చేర్చి...నవశకం నిర్మించాలనేది లక్ష్యం. ఆ అడుగులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ⇒ ప్రణాళికతో కొత్త ఏడాదిలోకి.. ⇒విశ్వనగరం దిశగా అడుగులు ⇒ప్రాధాన్య క్రమంలో పనులు ⇒అధికార యంత్రాంగం సిద్ధం సాక్షి, సిటీబ్యూరో: ఎన్నో ఏళ్ల పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర చరిత్రలో 2014వ సంవత్సరానిది ప్రత్యేక స్థానం. అందుకు అనుగుణంగానే కొత్త ప్రభుత్వం గ్రేటర్ నగరంలో విభిన్న పథకాలు... వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చు ట్టాలని భావించింది. అధికార యంత్రాంగమూ ఆ దిశగా సిద్ధమైంది. వాటిలో కొన్నిటికి శ్రీకారం చుట్టగా... మరికొన్ని కార్యరూపం దాల్చాల్సి ఉంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామని సీఎం చెబుతున్నారు.ఇవన్నీ కొత్త సంవత్సరం (2015)లో సాకారమయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఈ పనులను జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ మంగళవారం వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి... ఆధునిక రహదారులు ప్రభుత్వ తొలి ప్రాధాన్యం రహదారులు. అంతర్జాతీయ ప్రమాణాలతో వీటిని నిర్మించనున్నారు. వాహనాలు గమ్యస్థానం చేరే వరకూ ఎక్కడా ఆటంకాలూ లేకుండా చూడాలనేది లక్ష్యం. ట్రాఫిక్ ఇబ్బందులు, సిగ్నల్ ఆటంకాలు లేకుండా వీలైనన్ని మార్గాల్లో రహదారులను అభివృద్ధి పరచాలనేది లక్ష్యం. రోడ్లకు ఇరువైపులా వరదనీరు వెళ్లే మార్గాలు...పచ్చదనం... దారి పొడవునా ఎల్ఈడీ వెలుగులు. ఫ్లై ఓవర్లు, ఆర్ఓబీలు, గ్రేడ్ సెపరేటర్లు... స్పైరల్ మార్గాలు, స్కై వేల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొత్తం వెయ్యి కిలోమీటర్లలో నిర్మించాలనేది లక్ష్యం. తొలిదశలో 280 కి.మీ.లు పూర్తి చేయాలని నిర్ణయించారు. నాలాల ఆధునికీకరణ ఎంతో కాలంగా ఊరిస్తున్న నాలాల పనులు ముందుకు సాగేందుకు శ్రద్ధ చూపుతామంటున్నారు. నాలాల ప్రదేశాల్లోని ఆక్రమణల తొలగింపు, రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, ఎప్పటికప్పుడు శుభ్రం చేసి వాననీరు సాఫీగా వెళ్లేలా చేసేందుకు నిర్ణయం. వంద కిలోమీటర్ల మేర వీటిని ఆధునీకరించాలనేది లక్ష్యం. స్లమ్ ఫ్రీ సిటీ ముఖ్యమంత్రి కలలకు అనుగుణంగా వీలైనన్ని బస్తీల్లో రెండు పడక గదులు, హాల్, కిచెన్లతో కూడిన ఇళ్ల నిర్మాణం. స్లమ్స్‌లో రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాల వంటి సదుపాయాల కల్పన. స్లమ్స్‌లోని స్థితిగతులను అంచనా వేసేందుకు కన్సల్టెంట్ సంస్థ బృందాలు ఇప్పటికే సర్వే జరుపుతున్నాయి. ఐడీహెచ్ కాలనీని స్లమ్ఫ్రీగా చేయడంతోపాటు దానిని మోడల్‌గా చూపుతూ మిగతా వాటినీ అభివృద్ధి చేయాలనేది లక్ష్యం. చెరువుల పరిరక్షణ చెరువులు, ప్రభుత్వ ఖాళీ స్థలాల పరిరక్షణ. పచ్చదనం పెంపు కార్యక్రమాలు. చెరువుల్లోని అక్రమ నిర్మాణాల తొలగింపుతో పాటు సుందర, పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దాలనేది ప్రాధాన్యాంశాల్లో మరొకటి. హరితహారంలో భాగంగా కోటి మొక్కలు నాటడం లక్ష్యం. పేదలకు జీవనోపాధి పేదలకు జీవనోపాధి, సంక్షేమ కార్యక్రమాలపై శ్రద్ధ. యువ త ఉపాధి కోసం డ్రైవర్‌కమ్ ఓనర్ పథకం కొనసాగింపు, ఉద్యోగాల కల్పనకు జాబ్‌మేళాలు, ఈ-వ్యాన్,ఈ-జోన్ల ద్వారా దరఖాస్తుల స్వీకరణ. వృద్ధుల ‘ఆసరా’పై ప్రత్యేక శ్రద్ధ. జీహెచ్ఎంసీ అందిస్తున్న ఆసరా కార్డుల ప్రయోజనాల సమీక్షతో పాటు వారికి ఉపయుక్తమైన కార్యక్రమాల అమలుకు కృషి. రూ. 5కే భోజనాన్ని 50 కేంద్రాలకు విస్తరణ 350 మంది నోడల్ అధికారులతో ‘స్పెషల్ డ్రైవ్’ రహదారులు, వీధి దీపాలు, పారిశుద్ధ్య సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు 350 మంది నోడల్ ఆఫీసర్లను నియమిస్తున్నట్లు స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ అంశాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి జనవరి 1 నుంచి 45 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. వీటితో పాటు ఆస్తిపన్ను వసూళ్ల వంటి వాటిపై దృష్టి పెడతామని చెప్పారు. స్థానిక సంఘాలే కీలకం జీహెచ్ఎంసీలో పాలక మండలి... స్టాండింగ్ కమిటీ లేవు. ప్రజలు తమకు ఏ పనులు కావాలన్నా అధికారులను సంప్రదించాల్సిందే. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలను వీలైనంత వరకు స్థానిక సంఘాల ద్వారానే పరిష్కరించాలని జీహెచ్ఎంసీ యోచిస్తోంది. అందులో భాగంగా రూ.10 లక్షల లోపు పనులను స్థానిక బస్తీ సంఘాలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, అపార్ట్మెంట్ అసోసియేషన్లకు అప్పగించనున్నారు. పారిశుద్ధ్యం, తాగునీరు, డ్రైనేజీ వంటి సమస్యలను జీహెచ్ఎంసీ దృష్టికి తెచ్చి పరిష్కరించేలా ఈ సంఘాలు సమన్వయ బాధ్యతలు నిర్వర్తిస్తాయి. జలమండలిలో... సాక్షి,సిటీబ్యూరో: కృష్ణా మూడోదశ, గోదావరి మంచినీటి పథకాలను పూర్తి చేసి... గ్రేటర్ దాహార్తిని తీర్చడమే ఈ ఏడాదిలో జలమండలి లక్ష్యమని అధికారులు తెలిపారు. కృష్ణా మూడోదశను 2015 మార్చి చివరి నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. గోదావరి పథకాన్ని జూన్ 2015 నాటికి పూర్తి చేస్తామన్నారు. మూడో దశ ద్వారా నగరానికి నిత్యం 90 మిలియన్ గ్యాలన్లు, గోదావరి మొదటి దశ ద్వారా172 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలిస్తామని చెప్పారు. ఈ రెండు పథకాలతో గ్రేటర్లో విలీనమైన 11 శివారు మున్సిపాల్టీల పరిధిలోని కాలనీల దాహార్తిని తీర్చడమే బోర్డు సిటీజనులకు ఇచ్చే నూతన సంవత్సర కానుకని పేర్కొన్నారు. మరోవైపు గ్రేటర్ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు నూతన సంవత్సరంలో శ్రీకారం చుట్టడం ద్వారా రానున్న నాలుగేళ్లలో మహానగర పరిధిలో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్లు ఇస్తామని హామీ ఇస్తున్నారు. -
జల ధన యోగం
రెట్టింపు కానున్న జలమండలి పరిథి సాకారమైతే నల్లా కనెక్షన్లు, ఆదాయం పెరిగే ఛాన్స్ సరఫరా నష్టాలపైనే ఆందోళన గుదిబండగా విద్యుత్ బిల్లులు సిటీబ్యూరో: గ్రేటర్ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు జలమండలి స్వరూపాన్ని పూర్తిగా మార్చనుంది. దీని పరిధి రెట్టింపు కానుంది. ప్రస్తుతం ప్రధాన నగరం, శివార్లు కలిపి 700 చదరపు కిలోమీటర్ల పరిధిలో జలమండలి పైప్‌లైన్ నెట్వర్క్ ఉంది. గ్రిడ్ సాకారమైతే ఇది సుమారు 1400 చదరపు కిలోమీటర్లకు విస్తరించే అవకాశాలు ఉన్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఉన్న 8.34 లక్షల నల్లా కనెక్షన్ల సంఖ్య దాదాపు రెట్టింపయ్యే అవకాశాలున్నట్లు అధికారుల అంచనా. మహా నగర పరిధిలో 91 లక్షల జనాభాకు నిత్యం 340 మిలియన్ గ్యాలన్ల నీటిని బోర్డు సరఫరా చేస్తోంది. పరిధి పెరిగిన తరవాత 2015 నాటికి 491 మిలియన్ గ్యాలన్లు.. 2021 నాటికి 1.10 కోట్ల జనాభాకు 594.65 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనాలు సిద్ధం చేస్తున్నారు. రెట్టింపు కానున్న నల్లాలు... ఆదాయం ప్రస్తుతం జలమండలి పరిధిలో 8.34 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. నాలుగేళ్లలో గ్రిడ్ పూర్తి చేస్తే శివార్లతో కలిపి నల్లాల సంఖ్య దాదాపు 16.50 లక్షలకు చేరుకునే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం నీటి బిల్లులు, సీవరేజి సెస్, నూతన నల్లా కనెక్షన్ల ద్వారా నెలకు రూ.93 కోట్ల ఆదాయం లభిస్తోంది. 2021 నాటికి అది రూ.186 కోట్లకు చేరడం తథ్యమని బోర్డు వర్గాలు లెక్కలు కడుతున్నాయి. నష్టాల పైనే ఆందోళన పరిధి, ఆదాయం, కనెక్షన్ల సంఖ్య రెట్టింపు కావడం వరకు బాగానే ఉన్నా... నీటి సరఫరా నష్టాలు బోర్డుకు దడ పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం జలమండలి రోజువారీ 340 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తున్నా.. అందులో సరఫరా నష్టాలు పోను వాస్తవ సరఫరా కనాకష్టంగా 200 మిలియన్ గ్యాలన్లు మించడం లేదు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం సరఫరా నష్టాలు 20 శాతం లోపలే ఉండాలి. నగరంలో అంతకు రెట్టింపు స్థాయిలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. భవిష్యత్‌లోనూ ఇదే స్థాయిలో నష్టాలు ఉంటే జనం దాహార్తి అరకొరగానే తీరే పరిస్థితులు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీఎస్ఎం టెక్నాలజీ ఆధారంగా పనిచేసే సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్(స్కాడా) విధానంతో ఆన్లైన్లో ఎప్పటికప్పుడు పైప్లైన్లు, రిజర్వాయర్ల నీటిని, సరఫరా చేస్తున్న నీటిని శాస్త్రీయంగా లెక్కించడంతో పాటు నీటిచౌర్యం, లీకేజీలను అరికట్టాలని సూచిస్తున్నారు. విద్యుత్ భారం తడిసి మోపెడు ఇక పరిధి పెరగడంతో పాటే విద్యుత్ అవసరాలు కూడా గణనీయంగా పెరగనున్నాయి. ప్రస్తుతం నెలకు రూ.45 కోట్లు విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్న బోర్డు కృష్ణా మూడో దశ, గోదావరి మంచినీటి పథకాల పూర్తితో నెలకు మరో రూ.45 కోట్ల మేర అదనంగా వెచ్చించాల్సిన పరిస్థితి రానుంది. ఇప్పటికే రూ.250 కోట్ల మేర విద్యుత్ బకాయిలు పేరుకుపోయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ నీటి సరఫరా విభాగానికి ఇచ్చిన తరహాలో విద్యుత్ చార్జీలు తగ్గిస్తేనే గ్రిడ్ సాకారమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. -
శివార్లకు జలసిరి
* వాటర్‌గ్రిడ్‌తో పుష్కలంగా నీటి సరఫరా * ప్రణాళిక సిద్ధం చేస్తున్న జలమండలి * త్వరలో సీఎం సమక్షంలో కీలక భేటీ సాక్షి, సిటీబ్యూరో: రాజధానికి కూత వేటు దూరంలో ఉన్నా.. గుక్కెడు నీటి కోసం అలమటిస్తున్న 70 గ్రామాల ప్రజలకు శుభవార్త.. ఇకనుంచి ఆయా గ్రామాల వారికి నీరు పుష్కలంగా సరఫరా కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన గ్రేటర్ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుతో ఇది సాధ్యం కానుంది . దీనికోసం జలమండలి బృహత్తర ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఔటర్ రింగ్‌రోడ్డుకు లోపలున్న ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు భారీ రేడియల్ మెయిన్స్, ట్రంక్‌మెయిన్స్ పైప్‌లైన్ నెట్వర్క్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే ప్రాథమికంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిన జలమండలి శివార్లపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సుమారు రూ.13,495 కోట్ల అంచనా వ్యయంతో జలమండలి మహానగర వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు అంచనాలు సిద్ధంచేసిన విషయం విదితమే. ఈ గ్రిడ్ కార్యాచరణ ఎలా ఉండాలన్న అంశంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో త్వరలో కీలక భేటీ జరగనున్నట్టు సమాచారం. సీఎం ఆదేశాల మేరకు గ్రిడ్ పనులకు శ్రీకారం చుట్టేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. తీరనున్న దాహార్తి... గ్రేటర్‌కు ఆనుకొని ఔటర్ రింగ్‌రోడ్డుకు లోపలున్న సుమారు 70 గ్రామ పంచాయతీలకు రింగ్‌మెయిన్ పైప్‌లైన్స్ నుంచి నీటిని తరలించనున్నారు. గ్రేటర్లో విలీనమైన శివారు మున్సిపాలిటీల పరిధిలోనూ జనం దాహార్తిని తీర్చేందుకు గ్రిడ్‌లో ప్రాధాన్యమిస్తున్నారు. శేరిలింగంపల్లిలో 70 శాతం ప్రాంతాలకు, రాజేంద్రనగర్‌లో 55 శాతం, కుత్బుల్లాపూర్‌లో 50, మల్కాజ్‌గిరిలో 35 శాతం, కూకట్‌పల్లిలో 30, ఉప్పల్‌లో 20, ఎల్బీనగర్లో 20, కాప్రాలో 80, అల్వాల్‌లో 70 శాతం ప్రాంతాలకు ఈ గ్రిడ్‌ద్వారా దాహార్తిని తీర్చే సదవకాశం రానుంది. ఆయా ప్రాంతాల్లో మంచినీటి పైప్‌లైన్ నెట్వర్క్ విస్తరణ, స్టోరేజి రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌ల నిర్మాణానికి ఈ గ్రిడ్ పథకంలో స్థానం కల్పించడం విశేషం. ఇదీ గ్రిడ్ స్వరూపం.. విశ్వనగరంగా అవతరించనున్న గ్రేటర్లో రాబోయే నాలుగేళ్లలో ఇంటింటికీ నల్లా కనెక్షన్ మంజూరు చేసేందుకు వాటర్‌గ్రిడ్ పథకాన్ని రూపొందించారు. సుమారు కోటి జనాభాకు చేరువైన మహానగర దాహార్తిని తీర్చేందుకు వెయ్యి చదరపు కిలోమీటర్ల పరిధిలో గ్రిడ్ ఏర్పాటుకానుంది. ఇందుకు రూ.13,495 కోట్ల అంచనా వ్యయంతో జలమండలి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపితే పథకం పనులు మొదలుకానున్నాయి. గ్రిడ్‌కు సంబంధించిన ప్రాథమిక కసరత్తును జలమండలి పూర్తిచేసింది. ఇందుకోసం ఓ మాస్టర్‌ప్లాన్ ప్రణాళిక చిత్రపటాన్ని కూడా రూపొందించింది. ఈ గ్రిడ్ పరిధిలో ఏర్పాటు చేయాల్సిన రేడియల్ మెయిన్లు, ట్రంక్‌మెయిన్స్, ప్రెజర్మెయిన్స్, నెట్వర్క్ పైప్లైన్లు, స్టోరేజి రిజర్వాయర్లు, పంపింగ్ స్టేషన్లు, గ్రావిటీ ఆధారంగా నీటిసరఫరా తదితర అంశాలపై సమగ్ర డిజైనింగ్, డ్రాయింగ్లు పూర్తిచేసే సాంకేతిక పనులను ప్రముఖ సివిల్ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీకి అప్పగించాలని నిర్ణయించారు. గ్రిడ్ అంచనాలివే.. సుమారు వెయ్యి చదరపు కిలోమీటర్ల పరిధిలో 2021 సంవత్సరం నాటికి పెరగనున్న జనాభా, ఐటీ, హార్డ్‌వేర్ పరిశ్రమల విస్తరణ, పారిశ్రామికీకరణ అవసరాలకు వినియోగించే నీటి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని చేపట్టబోయే వాటర్‌గ్రిడ్ పనులు-వాటి అంచనా వ్యయాలిలా ఉన్నాయి.