నీళ్లొస్తున్నాయ్.. నల్లా తిప్పండి..
నల్లాలకు నీటి సరఫరా వేళలపై ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారం
సాక్షి, హైదరాబాద్ : కోటి మందికిపైగా జనాభా ఉన్న మన భాగ్యనగరంలో మంచినీటికి ఎప్పుడూ కటకటే.. దీంతో జలమండలి గ్రేటర్ పరిధిలో రెండ్రోజులకు ఒకసారి.. శివారు ప్రాంతాల్లో మూడ్రోజులకు ఒకసారి మంచినీటిని సరఫరా చేస్తోంది. అయితే నల్లా నీళ్లు వచ్చే సమయం ఎప్పుడంటే మాత్రం సరైన సమాధానం లభించదు. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ మహానగరంలో ఇదే పరిస్థితి. ఇకపై నీటి వెతల నుంచి హైదరాబాదీలకు విముక్తి లభించనుంది. నల్లా నీళ్లు ఎప్పుడొస్తాయో.. నేరుగా వినియోగదారుల మొబైల్‌కే సంక్షిప్త సందేశం రూపంలో సమాచారం అందనుంది. ఈ మేరకు జలమండలి చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా కూకట్‌పల్లి డివిజన్ పరిధిలోని 70 వేల నల్లా వినియోగదారులకు నీటిసరఫరా వేళలపై ఎస్సెమ్మెస్‌లు అందజేస్తోంది. సెప్టెంబర్ 15 నుంచి నగరంలోని మిగతా 20 డివిజన్ల పరిధిలోని 8 లక్షల నల్లాలకు సైతం సంక్షిప్త సందేశాలను అందజేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
‘జీపీఎస్’తో ఎస్సెమ్మెస్‌లు..
వినియోగదారులకు ఎస్సెమ్మెస్‌లు పంపేం దుకు జలమండలి జీపీఎస్ పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. క్షేత్రస్థాయిలోని లైన్‌మెన్లకు స్మార్ట్‌ఫోన్లు అందించి.. అందులో ప్రత్యేక యాప్‌ను అందుబాటులో ఉంచింది. నీటి సరఫరా కోసం వాల్వ్ తిప్పేందుకు లైన్‌మెన్ వెళ్లినపుడు అతని ఫోన్‌లో ఆ వాల్వ్ నంబర్ ప్రత్యక్షమౌతుంది. దానిపై నొక్కగానే ఆ సమాచారం జలమండలి కేంద్ర కార్యాలయంలోని సర్వర్‌కు చేరుతుంది. అక్కడి నుంచి ఐవీఆర్‌ఎస్ విధానంలో ఆ వాల్వ్ పరిధిలోని వినియోగదారులందరికీ ఎస్సెమ్మెస్ ద్వారా నల్లా నీళ్లు వస్తున్నాయన్న సమాచారం అందుతుంది.
ప్రయోగాత్మకంగా ‘జల్‌యాప్’ వినియోగం..
నిత్యం వినియోగదారుల నుంచి వచ్చే కలుషిత జలాలు.. అరకొర నీటి సరఫరా, మూతలు లేని మ్యాన్‌హోల్స్ వంటి 9 రకాల ఫిర్యాదులపై జలమండలి రూపొందించిన జల్‌యాప్‌ను ప్రయోగాత్మకంగా వంద మంది లైన్‌మన్ల వద్దనున్న స్మార్ట్‌ఫోన్లలో వినియోగంలోకి తీసుకొచ్చారు. జల్ యాప్‌కు అందే ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఒక్కో క్షేత్రస్థాయి మేనేజర్‌కు రూ.2 లక్షల నగదును అందజేయనున్నట్లు జలమండలి ఎండీ దాన కిశోర్ తెలిపారు. ఈ నిధులను సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా అన్న అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఓ చీఫ్ జనరల్ మేనేజర్‌ను నియమిస్తున్నామన్నారు. సెప్టెం బర్‌లో జలమండలిలో పనిచేస్తున్న మూడు వేల మంది లైన్‌మన్ల స్మార్ట్‌ఫోన్లలో జల్‌యాప్ అందుబాటులోకి రానుందన్నారు.
లైన్‌మన్ల అక్రమాలకు చెక్..
నీటి సరఫరాపై వినియోగదారులకు ఎస్సెమ్మెస్‌లు అందించడం ద్వారా లైన్‌మన్ల చేతివాటానికి చెక్ పడనుంది. ఉన్నతాధికారులకు సైతం నీటి సరఫరా వేళలపై ఎప్పటికప్పుడు సమాచారం ఎస్సెమ్మెస్ ద్వారా అందుతుండడంతో డబ్బులు తీసుకుని ఓ ప్రాంతానికి అధికంగా.. మరో ప్రాంతానికి తక్కువ సమయం నీటిని సరఫరా చేయడానికి వీలుండదని జలమండలి అధికారులు ‘సాక్షి’కి తెలిపారు.
సెప్టెంబర్ 15 నుంచి అన్ని నల్లాలకూ ఎస్సెమ్మెస్
కూకట్‌పల్లి డివిజన్‌లోని 70 వేల నల్లాలకు ఎస్సెమ్మెస్‌లు అందుతున్నాయి. జలమండలి పరిధిలోని మిగతా 8.06 లక్షల నల్లాలకు సెప్టెంబర్ 15 నుంచి ఎస్సెమ్మెస్‌లు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇందుకోసంమహానగర పరిధిలో మంచినీటి పైపులైన్లపై ఉన్న వాల్వ్‌లను అవి ఉన్న అక్షాంశం, రేఖాంశం ఆధారంగా జీపీఎస్‌తో అనుసంధానిస్తున్నాం. దీంతోబోర్డు రికార్డుల్లో నమోదైన వినియోగదారుల మొబైల్స్‌కు నీటిసరఫరా వేళలపై ఎస్‌ఎంఎస్‌లు అందుతాయి.
- దాన కిశోర్, జలమండలి ఎండీ