వి‘నూతనం’గా.. | newly new year hyderabad | Sakshi
Sakshi News home page

వి‘నూతనం’గా..

Published Wed, Dec 31 2014 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM

వి‘నూతనం’గా..

వి‘నూతనం’గా..

తెలంగాణ చరిత్రలో 2014ది ప్రత్యేక స్థానమైతే... 2015 సంవత్సరం గ్రేటర్ సిటీకి మరచిపోలేని జ్ఞాపకంగా మిగల్చాలనేది ప్రభుత్వ యోచన. ఆ దిశగా ఒక్కో అడుగూ ముందుకేసి... హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనేది సంకల్పం. ప్రస్తుతం ఉన్న పథకాలు... కార్యక్రమాలకు... మరికొన్నిటిని చేర్చి...నవశకం నిర్మించాలనేది లక్ష్యం. ఆ అడుగులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం.

ప్రణాళికతో కొత్త ఏడాదిలోకి..
విశ్వనగరం దిశగా అడుగులు
ప్రాధాన్య క్రమంలో పనులు
అధికార యంత్రాంగం సిద్ధం

సాక్షి, సిటీబ్యూరో: ఎన్నో ఏళ్ల పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర చరిత్రలో 2014వ సంవత్సరానిది ప్రత్యేక స్థానం. అందుకు అనుగుణంగానే కొత్త ప్రభుత్వం గ్రేటర్ నగరంలో విభిన్న పథకాలు... వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చు ట్టాలని భావించింది. అధికార యంత్రాంగమూ ఆ దిశగా సిద్ధమైంది. వాటిలో కొన్నిటికి శ్రీకారం చుట్టగా... మరికొన్ని కార్యరూపం దాల్చాల్సి ఉంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామని సీఎం చెబుతున్నారు.ఇవన్నీ కొత్త సంవత్సరం (2015)లో సాకారమయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఈ పనులను జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ మంగళవారం వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి...
 
ఆధునిక రహదారులు
ప్రభుత్వ తొలి ప్రాధాన్యం రహదారులు. అంతర్జాతీయ ప్రమాణాలతో వీటిని నిర్మించనున్నారు. వాహనాలు గమ్యస్థానం చేరే వరకూ ఎక్కడా ఆటంకాలూ లేకుండా చూడాలనేది లక్ష్యం. ట్రాఫిక్ ఇబ్బందులు, సిగ్నల్ ఆటంకాలు లేకుండా వీలైనన్ని మార్గాల్లో రహదారులను అభివృద్ధి పరచాలనేది లక్ష్యం. రోడ్లకు ఇరువైపులా వరదనీరు వెళ్లే మార్గాలు...పచ్చదనం...  దారి పొడవునా ఎల్‌ఈడీ వెలుగులు. ఫ్లై ఓవర్లు, ఆర్‌ఓబీలు, గ్రేడ్ సెపరేటర్లు... స్పైరల్ మార్గాలు, స్కై వేల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొత్తం వెయ్యి కిలోమీటర్లలో నిర్మించాలనేది లక్ష్యం. తొలిదశలో 280 కి.మీ.లు పూర్తి చేయాలని నిర్ణయించారు.
 
నాలాల ఆధునికీకరణ
ఎంతో కాలంగా ఊరిస్తున్న నాలాల పనులు ముందుకు సాగేందుకు శ్రద్ధ చూపుతామంటున్నారు. నాలాల ప్రదేశాల్లోని ఆక్రమణల తొలగింపు, రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, ఎప్పటికప్పుడు శుభ్రం చేసి వాననీరు సాఫీగా వెళ్లేలా చేసేందుకు నిర్ణయం. వంద కిలోమీటర్ల మేర వీటిని ఆధునీకరించాలనేది లక్ష్యం.
 
స్లమ్ ఫ్రీ సిటీ
ముఖ్యమంత్రి కలలకు అనుగుణంగా వీలైనన్ని బస్తీల్లో రెండు పడక గదులు, హాల్, కిచెన్‌లతో కూడిన ఇళ్ల నిర్మాణం. స్లమ్స్‌లో రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాల వంటి సదుపాయాల కల్పన. స్లమ్స్‌లోని స్థితిగతులను అంచనా వేసేందుకు కన్సల్టెంట్ సంస్థ బృందాలు ఇప్పటికే సర్వే జరుపుతున్నాయి. ఐడీహెచ్ కాలనీని స్లమ్‌ఫ్రీగా చేయడంతోపాటు దానిని మోడల్‌గా చూపుతూ మిగతా వాటినీ అభివృద్ధి చేయాలనేది  లక్ష్యం.
 
చెరువుల పరిరక్షణ
చెరువులు, ప్రభుత్వ ఖాళీ స్థలాల పరిరక్షణ. పచ్చదనం పెంపు కార్యక్రమాలు. చెరువుల్లోని అక్రమ నిర్మాణాల తొలగింపుతో పాటు   సుందర, పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దాలనేది ప్రాధాన్యాంశాల్లో మరొకటి. హరితహారంలో భాగంగా కోటి మొక్కలు నాటడం లక్ష్యం.
 
పేదలకు జీవనోపాధి
పేదలకు జీవనోపాధి, సంక్షేమ కార్యక్రమాలపై శ్రద్ధ. యువ త ఉపాధి కోసం డ్రైవర్‌కమ్ ఓనర్ పథకం కొనసాగింపు, ఉద్యోగాల కల్పనకు జాబ్‌మేళాలు, ఈ-వ్యాన్,ఈ-జోన్‌ల ద్వారా దరఖాస్తుల స్వీకరణ. వృద్ధుల ‘ఆసరా’పై ప్రత్యేక శ్రద్ధ. జీహెచ్‌ఎంసీ అందిస్తున్న ఆసరా కార్డుల ప్రయోజనాల సమీక్షతో పాటు వారికి ఉపయుక్తమైన కార్యక్రమాల అమలుకు కృషి. రూ. 5కే భోజనాన్ని 50 కేంద్రాలకు విస్తరణ
 
350 మంది నోడల్ అధికారులతో ‘స్పెషల్ డ్రైవ్’
రహదారులు, వీధి దీపాలు, పారిశుద్ధ్య సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు 350 మంది నోడల్ ఆఫీసర్లను నియమిస్తున్నట్లు స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ అంశాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి జనవరి 1 నుంచి 45 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. వీటితో పాటు ఆస్తిపన్ను వసూళ్ల వంటి వాటిపై దృష్టి పెడతామని చెప్పారు.
 
స్థానిక సంఘాలే కీలకం
జీహెచ్‌ఎంసీలో పాలక మండలి... స్టాండింగ్ కమిటీ లేవు. ప్రజలు తమకు ఏ పనులు కావాలన్నా అధికారులను సంప్రదించాల్సిందే. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలను వీలైనంత వరకు స్థానిక సంఘాల ద్వారానే పరిష్కరించాలని జీహెచ్‌ఎంసీ యోచిస్తోంది. అందులో భాగంగా రూ.10 లక్షల లోపు పనులను స్థానిక బస్తీ సంఘాలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్లకు అప్పగించనున్నారు. పారిశుద్ధ్యం, తాగునీరు, డ్రైనేజీ వంటి సమస్యలను జీహెచ్‌ఎంసీ దృష్టికి తెచ్చి పరిష్కరించేలా ఈ సంఘాలు సమన్వయ బాధ్యతలు నిర్వర్తిస్తాయి.
 
జలమండలిలో...
సాక్షి,సిటీబ్యూరో: కృష్ణా మూడోదశ, గోదావరి మంచినీటి పథకాలను పూర్తి చేసి... గ్రేటర్ దాహార్తిని తీర్చడమే ఈ ఏడాదిలో జలమండలి లక్ష్యమని అధికారులు తెలిపారు. కృష్ణా మూడోదశను 2015 మార్చి చివరి నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. గోదావరి పథకాన్ని జూన్ 2015 నాటికి పూర్తి చేస్తామన్నారు. మూడో దశ ద్వారా నగరానికి నిత్యం 90 మిలియన్ గ్యాలన్లు, గోదావరి మొదటి దశ ద్వారా172 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలిస్తామని చెప్పారు.

ఈ రెండు పథకాలతో గ్రేటర్‌లో విలీనమైన 11 శివారు మున్సిపాల్టీల పరిధిలోని కాలనీల దాహార్తిని తీర్చడమే బోర్డు సిటీజనులకు ఇచ్చే నూతన సంవత్సర కానుకని పేర్కొన్నారు. మరోవైపు గ్రేటర్ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు నూతన సంవత్సరంలో శ్రీకారం చుట్టడం ద్వారా రానున్న నాలుగేళ్లలో మహానగర పరిధిలో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్లు ఇస్తామని హామీ ఇస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement