నూరేళ్ల గురుదత్‌ | Sakshi Editorial On Guru Dutt | Sakshi
Sakshi News home page

నూరేళ్ల గురుదత్‌

Published Mon, Jul 8 2024 4:55 AM | Last Updated on Mon, Jul 8 2024 4:55 AM

Sakshi Editorial On Guru Dutt

‘నువ్వు కమ్యూనిస్టువా?’... ‘కాదు. కార్టూనిస్టుని’.... ‘నీకు మంచి జీవితం తెలియక ఈ దిక్కుమాలిన కొంపను ఇల్లు అనుకుంటున్నావు’... ‘దాన్దేముంది... మీకు ఫుట్‌పాత్‌ల మీద బతుకుతున్న లక్షల మంది గురించి తెలియదు. నేను వాళ్ల కంటే మెరుగే’... ‘నువ్వు నౌకరువి! గుర్తుంచుకో’... ‘నౌకర్‌నైతే? తల ఎత్తి మాట్లాడకూడదా?’... గురుదత్‌ సినిమాల్లోని డైలాగ్స్‌ ఇవి. 

దేశానికి స్వతంత్రం వచ్చి గొప్ప జీవితాన్ని వాగ్దానం చేశాక కూడా, ఎక్కడా ఆ వాగ్దానం నెరవేరే దారులు లేక, ఉద్యోగ ఉపాధులు లేక, పేదరికం పీడిస్తూ, మనుషుల్లో స్వార్థం, రాక్షసత్వం దద్దరిల్లుతున్న కాలంలో ‘ఇన్‌సాన్‌ కా నహీ కహీ నామ్‌ ఔర్‌ నిషాన్‌’ అనిపించిన ఒక భావుకుడు, దయార్ద్ర హృదయుడు, ఎదుటి వారి కళ్లల్లో నాలుగు కన్నీటి చుక్కలు చూడగానే సొమ్మసిల్లే దుర్బల మానసిక స్వరూపుడు గురుదత్‌ వచ్చి ఆడిన కళాత్మక నిష్ఠూరమే అతడి సినిమాలు. 

స్వతంత్రం వచ్చిన పదేళ్లకు ‘ప్యాసా’ తీసి ‘జిన్హే నాజ్‌ హై హింద్‌ పర్‌ ఓ కహా హై’ అని ప్రశ్నించాడు. స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఏదో ఒక పాదధూళి దొరికితే కష్టాల నుంచి బయట పడదామనుకునే∙కోట్లాది నిరుపేదలను చూసి నేటికీ అనవలసిందే కదా– ‘దేశాన్ని చూసి గర్వపడే పెద్దలారా... మీరెక్కడ?’కలకత్తాలో బాల్యం గడిపిన గురుదత్‌  ఇంటెదురు ఖాళీ జాగాలో జరిగే తిరునాళ్లలోని పేద కళాకారుల ఆటపాటలతో స్ఫూర్తి పొందాడు. అతనూ డాన్స్‌ చేస్తే ఆ సుకుమార రూపం అద్భుతంగా మెలికలు తిరిగేది. డాన్స్‌ అతణ్ణి నాటి ప్రఖ్యాత డాన్సర్‌ ఉదయ్‌శంకర్‌ దగ్గరకు చేర్చింది. 

ఆ తర్వాత పూణేకు! అక్కడ ప్రభాత్‌ థియేటర్‌లో డాన్స్‌మాస్టర్‌గా, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా అన్నింటికీ మించి దేవ్‌ ఆనంద్‌ స్నేహితుడిగా దారి మొదలెట్టాడు. బెంగాల్‌ పురోగామి ధోరణి, చదివిన పుస్తకాలతో ఏర్పరుచుకున్న బౌద్ధిక విమర్శ కళలో ఏం చెప్పాలో తెలిపాయి. అయితే సినిమా వ్యాపారకళ. వ్యాపారాన్నీ, కళనూ, ఆదర్శాన్నీ కలిపి నడిపించడం కష్టమైన పని. కాని ఆ పనిని గొప్పగా చేయగలిగిన జీనియస్‌ గురుదత్‌. అతనికి ముందు సినిమాల్లో డైలాగ్‌ ఉంది. 

గురుదత్‌ వచ్చి... ఆ డైలాగ్‌ చెప్పే సందర్భంలో తెర కవిత్వాన్ని చిందడం చూపగలిగాడు. అతనికి ముందు సినిమాల్లో వెలుతురూ చీకటీ ఉంది. గురుదత్‌ వచ్చి... వెలుగునీడల గాఢ పెనవేతను తెరపై నిలిపాడు. అతనికి ముందు సినిమాల్లో పాత్రలున్నాయి. గురుదత్‌ వచ్చి ఆ పాత్రల ప్రాంతం, మాట, నడత నిక్కచ్చి చేశాడు. ‘ఆర్‌ పార్‌’ (1954)తో ఈ ముద్ర మొదలైంది. ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ 55’ (1955), ‘ప్యాసా’ (1957), ‘కాగజ్‌ కే ఫూల్‌’ (1959), ‘చౌద్‌వీ కా చాంద్‌’ (1960), ‘సాహిబ్‌ బీబీ ఔర్‌ గులామ్‌’ (1962)ల వరకూ ఇదే ధోరణి కొనసాగింది. గాయని షంషాద్‌ బేగం అంది– ‘ఏ సినిమా తీసినా నిజాయితీతో తీశాడు. తప్పుడుతనంతో ఒక్కటీ తీయలేదు’.

‘ప్యాసా’ క్లయిమాక్స్‌లో కవి పాత్రలో ఉన్న గురుదత్‌ పునరుత్థానం చెందుతాడు. సినిమాలో అతడు మరణించాడని జనం భావించాకే గుర్తింపు పొందుతాడు. నిజజీవితంలో కూడా అదే జరిగింది. పెద్ద హీరోల, దర్శకుల సినిమాల మధ్యలో... గురుదత్‌ జీవించి ఉండగా పేరు రాలేదు. మరణించాక కూడా రాలేదు. 

1980లలో విదేశాలలో అతడి సినిమాలు ప్రదర్శింపబడి ప్రశంసలు దక్కాకే గురుదత్‌ పేరుకు ఉన్న మసి తొలిగింది. రాజ్‌కపూర్‌ ‘కాగజ్‌ కే ఫూల్‌’ చూసి ‘ఇది కాలం కంటే ముందే తీశాడు. రాబోయే తరాలే దీనిని పూజిస్తాయి’ అన్నాడు. అదే జరిగింది. నేడా సినిమా ప్రపంచంలోని ఎనిమిది యూనివర్సిటీల్లో పాఠ్యాంశంగా ఉంది.

‘80 శాతం నటన నటీనటుల కళ్లతోనే పూర్తవుతుంది. మనం మనిషి కళ్లల్లో చూస్తాం. నటన కూడా అక్కడే తెలియాలి’ అనేవాడు గురుదత్‌. అతని సినిమాల్లో టైట్‌ క్లోజప్స్, కళ్లు చేసే అభినయం పాత్రలను ప్రేక్షకులతో కనెక్ట్‌ చేస్తాయి. తీయబోయే పాట ఎలా ఉంటుందో ముందే తెలుసు కనుక రికార్డింగ్‌ సమయంలో ఆశా భోంస్లే ఎదురుగా నిలబడి గురుదత్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తూ ఉంటే ఆమె వాటికి తగినట్టుగా ఒయ్యారాలు పోతూ పాడిందట. 

‘భవరా బడా నాదాన్‌ హై’ వినండి తెలుస్తుంది. గురుదత్‌ మన తెలుగు వహీదా రెహమాన్‌ను స్టార్‌ని చేశాడు. బద్రుద్దీన్‌ అనే బస్‌ కండక్టర్‌ని జానీవాకర్‌ అనే స్టార్‌ కమెడియన్‌ని చేశాడు. ఎస్‌.డి.బర్మన్, ఓపి నయ్యర్‌లతో సాహిర్‌ లుధియాన్వీ, మజ్రూ సుల్తాన్‌పురి, కైఫీ ఆజ్మీలతో అత్యుత్తమమైన పాటలను ఇచ్చాడు. సినిమాటోగ్రాఫర్‌ వి.కె.మూర్తి, రచయిత అబ్రార్‌ అల్వీల గొప్పతనం చాటాడు.

వసంత కుమార్‌ పడుకోన్‌ అలియాస్‌ గురుదత్‌ జూలై 9, 1925న జన్మించి కేవలం 39 సంవత్సరాలు జీవించాడు. 14 ఏళ్ల కెరీర్‌లో గొప్ప గొప్ప క్లాసిక్స్‌ తీశాడు. గాయని గీతాదత్‌ను వివాహం చేసుకుని, వహీదా రెహమాన్‌ సాన్నిహిత్యం కోరి ఛిద్ర గృహజీవనం సాగించాడు. కాగితపు పూలకే అందలం దక్కే సంఘనీతికి కలత చెంది అర్ధంతరంగా జీవితం నుంచి నిష్క్రమించాడు. 

రేపటి నుంచి అతని శత జయంతి సంవత్సరం మొదలు. ‘ప్యాసా’ క్లయిమాక్స్‌లో ‘మనిషి నుంచి మనిషితనాన్ని లాక్కునే సమాజం మీదే నా ఫిర్యాదు’ అంటాడు గురుదత్‌. ఆ ఫిర్యాదు అవసరం మరింతగా పెరిగిన రోజులివి. గురుదత్‌ను పునర్‌ దర్శించాల్సిన సందర్భం. అవును. మెడలో ముళ్లహారం పడినా ముందుకేగా నడక.

హమ్‌నెతో జబ్‌ కలియా మాంగీ కాంటోంకా హార్‌ మిలా
జానే ఓ కైసే లోగ్‌ థే జిన్‌ కే ప్యార్‌ కో ప్యార్‌ మిలా... 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement