నల్లా...అక్రమాలు నిలువెల్లా!
వాణిజ్య భవంతులే అధికం
ఏడాదిలో ఐదు వేలు గుర్తింపు
సిటీబ్యూరో: గ్రేటర్‌లో తవ్వినకొద్దీ అక్రమ నల్లాల భాగోతం బయట పడుతోంది. వాణిజ్య భవంతులు, హోటళ్లు, హాస్టళ్లు, మాల్స్, మెస్‌లు, ఫంక్షన్ హాళ్ల వంటి వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తున్న భవనాలే ఈ జాబితాలో ముందుంటున్నాయి. జలమండలి విజిలెన్స్ విభాగం వరుస తనిఖీలతో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఏడాదిలో సుమారు ఐదు వేల అక్రమ కనెక్షన్ల గుట్టు రట్టయింది. జలమండలిలోని 16 నిర్వహణ డివిజన్ల పరిధిలో 8.64 లక్షల నల్లాలు ఉన్నాయి. అదనంగా సుమారు లక్ష వరకు అక్రమంగా ఉన్నట్లు అనధికారిక అంచనా. తనిఖీలు నిర్వహించినపుడే ఇవి బయట పడుతున్నాయి. భూమి లోపల ఉన్న నీటి సరఫరా పైపులైన్లకు కన్నాలు వేసి... కొందరు అక్రమార్కులునల్లాలను ఏర్పాటు చేసుకోవడం, వాటిపై యధావిధిగా మట్టి కప్పేయడంతో పసిగట్టడం కష్టమవుతోంది.స్థానికులు ఫిర్యాదు చేసినపుడు, రెవెన్యూ సిబ్బంది తనిఖీ చేసినపుడే ఇవి బయట పడుతుండడం గమనార్హం.
జలమండలి ఖజానాకు చిల్లు
నగరానికి గోదావరి, కృష్ణా జలాలను అందించే పైపులైన్లకు లీకేజీలు, అక్రమ నల్లాలు శాపంగా పరిణమిస్తుండడంతో జలమండలి ఖజనాకు భారీగా గండి పడుతోంది. సరఫరా నష్టాలు 40 శాతానికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. జలమండలికి నల్లా బిల్లులు, మురుగు శిస్తు, ట్యాంకర్ నీటి సరఫరా, నూతన కనెక్షన్లతో నెలకు రూ.89 కోట్ల ఆదాయం సమకూరుతోంది. నిర్వహణ వ్యయాలు, ఉద్యోగుల జీతభత్యాలు, మరమ్మతులకు రూ.91 కోట్లు ఖర్చవుతోంది. అంటే నెలకు రూ.2 కోట్ల నష్టాన్ని భరిస్తోంది. అక్రమ నల్లాల భరతం పడితే ఆదాయం రూ.100 కోట్లకు పైగానే సమకూరుతుందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.
తనిఖీలతో గుట్టు రట్టు
ఇటీవలి కాలంలో రెవెన్యూ ఆదాయం పెంచుకునేందుకు బోర్డు విజిలెన్స్ బృందం నగరంలో విస్తృత తనిఖీలు చేపట్టింది. కింగ్‌కోఠి, కొత్తపేట, ఎల్లారెడ్డిగూడ తదితర ప్రాంతాల్లో హోటళ్లు, హాస్టళ్లకు ఉన్న అక్రమ నల్లాల గుట్టును రట్టు చేసింది. అక్రమార్కులపై స్థానిక పోలీస్ స్టేషన్‌లలో ఐపీసీ 269, 430 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఇదే స్ఫూర్తితో ఇతర ప్రాంతాలపై దృష్టి సారిస్తేనే సత్ఫలితాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి.
క్రిమినల్ కేసులు
అక్రమ నల్లా కనెక్షన్లు కలిగిన వారు తమ భవన విస్తీర్ణాన్ని బట్టి నిర్ణీత కనెక్షన్ చార్జీలు, పెనాల్టీ చెల్లించి క్రమబద్ధీకరించుకోవాలని జలమండలి అధికారులు సూచిస్తున్నారు. లేని పక్షంలో క్రిమినల్ కేసులు తప్పవని స్పష్టం చేస్తున్నారు. అక్రమ నల్లాలపై జలమండలి టోల్‌ఫ్రీ నెంబరు 155313కి ఫోన్ చేసి వివరాలు తెలపాలని కోరుతున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు.