Commercial activities
-
వాణిజ్య ఖిల్లా ‘పశ్చిమ’
సాక్షిప్రతినిధి, ఏలూరు: అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ లక్ష్యంగా ఏర్పడిన నూతన పశ్చిమగోదావరి జిల్లా వాణిజ్య ఖిల్లాగా అవతరించింది. డెల్టా, గోదావరి, సముద్ర తీర ప్రాంతాలతో ఆవిష్కృతమైంది. జిల్లాగా ఏర్పడిన నరసాపురం పార్లమెంటరీ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఐదు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ ఉన్నాయి. రెండు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటుచేశారు. ఆక్వా ఉత్పత్తులు, విదేశీ ఎగుమతులు, వాణిజ్య, విద్యాసంస్థలు కలబోతగా భీమవరం కేంద్రంగా జిల్లా అవతరించింది. ఆధ్యాత్మిక సౌరభం, రాజకీయ చైతన్యంతో విరాజిల్లనుంది. ఆక్వాహబ్‌గా పేర్గాంచి.. ప్రధానంగా 1.80 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగుతో భీమవరం ఆక్వాహబ్‌గా మారింది. ఆక్వా చెరువులు, పరిశ్రమలు, ప్రాసెసింగ్, సీడ్ యూనిట్లు జిల్లాలో ఉన్నాయి. ఇక్కడి నుంచి అమెరికా, చైనా, మలేషియా, ఆస్ట్రేలియా, సింగపూర్, శ్రీలంకతో పాటు యూరప్ దేశాలకు నిత్యం ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. రెండో బార్డోలి: స్వాతంత్య్ర ఉద్యమ పోరాటంలో భీమవరానికి ప్రత్యేక స్థానం ఉంది. రెండో బార్డోలిగా పేర్గాంచింది. ఆధ్యాత్మిక సౌరభం: పాలకొల్లు, భీమవరంలో పంచారామక్షేత్రాలు, భీమవరంలో మావుళ్లమ్మవారి ఆలయం, పెనుగొండలో వాసవీ మాత ఆలయం, నరసాపురంలో ఆదికేశవ ఎంబేరుమన్నార్ కోవెలతో జిల్లా ఆధ్యాత్మికంగా విలసిల్లుతోంది. కళలకు ప్రసిద్ధి: పాలకొల్లు, నరసాపురం, భీమవరం ప్రాంతాలు కళలకు ప్రసిద్ధి చెందాయి. ఈ ప్రాంతానికి చెందిన ఎందరో రంగస్థల, సినీ నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులుగా వెలుగొందుతున్నారు. రాజకీయ చైతన్యం: నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం రాజకీయంగా కీలకం. ఇక్కడి నుంచి పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. చారిత్రక నేపథ్యం: నరసాపురం ప్రాంతానికి చారిత్రక నేపథ్యం ఉంది. మొగల్తూరు రాజులు మొగల్తూరు కేంద్రంగా కృష్ణా జిల్లా వరకూ పాలన సాగించారు. డచ్, బ్రిటిషర్లు ఇక్కడ స్థావరాలు ఏర్పాటుచేసుకున్నారు. 300 ఏళ్ల క్రితం డచ్ వారు నిర్మించిన వైఎన్ కళాశాల పరిపాలనా భవనం చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. లేసు, వాణిజ్య ఉత్పత్తులు: ఐర్లాండ్ దేశస్తులు పరిచయం చేసిన లేసు అల్లికల పరిశ్రమ ఈ ప్రాంతంలో ఉంది. మొగల్తూరు మామిడి, మోళ్లపర్రు ఎండుచేపలు, పాలకొల్లు కొబ్బరి, నరసాపురం బంగారం వ్యాపారం, తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్, ఆయిల్ విక్రయాలకు పేర్గాంచింది. ఇస్రో ఇంధన తయారీ: అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగాల్లో అవసరమైన ఇంధనాన్ని తణుకు కేంద్రంగా ఉత్పత్తి చేస్తున్నారు. 1988 నుంచి ఆంధ్రా సుగర్స్ అనుబంధ సంస్థలో తయారైన ఇంధనాన్ని ఇస్రో ఉపయోగిస్తోంది. విద్యా నిలయం: జిల్లాలోని తాడేపల్లిగూడెంలో ఏపీ నిట్, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీలు ఉన్నాయి. భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం కేంద్రంగా ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. -
మూడేళ్లలో రుణ రహిత కంపెనీగా అరబిందో
హైదరాబాద్: ఔషధ తయారీ సంస్థ అరబిందో ఫార్మా మూడేళ్లలో రుణ రహిత కంపెనీగా అవతరించనుంది. సాండోజ్ డీల్‌తో కంపెనీపై రుణ భారం పెరిగింది. నోవార్టిస్ కంపెనీ అయిన సాండోజ్ వాణిజ్య కార్యకలాపాలు, మూడు తయారీ ప్లాంట్లను అరబిందో ఫార్మా రూ.6,300 కోట్లు వెచ్చించి గతేడాది సెప్టెంబర్ లో కొనుగోలు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ భారం రూ.1,050–1,400 కోట్లు తగ్గుతుందని అరబిందో సీఎఫ్‌వో సంతానం సుబ్రమణియన్ తెలిపారు. గత మూడు త్రైమాసిక ఫలితాలనుబట్టి మూడేళ్లలో రుణ రహిత కంపెనీ అవుతుందని చెప్పారు. 2019 జూన్‌తో పోలిస్తే సెప్టెంబర్ నాటికి సంస్థ నికర రుణాలు రూ.497 కోట్లు తగ్గి రూ.3,654 కోట్లకు వచ్చి చేరాయి. -
పక్కదారి పడుతున్న గృహావసర సిలిండర్లు
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో ‘డెమెస్టిక్’ గ్యాస్ సిలిండర్ల దందా కమర్షియల్‌గా సాగుతోంది. గృహావసరాలకు వినియోగించే(డొమెస్టిక్) సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు యథేచ్ఛగా పక్కదారి పడుతున్నాయి. ఈ వ్యాపారం ప్రధానంగా నిజామాబాద్ నగరంతో పాటు ఆర్మూర్, బోధన్ లాంటి పట్టణాలు, మండల కేంద్రాల్లో కూడా జోరుగా నడుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా హోటళ్లలో, ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్ సెంటర్లలో ఇంటి సిలిండర్లను దొంగచాటున వినియోగిస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుండడంతో పాటు కొంత మంది ఏజెన్సీదారులకు తెరచాటున ఇదొక వ్యాపారంగా మారిపోయింది. అయితే డొమెస్టిక్ సిలిండర్లు దుర్వినియోగం కాకుండా నిరంతరంగా తనిఖీలు చేయాల్సిన సివిల్ సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇటీవల కాలంలో తనిఖీలు చేయడం మానేశారు. ఎప్పుడో ఒకసారి తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ఇతర వ్యాపారాలకు కమర్షియల్ సిలిండర్లు మాత్రమే వినియోగించాలని ప్రభుత్వ నిబంధనలున్నాయి. అయితే చాలామట్టుకు ఆ నిబంధనలను పాటించడం లేదు. ఎందుకంటే 19 కిలోలు గల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ప్రసుతం రూ.1400 వరకు ఉంది. అదే గృహావసరాలకు వినియోగించే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ 14.6 కిలోలు ఉండి దాని విలువ రూ.670 వరకు ఉంది. ఈ లెక్కన కమర్షియల్ సిలిండర్‌కు వెచ్చించే డబ్బులతో రెండు డొమెస్టిక్ సిలిండర్లు కొనుగోలు చేయవచ్చు. గ్యాస్ కూడా ఎక్కువగా వస్తుంది. దీంతో హోటళ్లలో, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాల నిర్వాహకులు ఇది తప్పని తెలిసినా డొమెస్టిక్ గ్యాస్‌ను వినియోగించడానికి వక్ర మార్గాన్ని ఆచరిస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీలను మచ్చిక చేసుకుని డొమెస్టిక్ సిలిండర్లను సబ్సిడీ లేకుండా కొనుగోలు చేస్తున్నారు. ఇటు గ్యాస్ ఏజెన్సీలకు కూడా ఒక్కో సిలిండర్‌పై రూ.200 వరకు లాభం రావడంతో ‘డొమెస్టిక్’ దందా ‘మూడు పువ్వులు, ఆరు కాయలు’గా మారింది. ఇటు సివిల్ సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏజెన్సీలతో మిలాఖత్ అయ్యారనే ఆరోపణలున్నాయి. అందుకే వీరి డొమెస్టిక్ దందా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. తనిఖీలు అంతంతే... హోటల్లో డొమెస్టిక్ సిలిండర్లను పట్టుకున్న సివిల్ సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు(ఫైల్) జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ సింగిల్ కనెక్షన్లు సుమారు 2లక్షల 7వేల వరకున్నాయి. డబుల్ కనెక్షన్లు లక్షా 19వేల వరకు, దీపం కనెక్షన్లు 79వేల వరకు, సీఎస్ఆర్ కనెక్షన్లు 28,500 వరకు ఉన్నాయి. సిలిండర్లను సరఫరా చేసేందుకు ఇండియన్, హెచ్‌పీ, భారత్ కలిపి గ్యాస్ ఏజెన్సీలు 35 వరకు ఉన్నాయి. అయితే కమర్షియల్ సిలిండర్లు మాత్రం 3,400 వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లా అంతటా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాలు, టిఫిన్ సెంటర్లు, ఇతర వ్యాపారాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్లు హోటళ్ల సామర్థ్యం ఆధారంగా వారం ఒకటి నుంచి రెండు, మరి కొన్నింటిలో నెలకు ఐదు వరకు వినియోగం అవుతున్నాయి. ఒక కమర్షియల్ సిలిండర్‌పై వెళ్లదీయడం సాధ్యం కాని పని. ఈ సందర్భంగా డొమెస్టిక్ సిలిండర్లను అక్రమంగా వినియోగిస్తున్నారు. కార్లు, ఇతర వాహనాల్లో కూడా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు ఎక్కిస్తున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా గృహావసరాలకు వినియోగించే సిలిండర్లు పక్కదారి పడుతున్నా అధికారులు మాత్రం ‘మామూలు’గానే తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. -
డ్రోన్ల వాణిజ్య వినియోగానికి గ్రీన్‌సిగ్నల్
సాక్షి,న్యూఢిల్లీ: వాణిజ్య అవసరాలకు డ్రోన్ల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీచేసింది. డ్రోన్లను వ్యాపార కార్యకలాపాలు సహా అందరూ వినియోగించుకోవడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, నిబంధనలకు అనుగుణంగా డ్రోన్ల వినియోగానికి అనుమతిస్తామని పౌర విమానయాన కార్యదర్శి ఆర్ఎన్ చూబే చెప్పారు. 250 కిలోగ్రాముల నుంచి 150 కేజీల బరువుండే డ్రోన్లు ఐదు క్యాటగిరీలుగా విభజిస్తూ నూతన డ్రోన్ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. నిబంధనలకు అనుగుణంగా 200 అడుగుల కంటే ఎక్కువ ఎత్తును నో డ్రోన్ జోన్‌గా పరిగణిస్తారు. విమానాశ్రయానికి ఐదు కిమీ పరిధిలో డ్రోన్లను అనుమతించరు. ఢిల్లీలోని విజయ్ చౌక్ వంటి ప్రాంతాలు నో డ్రోన్ జోన్ పరిధిలోకి వస్తాయి. ఇక ఈ సంవత్సరాంతానికి సమగ్ర డ్రోన్ పాలసీ వెల్లడవుతుందని విమానయాన మంత్రిత్వ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. -
నిప్పుకణం
మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ తెలుగు సినిమాలో క్లాసిక్ అన్న పేరున్న ఒక సినిమాలోని సీన్స్ ఇవి. ఇంటర్వెల్ తర్వాతి సీన్ హీరోయిజాన్ని పీక్స్‌కు తీసుకెళ్లేలా ఉంటుంది. ఒక స్టార్ హీరో నటించారు ఈ సినిమాలో! దర్శక, రచయిత ఇప్పుడొక స్టార్ డైరెక్టర్. ఆ సినిమా ఏంటో చెప్పుకోండి చూద్దాం? అది సత్యనారాయణ మూర్తి ఇల్లు. బాశర్లపూడి గ్రామం. ఒక రాజకీయ నాయకుడి హత్య కేసుకు సంబంధించి సత్యనారాయణ మూర్తి మనవడు పార్థసారథిని విచారించడానికి సీబీఐ ఆఫీసర్ ఆంజనేయ ప్రసాద్ వచ్చి మూర్తికి ఎదురుగా కూర్చున్నాడు. ‘‘మీరో చిన్న సాయం చేయాలి!’’ ఆంజనేయ ప్రసాద్ నవ్వుతూ ప్రశాంతంగా అడిగాడు.‘‘నేనేం చేయగలను బాబూ!’’ మూర్తి అంతే ప్రశాంతంగా నవ్వుతూ సమాధానమిచ్చాడు.‘‘పార్థ్ధసారథి అని..’’‘‘పార్థూ నా మనవడు..’’ ఆంజనేయ ప్రసాద్ పూర్తి చేయకముందే మూర్తి అందుకొని జవాబు ఇచ్చేశాడు.‘‘ఆయన్ను ఒకసారి కలవాలి..’’ మూర్తి అనుమానంగా, భయంగా చూస్తూ కూర్చున్నాడు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదాయనకు. పార్థుని పిలవమని కాఫీ అందించడానికి వచ్చిన మనవరాలికి చెప్పాడు. ఆంజనేయ ప్రసాద్ ఆయనతో పాటు వచ్చిన టీమ్ అంతా కేసుకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటున్నారు. పార్థూ దగ్గర్నుంచి తాము ఎలాంటి ఆధారాలు సేకరించవచ్చు అన్న విషయంపైనే మాట్లాడుకుంటున్నారు.తన కోసం ఎవరో వచ్చారని తెలియగానే గార్డెన్ నుంచి హాల్లోకి బయలుదేరాడు పార్థు. సీబీఐ బృందాన్ని చూడగానే అతడిలో కొంత వణుకు. చెమటలు పడుతున్నాయి.పార్థు ఆంజనేయ ప్రసాద్‌కు దగ్గరగా వచ్చి నిలబడ్డాడు.‘‘ఆంజనేయ ప్రసాద్.. సీబీఐ’’ అంటూ తన చేతిలోని విజిటింగ్ కార్డు పార్థుకి ఇచ్చాడు ఆంజనేయ ప్రసాద్.కంగారుగానే కార్డును అందుకొని చూసి తిరిగిచ్చేశాడు పార్థు. ‘‘ఇంత ఈజీగా దొరుకుతారనుకోలేదు.’’ నవ్వుతూ అన్నాడు ఆంజనేయ ప్రసాద్.పార్థు మరింత భయపడ్డాడు. ఒళ్లంతా చెమటలు పట్టాయి. దొరికిపోయినట్లు నిలబడ్డాడు. ఇంటర్వెల్ పడింది. ఇంటర్వెల్ తర్వాత.. అదే ఇల్లు. సీబీఐ ఆఫీసర్, పార్థు ఎదురెదురుగా కూర్చున్నారు.‘‘ఏంటలా చూస్తున్నారూ? కానిస్టేబుల్ కూడా రాని ఇంటికి సీబీఐ వాళ్లు వచ్చారనా?’’ పార్థుని అడిగాడు ఆంజనేయ ప్రసాద్ చేతిలో ఉన్న కొన్ని పేపర్స్ తిరగేస్తూ.‘‘ఎందుకొచ్చారని!’’ పార్థు సమాధానమిచ్చాడు.‘‘కొంచెం పెద్ద కథే! చిన్నగా చెప్తాను. నలభై రోజుల క్రితం అపోజిషన్ లీడర్ శివారెడ్డి మర్డర్ జరిగింది.. మీకు తెలిసే ఉంటుంది! ఆయనను చంపినవాడు ట్రైన్ ఎక్కి పారిపోయాడు. అతడినెవ్వరూ చూడలేదు. బట్ అతడిని చేజ్ చేసిన ఎస్పీ వెనక నుంచి చూశాడు. సో ఆ ట్రైన్ గుడివాడలో ఆగినప్పుడు చొక్కా చూసి ఆ ఎస్పీ కాల్చాడు. బట్ ఆ కాల్పుల్లో హంతకుడు కాకుండా వేరేవాడు చనిపోయాడు. అతని వివరాలు మాకు దొరకలేదు. బట్ శవం ఉన్న కంపార్ట్మెంట్, సీట్ నంబర్స్‌ని బట్టి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఈ రిజర్వేషన్ చార్ట్ సంపాదించాం. ఇందులో మీ పేరు, వివరాలు ఉన్నాయి. బట్ యూ ఆర్ హియర్ అండ్ హెల్తీ!’’ కథంతా చెప్పుతూ వచ్చాడు ఆంజనేయ ప్రసాద్. పార్థు ఏమీ మాట్లడలేదు. ‘‘పార్థు మీరేగా?’’ అనుమానంగా మళ్లీ అడిగాడు ఆంజనేయ ప్రసాద్. అవునన్నట్టు తలూపాడు పార్థు. ‘‘వెల్! కమింగ్ టు ది పాయింట్.. మీరు రిజర్వ్ చేసుకున్న సీట్లో ఇంకొకరు ఎందుకు కూర్చున్నారు?’’ అడిగాడు ఆంజనేయ ప్రసాద్.‘‘విజయవాడలో మంచినీళ్ల కోసం దిగినప్పుడు ట్రైన్ మూవ్ అయిపోయింది. అక్కణ్నుంచి బై రోడ్ వచ్చాను. ఆ తర్వాత ఎవరు కూర్చున్నారో నాకు తెలీదు!’’‘‘వెల్ దెన్ మీరు విజయవాడలో ట్రైన్ దిగేముందు కంపార్ట్మెంట్లో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించారా?’’ అడిగాడు ఆంజనేయ ప్రసాద్. లేదన్నట్టు తలూపాడు పార్థు.ఆంజనేయ ప్రసాద్ ప్రశ్నల పరంపర కొనసాగుతూనే ఉంది. పార్థు తెలివిగా సమాధానాలు ఇస్తున్నాడు. దీనికి సంబంధించి మీకు ఏవైనా విషయాలు గుర్తొచ్చినా, తెలిసినా తనకు ఫోన్ చేసి చెప్పమంటూ ఆంజనేయ ప్రసాద్ కుర్చీలోంచి లేచాడు.‘‘నా దగ్గర మీ ఫోన్ నంబర్ లేదు’’ అన్నాడు పార్థు. ‘‘నో ప్రాబ్లమ్! నా కార్డు ఇస్తాను. మీకెప్పుడు గుర్తొస్తే అప్పుడు..’’ అంటూ విజిటింగ్ కార్డ్ చేతిలోకి తీసుకున్నాడు ఆంజనేయ ప్రసాద్.ఆయన టీమ్ అంతా ప్లాన్ ఫెయిలైందని నిరుత్సాహంగా నిలబడి చూస్తున్నారు.ఆ విజిటింగ్ కార్డు మీద పార్థు వేలి ముద్రలు ఉన్నాయి. కార్డుకు పౌడర్ అద్ది ఆంజనేయ ప్రసాద్ టీమ్ వేసిన ప్లాన్ అది.ఆంజనేయ ప్రసాద్ సహా టీమ్ అంతా అక్కణ్నుంచి వెళ్లిపోయారు. పార్థు తన చేతిలోని విజిటింగ్ కార్డుపై ఉన్న పౌడరును ఉఫ్ అని ఊది, ఆ కార్డును నలిపి పక్కనపడేశాడు. పార్థుగా ఆ ఇంటికి పరిచయమైన నందు.. తన స్టైల్లో!! -
అన్నీ అతిక్రమణలే...
సీతారాంబాగ్ అగ్నిప్రమాదం ఘటనలో వెలుగుచూస్తున్న నిజాలు అనుమతి జీప్లస్ 1కు... నిర్మించింది జీ ప్లస్ 4 అంతస్తులు నివాస భవనంలో వాణిజ్య కార్యకలాపాలు {పమాదాలు జరిగినప్పుడే అధికారుల హెచ్చరికలు.. ఆపై షరా మామూలే... సిటీబ్యూరో: అనుమతి తీసుకున్నది జీ ప్లస్ 1 నివాస గృహానికి...నిర్మాణం జరిపింది జీ ప్లస్ 4 అంతస్తులు. నిర్వహిస్తున్నది వాణిజ్య కార్యకలాపాలు(ప్లాస్టిక్ సామాన్ల గోదాము). ఇందుకు ట్రేడ్‌లెసైన్సు తీసుకున్నారా అంటే అదీ లేదు. ఇవీ ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగి కుప్పకూలిపోయిన సీతారాంబాగ్‌లోని భవనానికి సంబంధించిన వివరాలు. నగరంలో విచ్చలవిడిగా జరుగుతున్న అక్రమ నిర్మాణాలకు ఇదో ఉదాహరణ. అంతేకాదు.. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయకుండా కోర్టునుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. స్టే ఆర్డర్‌ను సైతం ఉల్లంఘించి నాలుగంతస్తులు నిర్మించారు. భారీ అగ్నిప్రమాదంతో ఆరా తీస్తే ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. లేని పక్షంలో వివరాలే తెలిసేవి కావు. ఇలాంటి అక్రమ నిర్మాణాలు నగరంలో అడుగడుగునా ఎన్నెన్నో. అయినప్పటికీ జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మరోవైపు అక్రమ నిర్మాణాలు కూల్చివేయకుండా కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకోవాల్సిందిగా సలహాలిచ్చేది కూడా జీహెచ్ఎంసీ సిబ్బందేననే ఆరోపణలకు ఊతమిచ్చేదిగా ఉంది ఈ ఘటన. కోర్టు స్టే ఆర్డర్‌ను కూడా ఉల్లంఘించి, అక్రమంగా జీప్లస్ నాలుగంతస్తులు నిర్మించి, దీన్ని క్రమబద్ధీకరించాల్సిందిగా కూడా భవన యజమాని బీఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకున్నారు. ఇలా భవనాలు అగ్నిప్రమాదాల బారిన పడినప్పుడో, లేక నిర్మాణం జరుగుతుండగానే కుప్పకూలినప్పుడు మాత్రమే అక్రమాలను సహించేది లేదని ప్రకటిస్తున్న యంత్రాంగం ఆ తర్వాత మిన్నకుంటోంది. దీంతో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. భవన నిర్మాణం వెనుక... సీతారాంబాగ్‌లో విజయ్‌సింగ్ అనే వ్యక్తి జీప్లస్ 1 అంతస్తుకు 2013లో జీహెచ్ఎంసీ సర్కిల్-7 కార్యాలయం నుంచి అనుమతి పొందారు. అనుమతి పొందిన ప్లాన్‌కు విరుద్ధంగా సెట్‌బ్యాక్స్ ఉల్లంఘలనకు పాల్పడ్డారు. అదనపు అంతస్తుల నిర్మాణాన్ని చేపట్టారు. అక్రమ నిర్మాణాన్ని గుర్తించిన టౌన్‌ప్లానింగ్‌అధికారులు 2014లో నోటీసులు జారీ చేసినప్పటికీ, వాటిని లెక్కచేయకుండా నిర్మాణ పనులు కొనసాగించారని జీహెచ్ఎంసీ కమిషనర్ పేర్కొన్నారు. మొదటి అంతస్తు సెంట్రింగ్ పనులు జరుగుతుండగా అడ్డుకోగా, యజమానితో పాటు స్థానిక నేతల నుంచి ఒత్తిళ్లు వచ్చాయని తెలిపారు. 2014 ఆగస్టు 14న షోకాజ్ నోటీసు జారీ చేశారు. షోకాజ్ నోటీసు అందాక నిర్మాణం ఆపి సిటీ సివిల్కోర్టునాశ్రయించి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. దాంతో అధికారులు తిరిగి దాని వైపు చూడలేదు. స్టే ఆర్డర్ సాకుతో కోర్టు ఉత్తర్వులను సైత ం ఉల్లంఘించి అక్రమంగా భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈకేసు జూనియర్ సివిల్‌కోర్టులో వచ్చే జూలై 5వ తేదీన విచారణకు రానుండగా, తాజాగా జరిగిన అగ్నిప్రమాదంతో వివరాలు వెలుగు చూశాయి. ఇలాంటి అక్రమ భవన నిర్మాణాలు నగరంలో వేలాదిగా ఉన్నాయి. బీఆర్ఎస్కు అందిన దాదాపు 1.40 లక్షల దరఖాస్తులే ఇందుకు నిదర్శనం. -
నల్లా...అక్రమాలు నిలువెల్లా!
వాణిజ్య భవంతులే అధికం ఏడాదిలో ఐదు వేలు గుర్తింపు సిటీబ్యూరో: గ్రేటర్లో తవ్వినకొద్దీ అక్రమ నల్లాల భాగోతం బయట పడుతోంది. వాణిజ్య భవంతులు, హోటళ్లు, హాస్టళ్లు, మాల్స్, మెస్‌లు, ఫంక్షన్ హాళ్ల వంటి వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తున్న భవనాలే ఈ జాబితాలో ముందుంటున్నాయి. జలమండలి విజిలెన్స్ విభాగం వరుస తనిఖీలతో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఏడాదిలో సుమారు ఐదు వేల అక్రమ కనెక్షన్ల గుట్టు రట్టయింది. జలమండలిలోని 16 నిర్వహణ డివిజన్ల పరిధిలో 8.64 లక్షల నల్లాలు ఉన్నాయి. అదనంగా సుమారు లక్ష వరకు అక్రమంగా ఉన్నట్లు అనధికారిక అంచనా. తనిఖీలు నిర్వహించినపుడే ఇవి బయట పడుతున్నాయి. భూమి లోపల ఉన్న నీటి సరఫరా పైపులైన్లకు కన్నాలు వేసి... కొందరు అక్రమార్కులునల్లాలను ఏర్పాటు చేసుకోవడం, వాటిపై యధావిధిగా మట్టి కప్పేయడంతో పసిగట్టడం కష్టమవుతోంది.స్థానికులు ఫిర్యాదు చేసినపుడు, రెవెన్యూ సిబ్బంది తనిఖీ చేసినపుడే ఇవి బయట పడుతుండడం గమనార్హం. జలమండలి ఖజానాకు చిల్లు నగరానికి గోదావరి, కృష్ణా జలాలను అందించే పైపులైన్లకు లీకేజీలు, అక్రమ నల్లాలు శాపంగా పరిణమిస్తుండడంతో జలమండలి ఖజనాకు భారీగా గండి పడుతోంది. సరఫరా నష్టాలు 40 శాతానికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. జలమండలికి నల్లా బిల్లులు, మురుగు శిస్తు, ట్యాంకర్ నీటి సరఫరా, నూతన కనెక్షన్లతో నెలకు రూ.89 కోట్ల ఆదాయం సమకూరుతోంది. నిర్వహణ వ్యయాలు, ఉద్యోగుల జీతభత్యాలు, మరమ్మతులకు రూ.91 కోట్లు ఖర్చవుతోంది. అంటే నెలకు రూ.2 కోట్ల నష్టాన్ని భరిస్తోంది. అక్రమ నల్లాల భరతం పడితే ఆదాయం రూ.100 కోట్లకు పైగానే సమకూరుతుందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. తనిఖీలతో గుట్టు రట్టు ఇటీవలి కాలంలో రెవెన్యూ ఆదాయం పెంచుకునేందుకు బోర్డు విజిలెన్స్ బృందం నగరంలో విస్తృత తనిఖీలు చేపట్టింది. కింగ్‌కోఠి, కొత్తపేట, ఎల్లారెడ్డిగూడ తదితర ప్రాంతాల్లో హోటళ్లు, హాస్టళ్లకు ఉన్న అక్రమ నల్లాల గుట్టును రట్టు చేసింది. అక్రమార్కులపై స్థానిక పోలీస్ స్టేషన్లలో ఐపీసీ 269, 430 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఇదే స్ఫూర్తితో ఇతర ప్రాంతాలపై దృష్టి సారిస్తేనే సత్ఫలితాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. క్రిమినల్ కేసులు అక్రమ నల్లా కనెక్షన్లు కలిగిన వారు తమ భవన విస్తీర్ణాన్ని బట్టి నిర్ణీత కనెక్షన్ చార్జీలు, పెనాల్టీ చెల్లించి క్రమబద్ధీకరించుకోవాలని జలమండలి అధికారులు సూచిస్తున్నారు. లేని పక్షంలో క్రిమినల్ కేసులు తప్పవని స్పష్టం చేస్తున్నారు. అక్రమ నల్లాలపై జలమండలి టోల్‌ఫ్రీ నెంబరు 155313కి ఫోన్ చేసి వివరాలు తెలపాలని కోరుతున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు. -
వినూత్న విధానాలతో ముందుకు!
సీఐఐ, ఫిక్కీ ప్రతినిధులతో ప్రధాని భేటీ... - పారిశ్రామిక రంగం కష్టాలపై దృష్టి - సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ... న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వాణిజ్య కార్యకలాపాల నిర్వహణలో వారికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వినూత్న రీతి ఆలోచనలతో ముందుకు పోవాలని సూచించారు. తయారీ రంగం వృద్ధే లక్ష్యంగా ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం విజయవంతానికి సంయుక్త కృషి జరగాలని పిలుపునిచ్చారు. రెండు ప్రముఖ పారిశ్రామిక సంఘాలు భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), భారత వాణిజ్య పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఫిక్కీ) ప్రతినిధులతో ఆయన వేర్వేరుగా భేటీ అయ్యారు. గత ఏడాది అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మోడీ ఈ తరహా భేటీ ఇదే తొలిసారి. మూలధన వ్యయాలు పెరగడం నుంచి సంక్లిష్ట పన్ను అంశాల వరకూ పారిశ్రామిక ప్రతినిధులు నరేంద్రమోదీ దృష్టికి తీసుకువెళ్లినట్లు ఫిక్కీ వర్గాలు వెల్లడించాయి. ప్రధాన మంత్రి కార్యాలయం సైతం ఈ చర్చలపై ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిప్రకారం... - అధిక మూలధన వ్యయాలు, రుణ సమీకరణలో వడ్డీల భారం, చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న పలు ఇబ్బందుల వల్ల దేశంలో పెట్టుబడులు ఊపందుకోవడం లేదని పారిశ్రామిక వేత్తలు పేర్కొన్నారు. - చమురు, ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగాలకు సంబంధించి దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితిని తగ్గించడానికి కేంద్రం ప్రయత్నిస్తుందని మోడీ హామీ. అలాగే పలు ప్రాజెక్టుల పురోగతిపై దృష్టి పెడుతుందని తెలిపారు. - విశ్వాసం, విధానాల్లో సంక్లిష్టతలను తొలగించడం, సాంకేతిక అభివృద్ధి వంటి అంశాల్లో మరింత ముందడుగు అవసరమని ప్రధాని సూచించారు. - కార్పొరేట్ బాధ్యతల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత అంశాలకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. - వ్యవసాయ ఉత్పత్తులు, జౌళి, రక్షణ సంబంధ తయారీ రంగం మరింత అభివృద్ధి సాధించాలి. నిరాశాజనక పరిస్థితి: మూడీస్ ఇదిలావుండగా, అంతర్జాతీయ రేటింగ్ దిగ్జజ సంస్థ మూడీస్... దేశంలో సంస్కరణల తీరు పట్ల నిరుత్సాహం నెలకొన్నట్లు తన తాజా నివేదికలో పేర్కొంది. ‘ఇన్సైడ్ ఇండియా’ పేరుతో రూపొందించిన ఈ నివేదికలో మూడీస్ ప్రత్యేకంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న నిరుత్సాహ ధోరణులను ప్రస్తావించింది. భారత్ సావరిన్ రేటింగ్‌కు సంబంధించి ఇది ‘క్రెడిట్ నెగిటివ్’ అని వివరించింది. విధాన ప్రతిష్టంభనపై ఆందోళనలు క్రమక్రమంగా పెరుగుతున్నట్లు అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7.5 శాతంగా మూడీస్ అంచనావేస్తోంది.