Guru Dutt
-
నూరేళ్ల గురుదత్
‘నువ్వు కమ్యూనిస్టువా?’... ‘కాదు. కార్టూనిస్టుని’.... ‘నీకు మంచి జీవితం తెలియక ఈ దిక్కుమాలిన కొంపను ఇల్లు అనుకుంటున్నావు’... ‘దాన్దేముంది... మీకు ఫుట్‌పాత్‌ల మీద బతుకుతున్న లక్షల మంది గురించి తెలియదు. నేను వాళ్ల కంటే మెరుగే’... ‘నువ్వు నౌకరువి! గుర్తుంచుకో’... ‘నౌకర్నైతే? తల ఎత్తి మాట్లాడకూడదా?’... గురుదత్ సినిమాల్లోని డైలాగ్స్ ఇవి. దేశానికి స్వతంత్రం వచ్చి గొప్ప జీవితాన్ని వాగ్దానం చేశాక కూడా, ఎక్కడా ఆ వాగ్దానం నెరవేరే దారులు లేక, ఉద్యోగ ఉపాధులు లేక, పేదరికం పీడిస్తూ, మనుషుల్లో స్వార్థం, రాక్షసత్వం దద్దరిల్లుతున్న కాలంలో ‘ఇన్సాన్ కా నహీ కహీ నామ్ ఔర్ నిషాన్’ అనిపించిన ఒక భావుకుడు, దయార్ద్ర హృదయుడు, ఎదుటి వారి కళ్లల్లో నాలుగు కన్నీటి చుక్కలు చూడగానే సొమ్మసిల్లే దుర్బల మానసిక స్వరూపుడు గురుదత్ వచ్చి ఆడిన కళాత్మక నిష్ఠూరమే అతడి సినిమాలు. స్వతంత్రం వచ్చిన పదేళ్లకు ‘ప్యాసా’ తీసి ‘జిన్హే నాజ్ హై హింద్ పర్ ఓ కహా హై’ అని ప్రశ్నించాడు. స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఏదో ఒక పాదధూళి దొరికితే కష్టాల నుంచి బయట పడదామనుకునే∙కోట్లాది నిరుపేదలను చూసి నేటికీ అనవలసిందే కదా– ‘దేశాన్ని చూసి గర్వపడే పెద్దలారా... మీరెక్కడ?’కలకత్తాలో బాల్యం గడిపిన గురుదత్ ఇంటెదురు ఖాళీ జాగాలో జరిగే తిరునాళ్లలోని పేద కళాకారుల ఆటపాటలతో స్ఫూర్తి పొందాడు. అతనూ డాన్స్ చేస్తే ఆ సుకుమార రూపం అద్భుతంగా మెలికలు తిరిగేది. డాన్స్ అతణ్ణి నాటి ప్రఖ్యాత డాన్సర్ ఉదయ్‌శంకర్ దగ్గరకు చేర్చింది. ఆ తర్వాత పూణేకు! అక్కడ ప్రభాత్ థియేటర్లో డాన్స్‌మాస్టర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా అన్నింటికీ మించి దేవ్ ఆనంద్ స్నేహితుడిగా దారి మొదలెట్టాడు. బెంగాల్ పురోగామి ధోరణి, చదివిన పుస్తకాలతో ఏర్పరుచుకున్న బౌద్ధిక విమర్శ కళలో ఏం చెప్పాలో తెలిపాయి. అయితే సినిమా వ్యాపారకళ. వ్యాపారాన్నీ, కళనూ, ఆదర్శాన్నీ కలిపి నడిపించడం కష్టమైన పని. కాని ఆ పనిని గొప్పగా చేయగలిగిన జీనియస్ గురుదత్. అతనికి ముందు సినిమాల్లో డైలాగ్ ఉంది. గురుదత్ వచ్చి... ఆ డైలాగ్ చెప్పే సందర్భంలో తెర కవిత్వాన్ని చిందడం చూపగలిగాడు. అతనికి ముందు సినిమాల్లో వెలుతురూ చీకటీ ఉంది. గురుదత్ వచ్చి... వెలుగునీడల గాఢ పెనవేతను తెరపై నిలిపాడు. అతనికి ముందు సినిమాల్లో పాత్రలున్నాయి. గురుదత్ వచ్చి ఆ పాత్రల ప్రాంతం, మాట, నడత నిక్కచ్చి చేశాడు. ‘ఆర్ పార్’ (1954)తో ఈ ముద్ర మొదలైంది. ‘మిస్టర్ అండ్ మిసెస్ 55’ (1955), ‘ప్యాసా’ (1957), ‘కాగజ్ కే ఫూల్’ (1959), ‘చౌద్వీ కా చాంద్’ (1960), ‘సాహిబ్ బీబీ ఔర్ గులామ్’ (1962)ల వరకూ ఇదే ధోరణి కొనసాగింది. గాయని షంషాద్ బేగం అంది– ‘ఏ సినిమా తీసినా నిజాయితీతో తీశాడు. తప్పుడుతనంతో ఒక్కటీ తీయలేదు’.‘ప్యాసా’ క్లయిమాక్స్‌లో కవి పాత్రలో ఉన్న గురుదత్ పునరుత్థానం చెందుతాడు. సినిమాలో అతడు మరణించాడని జనం భావించాకే గుర్తింపు పొందుతాడు. నిజజీవితంలో కూడా అదే జరిగింది. పెద్ద హీరోల, దర్శకుల సినిమాల మధ్యలో... గురుదత్ జీవించి ఉండగా పేరు రాలేదు. మరణించాక కూడా రాలేదు. 1980లలో విదేశాలలో అతడి సినిమాలు ప్రదర్శింపబడి ప్రశంసలు దక్కాకే గురుదత్ పేరుకు ఉన్న మసి తొలిగింది. రాజ్‌కపూర్ ‘కాగజ్ కే ఫూల్’ చూసి ‘ఇది కాలం కంటే ముందే తీశాడు. రాబోయే తరాలే దీనిని పూజిస్తాయి’ అన్నాడు. అదే జరిగింది. నేడా సినిమా ప్రపంచంలోని ఎనిమిది యూనివర్సిటీల్లో పాఠ్యాంశంగా ఉంది.‘80 శాతం నటన నటీనటుల కళ్లతోనే పూర్తవుతుంది. మనం మనిషి కళ్లల్లో చూస్తాం. నటన కూడా అక్కడే తెలియాలి’ అనేవాడు గురుదత్. అతని సినిమాల్లో టైట్ క్లోజప్స్, కళ్లు చేసే అభినయం పాత్రలను ప్రేక్షకులతో కనెక్ట్ చేస్తాయి. తీయబోయే పాట ఎలా ఉంటుందో ముందే తెలుసు కనుక రికార్డింగ్ సమయంలో ఆశా భోంస్లే ఎదురుగా నిలబడి గురుదత్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటే ఆమె వాటికి తగినట్టుగా ఒయ్యారాలు పోతూ పాడిందట. ‘భవరా బడా నాదాన్ హై’ వినండి తెలుస్తుంది. గురుదత్ మన తెలుగు వహీదా రెహమాన్‌ను స్టార్‌ని చేశాడు. బద్రుద్దీన్ అనే బస్ కండక్టర్ని జానీవాకర్ అనే స్టార్ కమెడియన్ని చేశాడు. ఎస్.డి.బర్మన్, ఓపి నయ్యర్లతో సాహిర్ లుధియాన్వీ, మజ్రూ సుల్తాన్‌పురి, కైఫీ ఆజ్మీలతో అత్యుత్తమమైన పాటలను ఇచ్చాడు. సినిమాటోగ్రాఫర్ వి.కె.మూర్తి, రచయిత అబ్రార్ అల్వీల గొప్పతనం చాటాడు.వసంత కుమార్ పడుకోన్ అలియాస్ గురుదత్ జూలై 9, 1925న జన్మించి కేవలం 39 సంవత్సరాలు జీవించాడు. 14 ఏళ్ల కెరీర్లో గొప్ప గొప్ప క్లాసిక్స్ తీశాడు. గాయని గీతాదత్ను వివాహం చేసుకుని, వహీదా రెహమాన్ సాన్నిహిత్యం కోరి ఛిద్ర గృహజీవనం సాగించాడు. కాగితపు పూలకే అందలం దక్కే సంఘనీతికి కలత చెంది అర్ధంతరంగా జీవితం నుంచి నిష్క్రమించాడు. రేపటి నుంచి అతని శత జయంతి సంవత్సరం మొదలు. ‘ప్యాసా’ క్లయిమాక్స్‌లో ‘మనిషి నుంచి మనిషితనాన్ని లాక్కునే సమాజం మీదే నా ఫిర్యాదు’ అంటాడు గురుదత్. ఆ ఫిర్యాదు అవసరం మరింతగా పెరిగిన రోజులివి. గురుదత్ను పునర్ దర్శించాల్సిన సందర్భం. అవును. మెడలో ముళ్లహారం పడినా ముందుకేగా నడక.హమ్నెతో జబ్ కలియా మాంగీ కాంటోంకా హార్ మిలాజానే ఓ కైసే లోగ్ థే జిన్ కే ప్యార్ కో ప్యార్ మిలా... -
భార్య కోసం ప్రేమను త్యాగం చేసిన స్టార్ హీరో
గురుదత్ ప్రస్తావన లేకుండా భారతీయ సినిమాపై ఏ టాక్ పూర్తి కాదు . హిందీ చలనచిత్ర చరిత్రలో దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా త్రిపాత్రాభినయంతో మెప్పించాడు. ఇండియన్ సినిమాపై చెరగని ముద్రవేసి చిరు ప్రాయంలోనే (39 ఏళ్లు) నిజ జీవిత చిత్రం నుంచి తెరమరుగైన గురు దత్‌ను ఇప్పటికీ గుర్తు చేసుకునే వారు ఉంటారంటే ఏం ఆశ్చర్యం కలుగదు. 1957లో విడుదలైన గురుదత్ మాస్టర్ పీస్ ‘ప్యాసా’. ఇప్పటి వారికి ఆ సినిమా పెద్దగా పరిచయం ఉండదు కానీ అప్పట్లో అదొక సంచలనం. హీందీ ఆల్-టైమ్ 100 ఉత్తమ చలనచిత్రాల జాబితాలో ప్యాసా ఉండటంలో ఆశ్చర్యం లేదు.ఆయన జీవితంలో పెళ్లి, ప్రేమ రెండూ ప్రత్యేకమే.. (గురుదత్- వహీదా రెహమాన్) వహీదా కోసం హీరోగా మారిన గురుదత్ ‘ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా..’ అంటూ తెలుగు ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ నటి వహీదా రెహమాన్. 1955లో ‘రోజులు మారాయి’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత వరుసగా తమిళ సినిమాలు చేసింది. ఈ క్రమంలో ఆమె దర్శకుడు గురుదత్ దృష్టిలో పడింది. ఆమె అందానికి, నటనకి ఫిదా అయిన గురుదత్ ‘సీఐడీ’ అనే సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ చేశాడు. అలా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది వహిదా. 1956లో విడుదలైన ఆ చిత్రం..అప్పటికి అత్యధిక కలెక్షన్లను రాబట్టిన ఇండియన్ సినిమాగా చరిత్రకెక్కింది. వహిదా అందానికి ముగ్ధుడైన డైరెక్టర్ గురుదత్ ఆమె కోసం హీరోగా అవతారమెత్తాడు. వహిదా కోసం ‘ప్యాసా’ చిత్రంలో కూడా హీరోగా నటించాడు. వాస్తవానికి తొలుత ఆ సినిమాకు హీరో దిలీప్ కుమార్. అయితే వహిదా రెహమాన్ హీరోయిన్గా చేస్తుందని తెలియడంతో దిలీప్ని తప్పించి తనే హీరోగా నటించాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలో వహిదాకి గురుదత్ క్లోజ్ అయ్యాడు. తొలుత ఇద్దరి మంచి స్నేహితులుగా కొనసాగారు. కొన్నాళ్ల తర్వాత అది ప్రేమగా మారింది. ట్విస్ట్ ఇచ్చిన గురుదత్ వహీదా రెహమాన్‌కు తొలి బాలీవుడ్ సినిమా ఇచ్చిన గురుదత్.. కొన్నాళ్ల తర్వాత ఆమెకు ప్రపోజ్ చేశాడు. వహిదా కూడా అతన్ని ఇష్టపడింది. అయితే అప్పటికే గురుదత్‌కు పెళ్లి అయింది. 1953లో ప్రముఖ గాయని గీతాదత్‌ని గురుదత్ పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం వహిదాకు తెలియదు. గురుదత్ కూడా దాచి పెట్టాడు. కానీ ‘ప్యాసా’ సినిమా విడుదలకు ముందే వీరిద్దరి ప్రేమ వ్యవహారం బయటి ప్రపంచానికి తెలిసింది. ఒకనొక దశతో గురుదత్ భార్యకు విడాకులు ఇచ్చి వహిదాను పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వినిపించాయి. (సతీమణి గీతాదత్తో గురుదత్) భార్య కోసం ప్రేమ త్యాగం గురుదత్- వహిదా రెహమాన్‌ల ప్రేమ వ్యవహారం గీతాదత్‌కు కూడా తెలిసింది. భర్తతో గొడవకు దిగింది. కొన్నాళ్ల తర్వాత పిల్లలతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. వేరుగా జీవించడం ప్రారంభించింది. ఫ్యామిలీ అంతా దూరం అవ్వడాన్ని గురుదత్ తట్టుకోలేకపోయాడు. భార్య, పిల్లలు తిరిగి తన వద్దకు రావాలంటే.. ప్రేమను త్యాగం చేయాల్సిందే అనుకున్నాడు. అందుకే వహిదాను దూరం పెట్టడం ప్రారంభించాడు. కొన్నాళ్లకు గీతా దత్ తిరిగి ఇంటికొచ్చింది. గురుదత్ చాలా రోజుల వరకు వహిదాను మర్చిపోలేదట. ఆమె తలుచుకుంటూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడని అతని సన్నిహితులు చెప్పేవారు. కుంగిపోయిన వహీదా ప్రేమ విఫలం కావడంతో వహిదా కుంగిపోయింది. గురుదత్‌ని మర్చిపోవడానికి వరుస సినిమాలను ఒప్పుకుంది. నటిగా బీజీ అయింది. దేవ్ ఆనంద్‌తో ఎక్కువ సినిమా చేయడంతో అతనితో ప్రేమలో పడిందనే వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే అదంతా ఒట్టి పుకారు మాత్రమే. గురుదత్ తర్వాత ఆమె ఎవరినీ ప్రేమించలేదు. 1974లో బాలీవుడ్ నటుడు శషిరేఖీని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు సోహైల్ రేఖీ, కాశ్వీ రేఖీ ఉన్నారు. 2000 సంవత్సరంలో శషిరేఖీ చనిపోయాడు. ప్రస్తుతం వహిదా ముంబైలో పిల్లలతో కలిసి ఉంటోంది. మిస్టరీగా గురుదత్ మరణం వహిదా రెహమాన్ దూరం కావడంతో గురుదత్ కాపురంలో కూడా చిచ్చు రేగింది రేపింది. గురుదత్ మరణించినప్పుడు, భార్యతో కాక, ఒంటరిగానే ఉన్నాడు. అక్టోబరు 10, 1964 రోజు గురుదత్ తన మంచంలో చనిపోయి కనిపించాడు. మద్యం ఎక్కువైందో లేక నిద్రమాత్రలు అతిగా మింగాడో ఎవరికీ తెలియదు. ఆయన మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ‘ఇన్ సర్చ్ ఆఫ్ గురుదత్’ పేరిట 1989లో డాక్యుమెంటరీ వచ్చింది. ఆయన బయోపిక్ నిర్మాణం కోసం బాలీవుడ్ డైరెక్టర్ భావనా తల్వార్ స్క్రిప్ట్‌ను పూర్తి చేశారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్తుందని గతంలో ప్రకటించారు. - పోడూరి నాగ ఆంజనేయులు -
రివ్యూయర్లూ.. బహుపరాక్, తప్పుడు రివ్యూ రాస్తే మరణమే..!
సినిమా రిలీజైతే సమీక్షకులు స్టార్లు ఇస్తారు. కాని ఒక సీరియల్ కిల్లర్ బయల్దేరి ఆ రివ్యూలు రాసే వారిని హత్య చేసి వారి నుదుటిన స్టార్లు ఇస్తుంటే? మనం నమ్మినా నమ్మకపోయినా ‘రివ్యూల మాఫియా’ ఒకటి ఉంది.మంచి సినిమాలు చెత్త రివ్యూలను పొందితే ఆ దర్శకుడికి ఎంత బాధ? అలాంటి వాడు సీరియల్ కిల్లర్‌గా మారితే? ఊహ కొంచెం అతిగా ఉన్నా దర్శకుడు బాల్కి ఈ సినిమా తీశాడు.సన్నిడియోల్, పూజా భట్, దుల్కర్ సల్మాన్ నటించారు.వచ్చే వారమే ‘చుప్’ విడుదల.రివ్యూయర్లూ... బహుపరాక్! అన్నట్టు నాడు ‘కాగజ్ కే ఫూల్’ సినిమా మీద చెత్త రివ్యూలు రాయడం వల్ల సినిమాలే మానుకున్న గురుదత్‌కు ఈ సినిమా నివాళి. బహుశా ఈ సినిమా రివ్యూయర్ల బాధితులందరి ఒక సృజనాత్మక ప్రతీకారం. కష్టపడి నెలల తరబడి సినిమా తీస్తే, రెండు గంటల పాటు హాల్లో చూసి ఆ వెంటనే తీర్పులు చెప్పేసి ‘సినిమా చూద్దామనుకునేవాళ్లను’ ఇన్ఫ్లూయెన్స్ చేసే రివ్యూయర్ల మీద బదులు తీర్చుకుందామని ఎవరైనా అనుకుని ఉంటే, కనీసం ఊహల వరకు వారిని సంతృప్తిపరిచే పని దర్శకుడు బాల్కి నెత్తికెత్తుకున్నాడు. బాల్కి అంటే ‘చీనీ కమ్’, ‘పా’, ‘పాడ్మేన్’ వంటి సినిమాల దర్శకుడు. ఇప్పుడు ‘చుప్’ సినిమా తీశాడు. సెప్టెంబర్ 23 విడుదల. సన్ని డియోల్, పూజా భట్ వంటి సీనియర్లు, దుల్కర్ సల్మాన్ వంటి యువ స్టార్లు ఈ సినిమాలో ఉన్నారు. ఇది ‘సైకలాజికల్ థ్రిల్లర్’. ‘రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ఇక్కడ ఆర్టిస్ట్ అంటే కళాకారుడు అని అర్థం. యూట్యూబ్‌లో ఉన్న ట్రైలర్లో సీరియల్ హంతకుడు రివ్యూయర్లను చంపడం, వారి నుదుటి మీద స్టార్లు ఇవ్వడం కనిపిస్తుంది. ఆ సీరియల్ కిల్లర్ పాత్రను పోషించిందెవరో ఇప్పటికి సస్పెన్స్. సన్ని డియోల్ మాత్రం పోలీస్ ఆఫీసర్‌గా చేశాడు. పూజా భట్ నిర్మాతగానో అలాంటి పాత్రగానో కనిపిస్తోంది. దుల్కర్ పాత్ర ఏమిటనేది తెలియడం లేదు. రివ్యూయర్‌ను చంపుతున్న సీరియల్ కిల్లర్ ‘స్టార్లు ఇవ్వడం కాదు. సినిమాను ప్రేక్షకులు అర్థం చేసుకోవడంలో సాయం చేయ్. అంతే తప్ప నోటికొచ్చినట్టు రాయడం కాదు’ అంటుంటాడు. అంటే ఇదంతా అరాకొరా జ్ఞానంతో రివ్యూలు రాసేవారి భరతం పట్టడం అన్నమాట. ఊరికే ఉండాలా? సినిమా ఎలా ఉన్నా ఊరికే (చుప్) ఉండాలా? అలా ఉండాల్సిన పని లేదు. కాని ఒక సినిమాను సరిగ్గా అర్థం చేసుకుని సరిగ్గా వ్యాఖ్యానం చేస్తున్నామా? సినిమాకు మేలు చేసేలా వ్యాఖ్యానం ఉందా... కళాకారుల కళను ఎద్దేవా చేసేలా ఉందా? అనాలోచితంగా వ్యాఖ్యలు చేస్తే అవి సినిమాను దెబ్బ తీస్తే బాధ్యులు ఎవరు? విమర్శ కూడా సినిమా తీసిన వారిని ఆలోచింప చేసేలా ఉండాలి కాని బాధ పెట్టేలా ఉండొచ్చా? మాటలు పెట్టే బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో ఎవరైనా అంచనా కట్టగలరా? మాటలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి. అందుకే ‘తెలిస్తే మాట్లాడండి. లేకుంటే నోర్మూసుకొని ఉండండి’ అనే అర్థంలో బాల్కి ఈ సినిమా తీశాడు. ట్రైలర్‌కి ఒక రివ్యూయర్ (లంచం తీసుకుని) చెత్త సినిమాకు నాలుగు స్టార్లు ఇస్తే అలాంటి వాణ్ణి కూడా సీరియల్ కిల్లర్ చంపుతూ కనపడతాడు. అంటే బాగున్న సినిమాను చెత్త అన్నా, చెత్త సినిమాను బాగుంది అన్నా ఈ సీరియల్ కిల్లర్ బయలుదేరుతాడన్నమాట. సోషల్ మీడియా చేతిలోకి వచ్చాక ప్రతి ఒక్కరూ రివ్యూయర్ అవతారం ఎత్తుతున్నారు. సినిమా వాళ్లు చికాకు పడుతున్నారు. ‘చుప్’ చూశాక వీరంతా ఏమంటారో... ప్రేక్షకులు ఏ తీర్పు ఇస్తారో చూడాలి. గురుదత్ బాధకు జవాబు దర్శకుడు బాల్కి నాటి గొప్ప దర్శకుడు గురుదత్‌కు అభిమాని కావచ్చు. గురుదత్ తీసిన ‘కాగజ్ కే ఫూల్’ (1959) బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. అది మన దేశంలో తొలి సినిమాస్కోప్ చిత్రం. అంతే కాదు గురుదత్ తన మేధను, డబ్బును, గొప్ప సంగీతాన్ని, కళాత్మక విలువలను పెట్టి తీసిన చిత్రం. కాని రిలీజైనప్పుడు విమర్శకులు ఘోరంగా చీల్చి చెండాడారు ఆ సినిమాను. దాంతో ప్రేక్షకులు కూడా సినిమాను అర్థం చేసుకోలేక రిజెక్ట్ చేశారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న గురుదత్ను ఈ ఫలితం చావుదెబ్బ తీసింది. ఆ తర్వాత అతను జడిసి మరే సినిమాకూ దర్శకత్వం వహించలేదు. కుంగిపోయాడు కూడా. కాని ఆశ్చర్యం ఏమిటంటే కాలం గడిచే కొద్దీ ‘కాగజ్ కే ఫూల్’ క్లాసిక్‌గా నిలిచింది. దేశంలో తయారైన గొప్ప సినిమాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. తన కాలం కంటే ముందు తీసిన సినిమాగా సినిమా పండితులు వ్యాఖ్యానిస్తారు. ప్రపంచ దేశాల్లో సినిమా విద్య అభ్యసించేవారికి అది సిలబస్‌గా ఉంది. బాల్కీ అభ్యంతరం అంతా ఇక్కడే ఉంది. ‘కాగజ్ కే ఫూల్ రిలీజైనప్పుడు విమర్శకులు కొంచెం ఓర్పు, సహనం వహించి అర్థం చేసుకుని ఉంటే గురుదత్‌కు ఆ బాధ, సినిమాకు ఆ ఫలితం తప్పేవి’ అంటాడు. ఆ సినిమాను చంపిన రివ్యూయర్లపై ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికన్నట్టుగా ‘చుప్’ తీశాడు. గురుదత్ సినిమాల్లోని పాటలే ఈ సినిమాలో వాడాడు. -
‘ప్యాసా’గా గురుదత్ మళ్లీ మన ముందుకు
సాక్షి, న్యూఢిల్లీ : దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా త్రిపాత్రాభినయంతో బాలీవుడ్‌పై చెరగని ముద్రవేసి చిరు ప్రాయంలోనే (39 ఏళ్లు) నిజ జీవిత చిత్రం నుంచి తెరమరుగైన గురు దత్‌ను ఇప్పటికీ గుర్తు చేసుకునే వారు ఉంటారంటే ఏం ఆశ్చర్యం కలుగదు. అలాంటి కోవకు చెందిన వారే అభ్యుదయ చిత్ర దర్శకులు భావనా తల్వార్. ఆమె గురు దత్‌ను గుర్తు చేసుకోవడమే కాకుండా నేటి తరం ప్రేక్షకులకు ఆయనను పరిచయడంతోపాటు నాటి తరం ప్రేక్షకులకు సినీ కళా తపస్సీ గురు దత్, తన సినిమా జీవితంతో ముడివడిన నిజ జీవితంలో ఎదుర్కొన్న ఒడి దుడుకులను, కష్ట నష్టాలను తెలియజేయడం కోసం ఆయన ‘బయోపిక్’తో మనముందుకు వస్తున్నారు. ‘ధర్మ్ (2007)’ సినిమాతో బాలీవుడ్‌లోకి దర్శకురాలిగా రంగ ప్రవేశం చేసిన భావనా తల్వార్, గురు దత్ బయోపిక్ నిర్మాణం కోసం స్క్రిప్ట్‌ను పూర్తి చేశారు. (గురుదత్ బయోపిక్) దానికి 1957లో విడుదలైన గురుదత్ మాస్టర్ పీస్ ‘ప్యాసా’ పేరే పెట్టారు. అంతకుముందు ఆయన ఆర్‌పార్, మిస్టర్ అండ్ మిసెస్ 55 లాంటి ఆరు చిత్రాలను నిర్మించినప్పటికీ ‘ప్యాసా (దాహార్తి)’ సినిమాతో ఆయన పేరు బాలీవుడ్ చరిత్రలో దిగంతాలను తాకింది. ఆకట్టుకునే అందమైన లొకేషన్లు, హద్యమైన సన్నివేశాలు. కథానుగత సందర్భాలు, సందోర్భోచిత డైలాగులు, వీనుల విందైన పాటలు...అన్ని రకాలుగా ఆ సినిమా ప్రేక్షకుల మనసులను దోచుకుంది. గురు దత్తే ‘ప్యాసా’ చిత్రం మొత్తాన్ని భుజాన మోసుకొని తీసినట్లు కనిపిస్తుంది కనుక గురు దత్ బయోపిక్ ‘గురు దత్స్ ప్యాసా’ అని నామకరణం చేస్తేనే బాగుంటుందేమో! గురుదత్‌పై తాను తీస్తున్న సినిమా 2021లో సెట్స్ పైకి వెళుతుందని, గురుదత్‌గా, ఆయన బార్య గాయని గీతాదత్గా నటించేందుకు ఎవరిని ఎంపిక చేశారో ఇప్పడే వెళ్లడించేందుకు భావనా తల్వార్ నిరాకరించారు. చలనచిత్ర రంగానికి గురుదత్ను పరిచేయడంతోపాటు ఆయన సినీ విశ్వంలో తనదైన పాత్రను పోషించిన వహిదా రెహమాన్ పాత్రకు ఎవరిని ఎంపిక చేస్తున్నారనే ప్రశ్నకు కూడా ఆమె వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. వాస్తవానికి తాను గురుదత్, గీతాదత్‌ల ఏకైక సంతానమైన నీనా అనుమతి తీసుకోవాల్సి ఉందని తల్వార్ తెలిపారు. గురుదత్ బయోపిక్‌ను తీసేందుకు గతంలో కూడా ప్రయత్నాలు జరిగాయి. ‘ఇన్ సర్చ్ ఆఫ్ గురుదత్’ పేరిట 1989లో డాక్యుమెంటరీ తీయడమే కాకుండా 1996లో ‘ది డిఫినిటివ్ బయోగ్రఫీ గురుదత్ : ఏ లైఫ్ ఇన్ సినిమా’ పేరిట పుస్తకం రాసిన నస్రీన్ మున్నీ కబీర్ ప్రయత్నించారు. పదేళ్ల క్రితమే తాను స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని రాకేశ్ మెహ్రాతోని చర్చించానని, సంజయ్ లీలా బన్సాలీ కూడా ఉత్సాహం చూపారని కబీర్ తెలిపారు. గురుదత్లా మెప్పించే నటుడు దొరకడం కష్టం అవడమే కాకుండా ఆయనతో పరిచయమున్న నిజమైన పాత్రలను ఎలా పరిచయం చేయాలో, అందుకు వారు అనుమతిస్తారనే నమ్మకం లేకపోవడం తదితర కారణాల వల్ల ఆయన బయోపిక్‌ను తీయడాన్ని పక్కన పడేయాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. 2008లో యూటీవీ మూవీస్ కోసం గురుదత్ బయోపిక్‌ను తీసేందుకు శివేంద్ర సింగ్ దుంగార్పూర్ ప్రయత్నించారు. ఆయన అందుకు కుటుంబ సభ్యుల అనుమతి కూడా తీసుకున్నారు. అనురాగ్ కాశ్యప్ నుంచి స్క్రిప్టు సహకారం తీసుకున్నారు. గురుదత్‌గా ఆయన ఆమీర్ ఖాన్‌ను తీసుకోవాలనుకున్నారు. పలు కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ను వదులుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పుడు సినిమా షూటింగ్కన్నా, పాత్రల ఖరారు కన్నా గురుదత్ బయోపిక్‌ను తాను తీస్తున్నట్లు ముందుగానే చెప్పడానికి కారణం ఎంతో మంది పాతతరం నటీ నటులు, వారి వారసుల నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండడమేనని తల్వార్ వివరించారు. -
గురుదత్ బయోపిక్
‘ప్యాసా, కాగజ్ కే ఫూల్, షాహిబ్ బీవీ అవుర్ గులామ్’ వంటి ఎన్నో అపురూపమైన హిందీ సినిమాలను అందించిన దిగ్గజ దర్శకుడు గురు దత్ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఆయన తెరకెక్కించిన క్లాసిక్ చిత్రం ‘ప్యాసా’ టైటిలే ఈ బయోపిక్ కి కూడా పెట్టనున్నారు. తొలి చిత్రం ‘ధర్మ్’తో నేషనల్ అవార్డు అందుకున్న దర్శకురాలు భావనా తల్వార్ ఈ బయోపిక్ ను డైరెక్ట్ చేయనున్నారు. షీతల్ తల్వార్ తో కలసి భావన ఈ సినిమాను నిర్మించనున్నారు కూడా. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. నటీనటుల వివరాలు ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
‘ఆర్యన్’గా నేడు ప్రేక్షకుల ముందుకు శివణ్ణ
ప్రముఖ శాండల్‌వుడ్ నటుడు శివరాజ్‌కుమార్, నటి రమ్య ప్రధాన పాత్రల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘ఆర్యన్’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రీడా నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాలో శివరాజ్‌కుమార్, రమ్య అథ్లెట్లుగా కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చాలా వరకు బెంగళూరు నగర పరిసరాల్లోనే జరిగింది. ఇక ఈ సినిమాకు మొదట దర్శకత్వం వహించిన డీ రాజేంద్రబాబు గుండెపోటుతో హఠాత్తుగా మరణించిన నేపథ్యంలో సినిమా చిత్రీకరణలో మిగిలిన భాగానికి గురుదత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే శాండల్‌వుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న నేపథ్యంలో శాండల్‌వుడ్‌లో ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి.