శివార్లకు జలసిరి
* వాటర్‌గ్రిడ్‌తో పుష్కలంగా నీటి సరఫరా
* ప్రణాళిక సిద్ధం చేస్తున్న జలమండలి
* త్వరలో సీఎం సమక్షంలో కీలక భేటీ
సాక్షి, సిటీబ్యూరో: రాజధానికి కూత వేటు దూరంలో ఉన్నా.. గుక్కెడు నీటి కోసం అలమటిస్తున్న 70 గ్రామాల ప్రజలకు శుభవార్త.. ఇకనుంచి ఆయా గ్రామాల వారికి నీరు పుష్కలంగా సరఫరా కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన గ్రేటర్ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుతో ఇది సాధ్యం కానుంది . దీనికోసం జలమండలి బృహత్తర ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఔటర్ రింగ్‌రోడ్డుకు లోపలున్న ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు భారీ రేడియల్ మెయిన్స్, ట్రంక్‌మెయిన్స్ పైప్‌లైన్ నెట్‌వర్క్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే ప్రాథమికంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిన జలమండలి శివార్లపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
సుమారు రూ.13,495 కోట్ల అంచనా వ్యయంతో జలమండలి మహానగర వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు అంచనాలు సిద్ధంచేసిన విషయం విదితమే. ఈ గ్రిడ్ కార్యాచరణ ఎలా ఉండాలన్న అంశంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో త్వరలో కీలక భేటీ జరగనున్నట్టు సమాచారం. సీఎం ఆదేశాల మేరకు గ్రిడ్ పనులకు శ్రీకారం చుట్టేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది.
తీరనున్న దాహార్తి...
గ్రేటర్‌కు ఆనుకొని ఔటర్ రింగ్‌రోడ్డుకు లోపలున్న సుమారు 70 గ్రామ పంచాయతీలకు రింగ్‌మెయిన్ పైప్‌లైన్స్ నుంచి నీటిని తరలించనున్నారు. గ్రేటర్‌లో విలీనమైన శివారు మున్సిపాలిటీల పరిధిలోనూ జనం దాహార్తిని తీర్చేందుకు గ్రిడ్‌లో ప్రాధాన్యమిస్తున్నారు. శేరిలింగంపల్లిలో 70 శాతం ప్రాంతాలకు, రాజేంద్రనగర్‌లో 55 శాతం, కుత్బుల్లాపూర్‌లో 50, మల్కాజ్‌గిరిలో 35 శాతం, కూకట్‌పల్లిలో 30, ఉప్పల్‌లో 20, ఎల్బీనగర్‌లో 20, కాప్రాలో 80, అల్వాల్‌లో 70 శాతం ప్రాంతాలకు ఈ గ్రిడ్‌ద్వారా దాహార్తిని తీర్చే సదవకాశం రానుంది. ఆయా ప్రాంతాల్లో మంచినీటి పైప్‌లైన్ నెట్‌వర్క్ విస్తరణ, స్టోరేజి రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌ల నిర్మాణానికి ఈ గ్రిడ్ పథకంలో స్థానం కల్పించడం విశేషం.
ఇదీ గ్రిడ్ స్వరూపం..
విశ్వనగరంగా అవతరించనున్న గ్రేటర్‌లో రాబోయే నాలుగేళ్లలో ఇంటింటికీ నల్లా కనెక్షన్ మంజూరు చేసేందుకు వాటర్‌గ్రిడ్ పథకాన్ని రూపొందించారు. సుమారు కోటి జనాభాకు చేరువైన మహానగర దాహార్తిని తీర్చేందుకు వెయ్యి చదరపు కిలోమీటర్ల పరిధిలో గ్రిడ్ ఏర్పాటుకానుంది. ఇందుకు రూ.13,495 కోట్ల అంచనా వ్యయంతో జలమండలి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపితే పథకం పనులు మొదలుకానున్నాయి.
గ్రిడ్‌కు సంబంధించిన ప్రాథమిక కసరత్తును జలమండలి పూర్తిచేసింది. ఇందుకోసం ఓ మాస్టర్‌ప్లాన్ ప్రణాళిక చిత్రపటాన్ని కూడా రూపొందించింది. ఈ గ్రిడ్ పరిధిలో ఏర్పాటు చేయాల్సిన రేడియల్ మెయిన్లు, ట్రంక్‌మెయిన్స్, ప్రెజర్‌మెయిన్స్, నెట్‌వర్క్ పైప్‌లైన్లు, స్టోరేజి రిజర్వాయర్లు, పంపింగ్ స్టేషన్లు, గ్రావిటీ ఆధారంగా నీటిసరఫరా తదితర అంశాలపై సమగ్ర డిజైనింగ్, డ్రాయింగ్‌లు పూర్తిచేసే సాంకేతిక పనులను ప్రముఖ సివిల్ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీకి అప్పగించాలని నిర్ణయించారు.
గ్రిడ్ అంచనాలివే..
సుమారు వెయ్యి చదరపు కిలోమీటర్ల పరిధిలో 2021 సంవత్సరం నాటికి పెరగనున్న జనాభా, ఐటీ, హార్డ్‌వేర్ పరిశ్రమల విస్తరణ, పారిశ్రామికీకరణ అవసరాలకు వినియోగించే నీటి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని చేపట్టబోయే వాటర్‌గ్రిడ్ పనులు-వాటి అంచనా వ్యయాలిలా ఉన్నాయి.