మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ తెలుగు సినిమాలో క్లాసిక్ అన్న పేరున్న ఒక సినిమాలోని సీన్స్ ఇవి. ఇంటర్వెల్ తర్వాతి సీన్ హీరోయిజాన్ని పీక్స్‌కు తీసుకెళ్లేలా ఉంటుంది. ఒక స్టార్ హీరో నటించారు ఈ సినిమాలో! దర్శక, రచయిత ఇప్పుడొక స్టార్ డైరెక్టర్. ఆ సినిమా ఏంటో చెప్పుకోండి చూద్దాం?
అది సత్యనారాయణ మూర్తి ఇల్లు. బాశర్లపూడి గ్రామం. ఒక రాజకీయ నాయకుడి హత్య కేసుకు సంబంధించి సత్యనారాయణ మూర్తి మనవడు పార్థసారథిని విచారించడానికి సీబీఐ ఆఫీసర్ ఆంజనేయ ప్రసాద్ వచ్చి మూర్తికి ఎదురుగా కూర్చున్నాడు. ‘‘మీరో చిన్న సాయం చేయాలి!’’ ఆంజనేయ ప్రసాద్ నవ్వుతూ ప్రశాంతంగా అడిగాడు.‘‘నేనేం చేయగలను బాబూ!’’ మూర్తి అంతే ప్రశాంతంగా నవ్వుతూ సమాధానమిచ్చాడు.‘‘పార్థ్ధసారథి అని..’’‘‘పార్థూ నా మనవడు..’’ ఆంజనేయ ప్రసాద్ పూర్తి చేయకముందే మూర్తి అందుకొని జవాబు ఇచ్చేశాడు.‘‘ఆయన్ను ఒకసారి కలవాలి..’’ మూర్తి అనుమానంగా, భయంగా చూస్తూ కూర్చున్నాడు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదాయనకు. పార్థుని పిలవమని కాఫీ అందించడానికి వచ్చిన మనవరాలికి చెప్పాడు.
ఆంజనేయ ప్రసాద్ ఆయనతో పాటు వచ్చిన టీమ్ అంతా కేసుకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటున్నారు. పార్థూ దగ్గర్నుంచి తాము ఎలాంటి ఆధారాలు సేకరించవచ్చు అన్న విషయంపైనే మాట్లాడుకుంటున్నారు.తన కోసం ఎవరో వచ్చారని తెలియగానే గార్డెన్ నుంచి హాల్లోకి బయలుదేరాడు పార్థు. సీబీఐ బృందాన్ని చూడగానే అతడిలో కొంత వణుకు. చెమటలు పడుతున్నాయి.పార్థు ఆంజనేయ ప్రసాద్‌కు దగ్గరగా వచ్చి నిలబడ్డాడు.‘‘ఆంజనేయ ప్రసాద్.. సీబీఐ’’ అంటూ తన చేతిలోని విజిటింగ్ కార్డు పార్థుకి ఇచ్చాడు ఆంజనేయ ప్రసాద్.కంగారుగానే కార్డును అందుకొని చూసి తిరిగిచ్చేశాడు పార్థు. ‘‘ఇంత ఈజీగా దొరుకుతారనుకోలేదు.’’ నవ్వుతూ అన్నాడు ఆంజనేయ ప్రసాద్.పార్థు మరింత భయపడ్డాడు. ఒళ్లంతా చెమటలు పట్టాయి. దొరికిపోయినట్లు నిలబడ్డాడు. ఇంటర్వెల్ పడింది.
ఇంటర్వెల్ తర్వాత.. అదే ఇల్లు. సీబీఐ ఆఫీసర్, పార్థు ఎదురెదురుగా కూర్చున్నారు.‘‘ఏంటలా చూస్తున్నారూ? కానిస్టేబుల్ కూడా రాని ఇంటికి సీబీఐ వాళ్లు వచ్చారనా?’’ పార్థుని అడిగాడు ఆంజనేయ ప్రసాద్ చేతిలో ఉన్న కొన్ని పేపర్స్ తిరగేస్తూ.‘‘ఎందుకొచ్చారని!’’ పార్థు సమాధానమిచ్చాడు.‘‘కొంచెం పెద్ద కథే! చిన్నగా చెప్తాను. నలభై రోజుల క్రితం అపోజిషన్ లీడర్ శివారెడ్డి మర్డర్ జరిగింది.. మీకు తెలిసే ఉంటుంది! ఆయనను చంపినవాడు ట్రైన్ ఎక్కి పారిపోయాడు. అతడినెవ్వరూ చూడలేదు. బట్ అతడిని చేజ్ చేసిన ఎస్పీ వెనక నుంచి చూశాడు. సో ఆ ట్రైన్ గుడివాడలో ఆగినప్పుడు చొక్కా చూసి ఆ ఎస్పీ కాల్చాడు. బట్ ఆ కాల్పుల్లో హంతకుడు కాకుండా వేరేవాడు చనిపోయాడు. అతని వివరాలు మాకు దొరకలేదు. బట్ శవం ఉన్న కంపార్ట్‌మెంట్, సీట్ నంబర్స్‌ని బట్టి రైల్వే డిపార్ట్‌మెంట్ నుంచి ఈ రిజర్వేషన్ చార్ట్ సంపాదించాం. ఇందులో మీ పేరు, వివరాలు ఉన్నాయి. బట్ యూ ఆర్ హియర్ అండ్ హెల్తీ!’’ కథంతా చెప్పుతూ వచ్చాడు ఆంజనేయ ప్రసాద్. పార్థు ఏమీ మాట్లడలేదు. ‘‘పార్థు మీరేగా?’’ అనుమానంగా మళ్లీ అడిగాడు ఆంజనేయ ప్రసాద్. అవునన్నట్టు తలూపాడు పార్థు.
‘‘వెల్! కమింగ్ టు ది పాయింట్.. మీరు రిజర్వ్ చేసుకున్న సీట్‌లో ఇంకొకరు ఎందుకు కూర్చున్నారు?’’ అడిగాడు ఆంజనేయ ప్రసాద్.‘‘విజయవాడలో మంచినీళ్ల కోసం దిగినప్పుడు ట్రైన్ మూవ్ అయిపోయింది. అక్కణ్నుంచి బై రోడ్ వచ్చాను. ఆ తర్వాత ఎవరు కూర్చున్నారో నాకు తెలీదు!’’‘‘వెల్ దెన్ మీరు విజయవాడలో ట్రైన్ దిగేముందు కంపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించారా?’’ అడిగాడు ఆంజనేయ ప్రసాద్. లేదన్నట్టు తలూపాడు పార్థు.ఆంజనేయ ప్రసాద్ ప్రశ్నల పరంపర కొనసాగుతూనే ఉంది. పార్థు తెలివిగా సమాధానాలు ఇస్తున్నాడు. దీనికి సంబంధించి మీకు ఏవైనా విషయాలు గుర్తొచ్చినా, తెలిసినా తనకు ఫోన్ చేసి చెప్పమంటూ ఆంజనేయ ప్రసాద్ కుర్చీలోంచి లేచాడు.‘‘నా దగ్గర మీ ఫోన్ నంబర్ లేదు’’ అన్నాడు పార్థు. ‘‘నో ప్రాబ్లమ్! నా కార్డు ఇస్తాను. మీకెప్పుడు గుర్తొస్తే అప్పుడు..’’ అంటూ విజిటింగ్ కార్డ్ చేతిలోకి తీసుకున్నాడు ఆంజనేయ ప్రసాద్.ఆయన టీమ్ అంతా ప్లాన్ ఫెయిలైందని నిరుత్సాహంగా నిలబడి చూస్తున్నారు.ఆ విజిటింగ్ కార్డు మీద పార్థు వేలి ముద్రలు ఉన్నాయి. కార్డుకు పౌడర్ అద్ది ఆంజనేయ ప్రసాద్ టీమ్ వేసిన ప్లాన్ అది.ఆంజనేయ ప్రసాద్ సహా టీమ్ అంతా అక్కణ్నుంచి వెళ్లిపోయారు. పార్థు తన చేతిలోని విజిటింగ్ కార్డుపై ఉన్న పౌడరును ఉఫ్ అని ఊది, ఆ కార్డును నలిపి పక్కనపడేశాడు. పార్థుగా ఆ ఇంటికి పరిచయమైన నందు.. తన స్టైల్లో!!
Comments
Please login to add a commentAdd a comment